తన దేశాల జర్నీని ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా చెప్పడంతో తన అసలు కథ చెప్పడం ప్రారంభించాడు డోలో. ‘రుద్ర.. నా అసలు పేరు డోలో కాదు. నిజానికి ఇది ఓ మిషన్‌కు పెట్టిన పేరు. ఆ మిషన్‌ను నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నా పేరే డోలోగా మారింది. అసలు ఈ మిషన్‌కు డోలో అనే పేరు ఎందుకు పెట్టామో తెలిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చెప్తా విను’ అంటూ మొదలుపెట్టాడు.
‘డోలో అనేది ట్యాబ్లెట్ పేరని అందరికీ తెలుసు. అదే మనం జ్వరానికి వాడే పారాసిటమాలే ఈ డోలో 650.. ఈ ట్యాబ్లెట్ వేసుకొంటే, మన శరీరంలోని 8 అవయవాలు అంటే మెదడు, రక్తం, కాలేయం, మూత్రపిండాలు, కండరాలు, ఊపిరితిత్తులు, చర్మం, జీర్ణాశయానికి సంబంధించి ఏమైనా అసౌకర్యం ఏర్పడితే, ఇట్టే నయమైపోతుంది కదూ.. ఈ డోలో ట్యాబ్లెట్ 8 అవయవాల నొప్పులను ఎలాగైతే నయం చేస్తుందో.. మేం కూడా ఈ 8 దేశాల్లో మాకు కావాల్సిన పనుల కోసం ఓ మిషన్‌ను తీసుకొచ్చాం. దానికి కూడా డోలో అని పేరు పెట్టాం’ అని డోలో చెప్పడం ముగించకముందే, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి కలుగజేసుకొని ‘ఒరేయ్ పిచ్చి సన్నాసి. ఇప్పుడు ఈ పురాణం అంతా మాకు ఎందుకురా? అసలు నీ కథ ఏంటో చెప్పు ఫస్ట్’ అంటూ కరుగ్గా ఈసడించుకొన్నాడు. దీంతో అంతెత్తున లేచిన డోలో అంతే కరుగ్గా మాట్లాడుతూ.. ‘ఈ ముసలోడికి బాగా తొందరెక్కువ ఉన్నట్టుంది. నేనొక ఫ్లోలో చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. తర్వాత మీకే నష్టం’ అంటూ డోలో అంటుండగానే.. రామస్వామిని వారించిన రుద్ర.. కొనసాగించాలంటూ డోలోకు సైగ చేశాడు.
‘రుద్ర! మా మిషన్ గురించి ఎవ్వరం బయటకు లీక్ చేసినా.. నెక్ట్స్ మినట్లో మేం చచ్చిపోతాం. అయితే, మిషన్ ఏంటో చెప్పకుండా నిన్ను ఓడించడం కంటే, అసలు ఏం చేయబోతున్నామో క్లియర్‌గా చెప్పి.. నిన్ను ఓడిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. అప్పుడేగా మా పాక్-చైనాకు అసలైన విజయం దక్కుతుంది. జాగ్రత్తగా విను.. మా మిషన్ 8 దశల్లో ఉంటుంది. నా జర్నీకి రివర్స్‌లో ఇది జరుగుతుంది. అంటే తొలి దశ చైనా నుంచి మొదలై.. చివరి దశ పాకిస్థాన్‌తో ముగుస్తుంది. తొలి దశ పేరు సూసైడ్ వెపన్. చివరి దశ పేరు మాస్ స్టెరిలైజేషన్. మధ్యలో ఇంకో 6 దశలు ఉంటాయి. అవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు అడిగే 8 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు.. ఇవన్నీ నేను జర్నీ చేసిన దేశాలకు సంబంధించినవే’ అనగానే రుద్ర ఆశ్చర్యంతో చూశాడు. ‘ఏంటీ? క్వశ్చన్లు అడుగుతాననగానే.. సైకో ట్విన్స్, నల్లమల శరత్ ఎపిసోడ్స్ గుర్తొచ్చాయా?’ అని డోలో అనగానే షాకయ్యాడు రుద్ర.
