అపూర్వ రాగం
హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ. జరిగిన కథ.. ఈసాణుడిని, వాని అనుచరుణ్ని అంతం చేసిన జయసేనుడు మిత్రుడు వామదేవునితో, సౌగంధికతో కలిసి అంతఃపురం వైపు బయలుదేరినాడు. సన్యాసం స్వీకరిస్తానన్న భాణుసత్తికి నచ్చజెప్పి జంగిటికి తీసుకొచ్చినారు నిర్మలానంద, ప్రణాలానందులు. అక్కడ తండ్రిని చూసి ఆనంద తరంగిణిగా మారింది భాణు (రోహదేవి). తర్వాత...
కళింగలో… అంతఃపురం వైపు కోలాహలంగా వస్తున్న సాయుధులైన సైనికులను ఎలా నిలువరించాలో తెలియక సతమతమవుతున్నారు మహారాజు కళింగాదిత్యుడు; మంత్రి సురహివచ్చుడు. అంతలో భవనంలోకి దూసుకొని వచ్చిన ఒక సైనికుడు అందరినీ బలంగా పక్కకు జరుపుతూ కళింగాదిత్యుని చేరుకున్నాడు.
“మహారాజులకు జయమగు గాక!” అన్నాడు, పది గజాల దూరంలో నిలబడి, వందనం చేసి.
“ఏమిటి సంగతి?” ఆందోళనను కప్పిపుచ్చుకుంటూ అన్నాడు మహారాజు.
“సవరసత్తిని, ఆమె మనుషులను అంతం చేయడానికి ఈసాణుడు పంపిన సైన్యాన్ని చిత్తుచేసి, అందరినీ తమవైపు మళ్లేటట్లు చేసినాడు ఒక మహావీరుడు!” అన్నాడు, ఆ వచ్చినవాడు.
“ఎవరా మహావీరుడు?” ఆశ్చర్యానందాలతో అడిగినాడు రాజు.
“కొండంత బలం; గుండెల నిండా ధైర్యమున్న పోటుగాడు! అతని పేరు పోటిసుడు మహారాజా!” అన్నాడు ఆ సైనికుడు.
“పోటిసుడా!” ఇప్పుడు ఆశ్చర్యానందాలు ప్రకటించడం కుసుమ శ్రేష్ఠి వంతయింది.
“అతను నీకు తెలుసా మిత్రమా?” అన్నాడు నవ్వుతూ, కుసుమ శ్రేష్ఠితో కళింగాదిత్యుడు.
“మావాడే ప్రభూ!” అన్నాడు కుసుమ శ్రేష్ఠి నిలువెల్లా పొంగిపోతూ.
అంతలో ఒక వార్తాహరుడు వచ్చి..
“మన కోటలోని సైన్యంలో పెద్ద కలకలం బయలుదేరింది ప్రభూ!” అన్నాడు.
“వాళ్లను మేము సమాధాన పరుస్తాం!” అన్నాడు, అప్పుడే అక్కడికి వచ్చిన జయసేనుడు.
“నీవెవరు?” కళింగాదిత్యుని కనుబొమలు ముడివడ్డాయి. అప్పుడే తండ్రీ కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు!
“నాయనా! జయా!” మహోద్వేగంతో శ్రేష్ఠి.
“నాయన గారూ!” మహదానందంతో జయ.
పరస్పరాలింగనం చేసుకున్నారు! ప్రేమతో కొడుకు నుదుటిని ముద్దాడినాడు కుసుమ శ్రేష్ఠి.
విషయం కొంత అర్థమైంది మహారాజుకు.
“వీడు నా కుమారుడు జయసేనుడు!” పరిచయం చేసినాడు శ్రేష్ఠి.
అభివందనం ఆచరించినాడు జయసేనుడు.
“ఈ రాజ్యానికి పట్టిన రాహువైన ఈసాణుడిని అంతం చేసిన మహావీరుడు అతను!” అప్పుడే అక్కడికి చేరిన మలయసేహరుడు అన్నాడు.
“ఏమీ! ఆ నీచుడు… ఈసాణుడు అంతమైనాడా?” నమ్మలేనట్లు అన్నాడు మహారాజు.
“అవును ప్రభూ! ఇదంతా మా ముళక రాజ్య సేనాధిపతులు మలయసేహరుని వల్లే సాధ్యమైంది!” అన్నాడు, అతణ్ని పరిచయం చేస్తూ జయసేనుడు.
“ఏమీ! మమ్ములను కాపాడేందుకు సౌరిసంబ మహారాజు తన సైన్యాధ్యక్షులనే పంపినారా?” మరింత ఆశ్చర్యంగా అన్నాడు కళింగాదిత్యుడు.
“అవును ప్రభూ! తండ్రి కుసుమ శ్రేష్ఠుల వారిని కాపాడటానికి జయసేనుడు వచ్చినాడు…” వామదేవుడు కల్పించుకున్నాడు.
“నన్ను కాపాడటానికి ఈ వామదేవుడు, ఇతని ప్రియురాలు సౌగంధిక గొప్ప సాహసమే చేసినారు మహారాజా!” అన్నాడు జయసేనుడు.
అంతలో చిలుకవాడ నుంచి వచ్చిన సైనికులు రాజుకు జయజయ ధ్వానాలు చేసినారు, అల్లంత దూరాన నిలబడి. వాళ్ల వెనుక వందమంది ఆటవికులు ఈటెలు, బాణాలు ధరించి నిలబడి ఉన్నారు. అది గమనించిన కళింగాదిత్యుడు..
