నితాన్షి గోయెల్.. అని చెబితే గుర్తుపట్టడం కష్టం. ఫూల్ కుమారి అంటే మాత్రం.. బాలీవుడ్ సినిమాలు చూసేవారికి బాగా పరిచయం. తొలి చిత్రంతోనే ఆస్కార్ దాకా వెళ్లిందీ నోయిడా చిన్నది. 17 ఏళ్లకే ప్రతిష్ఠాత్మక ఐఫా అవార్డునూ అందుకున్నది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ పక్కన తక్షకుడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ సందర్భంగా నితాన్షి పంచుకున్న కార్వాన్ కబుర్లు..
ముంబైలో మాడల్‌గా కెరీర్ మొదలుపెట్టాను. 2015లో ‘మిస్ పాంటలూన్స్ జూనియర్ ఐకాన్’ టైటిల్ గెలుపొందా. బిబా, అమూల్.. వంటి బ్రాండ్స్ ప్రకటనల్లోనూ కనిపించా. తొమ్మిదేళ్లకే బుల్లితెరకు పరిచయమ్యా!
తమ కెరీర్లో ఒక్కసారైనా ఐఫా అవార్డు అందుకోవాలని నటీనటులంతా కలలు కంటారు. కానీ, నేను మొదటి సినిమాకే, అందులోనూ 17 ఏళ్లకే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం.. నా జీవితంలో మర్చిపోలేను. నా యాక్టింగ్ కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా అమ్మకే ఆ అవార్డును అంకితం చేశా.
నా వెనక నా తల్లిదండ్రుల రూపంలో బలమైన సపోర్ట్ ఉంది. బీటౌన్‌లో సక్సెస్‌తోపాటు నాకు ఎదురైన చాలెంజ్‌లు, బాధ్యతలను బ్యాలెన్స్ చేయడంలో.. నా కుటుంబం, స్నేహితులు, గురువులు నాకు అండగా నిలిచారు.
బాలీవుడ్ సీనియర్ నటి రేఖ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నన్ను ‘రేఖలా ఉన్నావు’ అని అనేవాళ్లు. ఒకప్పుడు ఆమెను బాగా ఇమిటేట్ చేసేదాన్ని. కానీ, మరో రేఖ ఉండటం అనేది అసాధ్యం కాబట్టి, ఆమెను అనుకరించడం మానేశా.
ఎంత షూటింగ్లో ఉన్నా.. నా బాల్యాన్ని నేను ఏమాత్రం మిస్ కాలేదు. అయితే, బాల్యం-పని.. రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో కొన్ని చాలెంజెస్ ఎదురయ్యాయి. అదే సమయంలో చాలా విలువైన విషయాలూ నేర్చుకున్నా.
మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా. నేను చదువులో ఫస్ట్! యాక్టింగ్‌లోనూ ఫస్ట్. చిన్నప్పట్నుంచే టీవీలో కనిపించాలనీ, స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. స్కూల్లో జరిగే డ్యాన్స్, డ్రామా పోటీల్లో తప్పకుండా పాల్గొని, బహుమతులూ గెలుచుకునేదాన్ని. నటనపై నా ఆసక్తిని గమనించిన నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. చేస్తున్న పనులను వదిలి.. నా యాక్టింగ్ కెరీర్ కోసమే ముంబైకి మారారు.
సీరియళ్లు చేస్తున్నప్పుడే క్రికెటర్ ధోనీ జీవిత చరిత్ర ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత లవ్ స్లీప్ రిపీట్, ఇన్సైడ్ ఎడ్జ్2 అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించా. ‘లాపతా లేడీస్’ చిత్రం ఆడిషన్‌కి వెళ్లేటప్పటికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఆడిషన్స్‌లో నా హావభావాలు చూసిన అమిర్ ఖాన్.. నన్ను ఫూల్ కుమారి పాత్రకు ఎంపిక చేశారు. పరీక్షల విరామంలో షూటింగ్లో పాల్గొన్నా!
‘లాపతా లేడీస్’ సినిమా విజయం ఏమాత్రం నా తలకెక్కలేదు. భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉంది. పెద్ద హీరోలతోపాటు యువనటులతోనూ తెరను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా.