Daasarathi | తనివి తీరెనోయి.. మా మనసు నిండెనోయి..
ఏ దివిలో విరిసిన దివ్య‘పాళి’యో అది.. అందుకే ఆ కవిలో మెదిలిన ప్రతి భావమూ మనోహర గీతమైంది. ఒకసారి గోరంక గూటికే చేరిన చిలకలా సరసాలు ఒలికించింది. మరోసారి మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా అని వగచింది.
Daasarathi | ఏ దివిలో విరిసిన దివ్య‘పాళి’యో అది.. అందుకే ఆ కవిలో మెదిలిన ప్రతి భావమూ మనోహర గీతమైంది. ఒకసారి గోరంక గూటికే చేరిన చిలకలా సరసాలు ఒలికించింది. మరోసారి మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా అని వగచింది. ఇంకోసారి ‘తిరుమల మందిర సుందర.. సుమధుర కరుణాసాగరా’… భక్తి భావాన్ని ఉప్పొంగించింది. ఏ తీరుగ రాసినా దాశరథి పాట బతుకు వీణపై ప్రణయరాగాలు ఆలపించింది. నిదుర మబ్బులను చెదరగొట్టింది. అభ్యుదయ కవిత్వంతో అగ్నిధారలు కురిపించిన ఆయన కలం.. వెండితెరపై అమృతధారలు వర్షించింది.
‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాలో అక్కినేని హీరో. అందులో బ్రహ్మచారి హాస్టల్లో కొందరు యువకులు ఉంటుంటారు. ఆ కోతుల మూకలో ఒక పాత్ర దాశరథి పోషించారు. ఆయన కనిపించేది ఒకటి, రెండు సీన్లే! అందులో ఒక సన్నివేశంలో దాశరథి స్నానాల గదిలోకి వెళ్తూ ‘నాకు పాట రాదు..’ అంటారు. పాడటం గొప్పగా రాదేమో..! రాయటం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదేమో!! దాదాపు రెండువేల గీతాలు రాసిన కలం.. పదము పదములో మధువులూరించింది.
‘నడిరేయి ఏ జాములో…’ ఈ స్వామి పాట రాశేవారో! హాయి రేయి, చందమామ ఆనందసీమ, పున్నమి పున్నెం, పగడాల జాబిలి ఇలా అలవోకగా ప్రయోగాలు చేశారు. ఆ పాటలో నటించిన నాయికానాయకులనే కాదు.. శ్రోతలతో కూడా వెన్నెల స్నానాలు చేయించి.. మేఘాలలో వలపు రాగాలు పాడించారు. ‘ఓ బంగరు రంగుల చిలుక..’ను ‘నా మీద ప్రేమే ఉందనీ..’ పలికించింది ఆయన కలమే! ‘ఓ చెలి కోపమా.. అంతలో తాపమా.. సఖీ నీవలిగితే నే తాళజాల’ పాట వింటే సత్యాదేవిని అసలు శ్రీకృష్ణపరమాత్మ కూడా ఇంత లలితంగా బుజ్జగించి ఉండడేమో అనిపిస్తుంది.
‘వలపే వసంతములా పులకించి పూసినది.. చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి..’ పంక్తులు ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) సినిమాలోని ‘వినిపించని రాగాలే…’ పాటలోనివి. కనిపించని అందాలు అలలై మదిని కలిచి వేసే వేళ.. ఆ కాలం నాటి పడతి ఎంత హుందాగా తన మనోభావాన్ని వ్యక్తీకరిస్తుందో.. అంతే అందంగా తన రచనలో స్ఫురింపజేశారు దాశరథి. ఇంత సొగసుగా వయసును కొనియాడిన ఆయన కలం.. కాస్త చొరవ ఇస్తే గడుసుగానూ చరణాలు పల్లవించగలదు. అందుకు మచ్చు ఉదాహరణ ‘గూడుపుఠాణి’ సినిమాలోని ‘తనివి తీరలేదే.. నా మనసు నిండలేదే..’ పాట. ఇందులో రెండో చరణానికి వచ్చేసరికి కథానాయకుడు తమకంలో కూరుకుపోతాడు. ఆ మోహంలో అతగాడు పలికే పదాలను శృంగార రసగర్భితంగా ‘అందని అందాల అంచుకే చేరిననూ.. విరిసిన పరువాల లోతులే చూసిననూ..’ అని దాశరథి పండించిన తీరు అత్యద్భుతమనిపిస్తుంది.
దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా ‘ఇద్దరు మిత్రులు’. ఈ చిత్రం కోసం ఓ యుగళ గీతం రాయమని దాశరథిని కోరారు దర్శకుడు దుక్కిపాటి మధుసూదనరావు. సన్నివేశానికి తగ్గట్టు రకరకాల పల్లవులు రాసిచ్చారు దాశరథి. ‘కాస్త కొత్తదనం కావా లండీ’ అన్నారట దుక్కిపాటి. కొత్తగా అనగానే కొంటెగా రాయాలని భావించారు మన కవి. ఇంకేముంది ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ..’ హుషారుగా ఓ పాట రాసిచ్చారు.
ఉర్దూ పదాల మేళవింపుతో తమాషాగా వచ్చిన ఆ గీతం ‘హమేషా మజా’ పంచుతూనే ఉంది. ‘మూగమనసులు’ సినిమాలో సింహభాగం పాటలు ఆత్రేయ రాశారు. అందులో గౌరి పాత్రకు ఓ పాట అనుకున్నారు. అది ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పాలి. ఆమెలోని పెంకితనాన్ని వ్యక్తపరచాలి, గడుసు దనాన్ని విశదీకరించాలి. ఆ సందర్భంగా దాశరథి రాసిన ‘గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుంది..’ గీతం గోదారి వరదలా సాగిపోతుంది. అందులో ఆయన రాసిన ‘పూవు ఉంది.. ముల్లుంది.. ఏది ఎవ్వరికి ఇవ్వాలో, ఇడమరిసే ఇది ఉంది..’ పంక్తులు గౌరి పాత్రను సగర్వంగా తెలియజేస్తాయి.
యుగళ గీతాలు పరుగు పరుగున రాసిన దాశరథి.. భక్తిగీతాలు రాయడంలోనూ తనదైన ముద్ర వేశారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్ధిమంతుడు’ సినిమా కోసం ‘ననుపాలింపగ నడచి వచ్చితివా..’ పాట ఇందుకు ఉదాహరణ. భక్తి భావంలోనూ అనురక్తి ప్రదర్శిస్తూ ఆయన చూపించిన సన్నివేశం.. పోతన భాగవత పద్యాలంత మనోహరంగా ఉంటుంది.
‘అర చెదిరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ.. అర జారిన పై ఎదతో అదిగదిగో గోపెమ్మ.. ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ.. పొదపొదలో, ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా..’ అన్న ముక్తాయింపు భక్తిపాట స్థాయిని సొంపుగా పెంపుదల చేసింది. ‘రాము’ సినిమాలో ‘రారా కృష్ణయ్య..’ పాట భక్తుల విశ్వాసానికి పరాకాష్ఠగా వినిపిస్తుంది. ‘కుంటివాని నడిపించే బృందావనం.. గుడ్డివాడు చూడగలుగు బృందావనం.. అందరినీ ఆదరించు సన్నిధానం..’ అని బృందావన వైభవాన్ని కండ్లకు కట్టారు దాశరథి.
ఎన్నేసి పాటలు.. అన్నీ అజరామర గీతాలే! విన్న కొద్దీ వినాలనిపించే పాటలే! అవి వింటున్నప్పుడు దాశరథి పాటనే కాస్త మార్చి చెప్పాలంటే… ‘నిన్ను వదిలి మేము పోలేములే అది నిజములే.. నీవు లేక పాట లేనెలేదులే… లేదులే’ అని అనుకోకుండా ఉండలేం.
దాశరథి హిట్స్
గుడిగంటలు: నీలోన నన్నే నిలిపేవు నీవే..
మంచిమనిషి: ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాల..
మనుషులు- మమతలు: నిన్ను చూడనీ.. నన్ను పాడనీ..
నాదీ ఆడజన్మ: చిన్నారి పొన్నారి పువ్వూ..
ప్రేమించిచూడు: వెన్నెల రేయి ఎంతో చలి చలి..
ఆత్మగౌరవం: అందెను నేడే అందని జాబిల్లి..
లేత మనసులు: అందాల ఓ చిలుకా.. అందుకో నా లేఖ
అవేకళ్లు: హో.. హో.. ఎంతటి అందం విరిసిన సాయంలో
భక్త ప్రహ్లాద: ఆది అనాదియు నీవే దేవా..
పూలరంగడు: నీవు రావు నిదుర రాదు..
బంగారు గాజులు: విన్నవించుకోన చిన్న కోరిక..
రాము: మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి నీకేల..
ఆత్మీయులు: చిలిపి నవ్వుల నిను చూడగానే..
శ్రీదేవి: రాశాను ప్రేమలేఖలెన్నో.. దాచాను ఆశలన్నీ నీలో..
పూజ: ఎన్నెన్నో జన్మల బంధం, పూజలు చేయ పూలు తెచ్చాను
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