‘షాకయ్యింది చాలూ.. ఏదో పెద్ద పొడిచేసినట్టు ఆ సైకో ట్విన్స్, శరత్ ఆటను కట్టించి.. ఫుల్లు పబ్లిసిటీ చేయించుకొన్నావ్గా.. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పి.. మిగతా 6 దశల గురించి తెలుసుకో.. అలాగే, మీ ఇండియాను కూడా..’ అని డోలో ఇంకా ఏదో అనబోతుండగా.. మధ్యలో నిలువరించిన రుద్ర.. ముందు క్వశ్చన్లు అడగమంటూ సైగ చేశాడు. ‘నీకు ఈ పొగరుకేం తక్కువ లేదురా రుద్ర. సర్లే.. సైకో ట్విన్స్, శరత్ ఇచ్చినట్టు నేను ప్రతీ ప్రశ్నకు 5 సెకండ్ల టైమ్ అంటూ ఏమీ ఇవ్వను. ఎలాగో నేను చెప్పిన 8 దేశాలకు సంబంధించిన ఆన్సర్లే ఉంటాయి కాబట్టి, నా క్వశ్చన్ అయిపోగానే, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఆ వెంటనే నేను మరో క్వశ్చన్ మొదలుపెడుతాను. మధ్యలో క్వశ్చన్ల ఫ్లో దెబ్బతిన్నా.. నువ్వు మధ్యలో గ్యాప్ ఇచ్చినా.. తప్పు ఆన్సర్ చెప్పినా.. మొదటి దశ యాక్టివేట్ అయ్యి.. నేను ఇప్పుడే, ఇక్కడే కావాలనే చస్తా.. అప్పుడు మా మిషన్ గురించి నీకు ఎప్పటికీ తెలియదు. జాగ్రత్త’ అని డోలో అనగానే.. చేసేదేమీలేక సరేనని తలూపాడు రుద్ర. క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టాడు డోలో.
మొదటి ప్రశ్న: చనిపోయిన వారిని చట్టపరంగా పెండ్లి చేసుకోవడానికి అవకాశం కల్పించే దేశమేది? రుద్ర సమాధానం చెప్పాడు. రెండో ప్రశ్న: వర్క్‌ప్లేస్ బిజీగా ఉండటానికి ఫేక్ ఎంప్లాయీస్‌ను నియమించుకొనే దేశమేది? రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న: బర్త్‌డే కేకును ఫ్రెండ్ ముఖానికి పూస్తే, ఏ దేశంలో అరెస్ట్ చేస్తారు? రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న: పబ్లిక్ ప్లేస్‌లలో ఏం చేయకుండా సైలెంట్‌గా నిల్చున్నా జైల్లో వేసే దేశమేది? రుద్ర సమాధానం చెప్పాడు. ఐదో ప్రశ్న: గుడ్‌లక్ చెప్పడానికి ఫ్రిజ్‌లోని వాటర్‌ను స్నేహితుడి తలమీద పోసే వారు ఏ దేశంలో ఉంటారు? రుద్ర సమాధానం చెప్పాడు. ఆరో ప్రశ్న: దేశంలో రాష్ర్టాలు ఉండటం చూశాం. అయితే, ఈ దేశంలోపల మరో దేశం ఉంది? అదే దేశం? రుద్ర సమాధానం చెప్పాడు. ఏడో ప్రశ్న: కొన్నివారాల పాటు సూర్యుడు అస్తమించని దేశమేది? రుద్ర సమాధానం చెప్పాడు. ఎనిమిదో ప్రశ్న: కత్తిని పట్టుకొని ఉండే సింహం. ప్రపంచంలో మరెక్కడా ఉండదు. అయితే, ఈ దేశ జెండాలో ఉంటుంది. ఏంటా దేశం? అని డోలో అడగ్గానే.. చివరి ప్రశ్నకు కూడా రుద్ర కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు. దీంతో మిషన్‌లోని 6 దశలేమిటో చెప్పడం ప్రారంభించాడు డోలో. అది పక్కనబెడితే, డోలో అడిగిన 8 ప్రశ్నలకు రుద్ర ఏ సమాధానాలు ఇచ్చాడో కనిపెట్టారా?
సమాధానాలు: 1. ఫ్రాన్స్, 2. చైనా, 3. పాకిస్థాన్, 4. బెలారస్, 5. బల్గేరియా, 6. ఇటలీలో వాటికన్ సిటీ, 7. ఫిన్లాండ్, 8. శ్రీలంక.