‘మాతృదేవో భవ! పితృదేవో భవ !
ఆచార్యదేవో భవ! అతిథిదేవో భవ!’
అని ఉపనిషత్ వాక్యం. ఆ ఆచరణ దిశగానే సాగింది భారతీయుల ప్రస్థానం. తల్లిని మించిన దైవం లేదని అన్ని మతాలు, గ్రంథాలు చెప్పడం మనకు తెలుసు. ‘కలిసొచ్చిన అదృష్టం’, ‘బాల మిత్రుల కథ’ తదితర సినిమాల్లో అమ్మ గురించి సినారె రాసిన గీతాలు మాతృత్వపు అమృతత్వాన్ని చాటుతాయి. ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’ అన్న గజల్ మరింత ప్రత్యేకం. 1990లో ‘21వ శతాబ్దం’ చిత్రం కోసం రాసిన “అమ్మను మించి దైవమున్నదా?/ ఆత్మను మించి అద్దమున్నదా?” అన్న గీతం అమ్మ కోసం మహాకవి సినారె గీసిన అద్భుత అక్షర చిత్రం.
అటు కవిత్వంలో, గజళ్లలో, ఇటు సినీ గీతాల్లో తల్లిని గురించి అద్భుతంగా చిత్రించి, ‘అమ్మను మించి దైవమున్నదా?’ అన్న సినారె 2001లో వచ్చిన ‘ప్రేమించు’ చిత్రం కోసం కేవలం ఓ బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన తల్లి అవుతుందా? అంటారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా/ కరుణించే ప్రతి దేవత అమ్మే కదా…. కన్న అమ్మే కదా’ అని రాశారు. ఈ గీతానికి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం ‘నంది పురస్కారం’ లభించడం విశేషం.
పల్లవి
అతను: కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కరుణించే ప్రతి దేవత అమ్మేకదా!
కన్న అమ్మే కదా…
సినారె ఇతర కవితలు, గీతాల్లో లాగే ‘అమ్మ బొమ్మ’కు అర్థాలను ఎంత బాగా చెప్పారో చూడండి. తాను కన్నా, కనకున్నా సహజంగా మాతృత్వం అనేది స్త్రీలు మానవ జాతికిచ్చిన వరంగా అభివర్ణిస్తారు. కరుణించే హృదయం, ప్రేమను పంచే తత్వం ఉన్న ప్రతి దేవత అమ్మే అనడం మాతృమూర్తులకే కాదు ప్రతి స్త్రీమూర్తికీ ఇచ్చిన గౌరవం. ప్రత్యక్షంగా నాకు తెలుసు… మా ఊరు వెళ్లినప్పుడు, తన తల్లి లాంటి తల్లులు కలిసినప్పుడు సినారె వాళ్లమ్మ సింగిరెడ్డి బుచ్చమ్మ దొరసానిని యాది చేసేవారు. ఒక సభలో ‘నేను కళ్లు మూసుకున్న ప్రతిసారి నా కళ్ల ముందు కదిలేది మా అమ్మ బొమ్మ’ అంటూ చెప్పారు. సినారె వాళ్లమ్మ ఫొటో లేదు… తానున్నంత వరకు ఆ బొమ్మ తన కళ్లలోంచి చెరగొద్దని కోరుకునేవారు. ఇక మనం చెప్పుకుంటున్న ఈ గీతంలో కవి మాతృత్వానికి కేవలం గొప్ప స్థానాన్ని ఆపాదించి చెప్పడంతోనే సరిపెట్టుకోలేదు. చూడండి..
ఆమె: కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా!
రాతి బొమ్మే కదా…
చివరి పాదంలో కడుపు తీపి లేని అమ్మ ‘రాతి బొమ్మే కదా…’ అనడం ఆ మాతృత్వాన్ని గురించి ఇంకాస్త పై స్థాయిలో చెప్పడమే! స్త్రీమూర్తికి మాత్రమే చెల్లిన స్వభావాన్ని చూపించడమే.
చరణం
అతను: కణకణలాడే ఎండకు శిరసుమాడినా..
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా…
చారెడు నీళ్లయినా తాను దాచుకోక…
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ…
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు… ॥2॥
రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ…
పై చరణంలో తల్లి ప్రేమ ఎంత గొప్పదో, అది ఎలా ఉంటుందో చెప్పిన కవి సినారె ఎండా, వానా, చలి పులి లాంటివి ఎన్ని ఎదురైనా తల్లితనపు మాధుర్యం ముందు బలాదూరే అంటారు. అమ్మ తన పిల్లలకోసం చేసే త్యాగం, సేవలు వెలకట్టలేనివి, కొన్ని సందర్భాల్లో ఏ గుర్తింపునకూ నోచుకోనివి. దానిని పై చరణంలో తెలిసేలా చెబుతారు.
చరణం
ఆమె: కంటేనే అమ్మ అని…
ఆమె: ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా…
మేడకున్న అసలు ఉనికి ఆ పునాదిపైనే…
సిరులజల్లులో నిత్యం పరవశించినా…
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే…
ప్రతి తల్లికి మమకారం పరమార్థం ॥ప్రతి తల్లికి॥
అతను: కరుణించే దేవత అమ్మే కదా…
ఆమె: కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా…
రాతి బొమ్మే కదా…
పై చరణంలో చక్కని ఉపమానాలను ప్రయోగిస్తారు. ‘మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే…’ అంటూ. మమకారం మగువ జీవనానికి పరమార్థమని, అత్యంత మిక్కిలి పెద్దగా ఉన్న మేడలు, మిద్దెలు ఎంత ఉన్నతంగా వెలిగినా వాటి ఉనికికి పునాది భూమిక అంటారు. అదే కోవలో మాతృత్వం అంటూ పోలుస్తారు కవి. అన్ని అమ్మపాటలకు మిన్నగా, కమ్మగా మాతృత్వపు మమకారానికి నిర్వచనంగా సినారె రాసిన ఈ గీతం అమ్మతనపు ఆత్మగీతమే కాదు… భారతీయ స్త్రీ మూర్తి పరిచయంగా చూపిన చిత్రం! ఆయనే మరోచోట అన్నట్టు ‘… అమ్మా అని/ ఆ పిలుపే ఈ యిలకే/ కమ్మని మమతల కానుకరా’ (మనుషులు మట్టి బొమ్మలు).
-పత్తిపాక మోహన్