దశాబ్ది జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
అజ్ఞాతవాసం ఆఖరున పాండవులకు జమ్మి చెట్టు ఆయుధాలిచ్చింది. రాబోయే గెలుపును సూచిస్తూ పాలపిట్ట రివ్వున ఎగిరింది. నాడు దశమి.. విజయ దశమి. ఆనాడు మొదలైన పాండవుల విజయ ప్రస్థానం.. హస్తిన హస్తగతమయ్యే దాకా నిరాటంకంగా సాగింది.
తాను సాధించిన రాష్ట్రంలో అడుగడుగునా అభివృద్ధి పల్లవించాలని తపించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సంక్షేమ ఫలాలు గడపగడపకూ చేరాలని సంకల్పించారు. ఆ విశాలమైన ఆలోచనకు విస్తృతమైన జిల్లాలు అడ్డంకిగా తోచాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ అంతటా కాళ్లరిగేలా తిరిగిన కేసీఆర్‌కు పరిష్కారమూ వేగంగానే తట్టింది. కచ్చితమైన కసరత్తు.. విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ ముగించి.. పది జిల్లాల తెలంగాణ పునర్విభజనకు ముహూర్తం నిర్ణయించారు. అప్పటికి దేశంలోనే అత్యంత పిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అతిపెద్ద పాలనా సంస్కరణ చేపట్టారు. అది 2016 అక్టోబర్ 11.. ఆనాడూ విజయ దశమే! తెలంగాణ దిశను దిద్దిన అసలు దశమి! తెలంగాణ సాధకుడు, మన కేసీఆర్ ఓ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టిన పర్వదినం. జమ్మిచెట్టు బంగారమై అందింది. పాలపిట్ట విజయసూచకంగా టపటపా రెక్కలాడించింది. సరిగ్గా దశాబ్దం కిందట 31 జిల్లాల తెలంగాణ ఏర్పాటైంది. తర్వాత రెండేండ్లకు మరో రెండు జిల్లాలు జతకలిసి.. మన తెలంగాణ ముప్పయ్‌మూడు జిల్లాల జాబిల్లిగా వెలిగింది. అభివృద్ధి ఖిల్లాలుగా ఎదిగిన దశాబ్ది జిల్లాల విజయగాథ ఇది..!
అమరుల స్ఫూర్తికి నిలువెత్తు స్తూపం అయిన తెలంగాణ రాష్ట్ర ఇంటి పెద్ద దర్వాజ తెరిచి నేటికి సరిగ్గా పదేండ్లు అయింది. సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణను ప్రగతి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. పది జిల్లాల స్వరాష్ట్రం 33 జిల్లాల తెలంగాణగా ఆవిష్కృతమైన మహత్తర దినం ఇది. కేసీఆర్ చేపట్టిన సాహసోపేతమైన చర్య నేడు తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వేదికైంది. దశాబ్ద కాలం క్రితం పురుడు పోసుకున్న ఈ జిల్లాలు ఇప్పుడు అభివృద్ధికి ఖిల్లాలుగా విరాజిల్లుతున్నాయి.
బుడి బుడి అడుగులతో మొదలైన కొత్త జిల్లాల ప్రయాణం… కేసీఆర్ సర్కార్ విజన్‌తో పురోగతి పరుగుతీసింది.
ప్రతి ఊరూ… అభివృద్ధికి పొలికేక అయి నినదించింది. సుదూర తీరాలను చెరిపేస్తూ.. రూపుదిద్దుకున్న పొదరిండ్ల లాంటి జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువైంది. చీకట్లను చీల్చుకుంటూ, పరిపాలన ప్రజల వాకిట్లకు వచ్చి చేరింది.
33 జిల్లాల పదేండ్ల ప్రస్థానంలో ప్రతి రంగంలోనూ ప్రగతి ద్యోతకమవుతూనే వచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఉపాధి, రోడ్లు, సాగు-తాగు నీటి రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వైద్యం కోసం పెద్ద పెద్ద పట్టణాలకు పరుగులు పెట్టే పరిస్థితులు పోయాయి. మామూలు గ్రామాలు మండలాలుగా… మండల కేంద్రాలు డివిజన్లుగా… డివిజన్ కేంద్రాలు జిల్లా కేంద్రాలుగా మారిపోవడంతో స్థిరాస్తి రంగం మూడు పువ్వులు.. ముప్పైమూడు కాయలుగా వృద్ధి చెందింది.

Kcr Launch The Siddipet Collectorate
ప్రతి జిల్లా గురుకుల పాఠశాలలకు వేదికగా మారి.. పేదింటి బిడ్డకు విద్య చేరువైంది. రాష్ట్రమంతా కలిపి ఆరంటే ఆరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. మరిప్పుడో.. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ దర్శనమిస్తున్నది.
ఒకప్పుడు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, గద్వాల, వనపర్తి, ములుగు, కామారెడ్డి లాంటి సాదాసీదా పట్టణాల్లోనూ తమ కేంద్రాలను ప్రారంభించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వెరసి దశాబ్ది కిందట జరిగిన జిల్లాల పునర్విభజన.. తెలంగాణ రూపురేఖల్ని సమున్నతంగా మార్చేసింది.
1905లో ఆరో నిజాం రాజు మహబూబ్ ఆలీఖాన్ పాలిస్తున్నప్పుడు జిల్లాల పునర్విభజన జరిగింది. మళ్లీ 111 ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సామాజిక తత్వవేత్త కేసీఆర్ ప్రజల చెంతకు పాలన చేరాలని… అధికారుల కోసం జనాలు రావడం కాదు, ప్రజల మధ్యకే అధికారులు వెళ్లాలని, తెలంగాణ సహజ సంపద అన్ని ప్రాంతాలకూ సమంగా పంపిణీ కావాలని గుర్తించి.. చిన్న జిల్లాల ఏర్పాటుకు నాంది పలికారు. 2016 అక్టోబర్ 11న దసరా పర్వదినం రోజున పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా ఆవిష్కరించారు. 2019 ఫిబ్రవరి 17న నారాయణపేట, ములుగు జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాల సంఖ్య 33కు చేరింది. దాదాపుగా అన్ని జిల్లాలు కాస్త అటూ ఇటుగా పది లక్షల జనాభాతో రూపుదాల్చాయి. ఒకప్పుడు కలెక్టర్, ఎస్పీలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు చూడటానికి ఏండ్ల కాలం పట్టేది. ఇప్పుడు నెలలో కనీసం నాలుగు సార్లు ఏకంగా జిల్లాలను చుట్టి వస్తున్నారు. ఇక ప్రజలు తమ అర్జీలతో జిల్లా కార్యాలయాలకు వెళ్లడం నల్లేరు మీద బండి నడకలా మారింది. అధికారుల పర్యవేక్షణ పెరుగగా, సిబ్బందికి జవాబుదారితనం అబ్బింది. జిల్లాల పునర్విభజనతో కేసీఆర్ కోరుకున్న విధంగా పరిపాలన వికేంద్రీకరణతో అన్ని రంగాల్లోనూ తెలంగాణ పురోగమించింది.
శనిగరం వద్ద ప్రారంభమయ్యే కరీంనగర్ జిల్లా పశ్చిమ కొన గంభీరావ్పేట్ మండలంగా ఉంటే, తూర్పు కొన కాళేశ్వరంగా ఉండేది. వీటి మధ్య అంతరాన్ని పరిశీలిస్తే అచ్చంగా 210 కిలోమీటర్లు. ఇక చెన్నూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 196 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. జిల్లా కేంద్రాలే కాదు, డివిజన్ కేంద్రాలకు వెళ్లాలన్నా దూరభారంతో కూడుకున్నదిగానే ఉండేది. జిల్లా కేంద్రాలకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధికీ ఆమడ దూరంలో నిలిచిపోయాయి.
– కొత్తూరి మహేశ్‌కుమార్, జగిత్యాల
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