“మన సైనికుల వెనుకున్న ఆ యోధులు ఎవరు?” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఆ సంగతి నేను చెబుతాను ప్రభూ!” అంటూ సవరసత్తి పోటిసుని, చంద్రహత్థిని వెంటబెట్టుకొస్తూ అన్నది.
“సవరా! నీవు ఆ ఈసాణుడి ఒరలోని కత్తిలాంటి దానివి కదా!” అన్నాడు మహారాజు మరింత ఆశ్చర్యపోతూ.
“అది మొన్నటి వరకు ప్రభూ! వాని నిజస్వరూపం తెలిసిన తర్వాత నేను కూడా రాజభక్తిని ప్రకటించుకునే ప్రయత్నం చేసినాను!” అన్నది సవర తలవంచుకొని.
“ముందు ఆ యోధులు ఎవరో చెప్పు!” అన్నాడు, అభిమానంగా సవరసత్తిని చూస్తూ.
“వాళ్లు పోటిసుడిని, అతని ప్రియురాలు చంద్రహత్థిని కాపాడుకోవడానికి చెంచుగూడెం నుంచి వచ్చిన ఆటవిక వీరులు ప్రభూ!” అన్నది.
“ఎక్కడ ఆ ప్రేయసీ ప్రియులు?” కళ్లతో వెతుకుతూ అన్నాడు మహారాజు.
వాళ్ల వైపు చూసి, రమ్మన్నట్లుగా సైగ చేసింది సవర. వెంటనే ఇద్దరూ అక్కడికి చేరుకొని, కుసుమ శ్రేష్ఠికి, రాజదంపతులకు, చివరన సవరసత్తికి పాదాభివందనాలు చేసినారు. పోటిసుని అక్కున చేర్చుకున్నాడు కుసుమ శ్రేష్ఠి.
“మహారాజా! మీరిక విశ్రాంతి తీసుకోండి! నేను తమరి అమాత్యులతో కలిసి వెళ్లి, సైన్యాన్ని శాంత పరుస్తాను!” అన్నాడు మలయసేహరుడు.
“సేనాధిపతీ! ఇది నేను విశ్రాంతి తీసుకునే సమయం కాదు! ఇన్నాళ్లు చేసిన పని అదే! దాని పర్యవసానమే ఈ విపత్కర పరిస్థితి! ఇది పండుగ చేసుకోవలసిన రోజు. పదండి! అందరం కలిసే సైనిక పటాలాన్ని చూద్దాం! వాళ్లకు మీ విజయగాథను; వీరగాథను వినిపిస్తే ఎంతో ప్రేరణ పొందుతారు వాళ్లు!” అన్నాడు.
“నేను వీళ్లను తీసుకొని చిలుకవాడకు వెళ్లడానికి అనుమతించండి మహారాజా!” అన్నది సవరసత్తి సవినయంగా.
“అదేమీ! ఈ పోటుగాడిని మా సైనికులు మాత్రం చూడరాదా? అందరం కలిసి అక్కడికి వెళ్లిన తర్వాతనే, మీరు కోరినట్లు వీళ్లను తీసుకొని పోవచ్చు! అంతేకాదు చెంచుగూడెం నుంచి వచ్చిన యోధులందరికీ చిలుకవాడలోనే అద్భుతమైన విందు ఏర్పాటు చేయించండి! కావలసిన సంభారాలను, మనుషులను మేం పంపిస్తాం!” అన్నాడు కళింగాదిత్యుడు.
జంగిటిలో…
“ఇక నాకు సెలవిప్పించండి!” నమస్కరిస్తూ బయలుదేరడానికి సిద్ధమైనాడు సచ్చసామి.
ఇప్పుడతనిలో భయంగానీ, ఉద్వేగం గానీ, సంకోచం గానీ లేవు. ఒక మంచి పని చేసినానన్న సంతృప్తి; మంచి వాళ్ల స్నేహం లభించిందన్న సంతోషం; గండం గడిచిందన్న ఆనందం అతనిలో తాండవిస్తున్నాయి!
“మిత్రమా! నీ గురించి అందరమూ తప్పుగా ఆలోచించినాము. ఆ కారణంగా మిమ్ములను బాధపెట్టినాము. అందుకు మీరు మనసారా మమ్ములను క్షమించాలి! మీరు రైతుబిడ్డ! మాకందరికీ ఆరాధనీయులు! మీరు చేసిన మహోపకారానికి వేయి కార్షాపణాలు కానుకగా సమర్పిస్తున్నాం! ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా నేను గానీ, మా బావ కుసుమ శ్రేష్ఠి గారు గానీ మీకు అండగా ఉంటాం! నిస్సంకోచంగా మా సహకారం తీసుకోవచ్చు!”
అంటుండగానే, భటుడు వేయి కార్షాపణాల మూటను మేఘచంద్రునికి అందించినాడు.
మేఘచంద్రుడు ఆ ధనం మూటను సచ్చసామికి ఇచ్చి రెండు చేతులు పట్టుకున్నాడు.
సచ్చసామి ఆనందం మిన్నంటింది; భుజాలు గర్వంతో ఉప్పొంగినాయి. ఊరి వాళ్లందరినీ తీసుకొని ఊళ్లోకి బయలుదేరినాడు.
తర్వాత కొంచెం సేపటికి రోహాదేవి తండ్రితో ఇట్లా అన్నది…
“నాయన గారూ! నాకూ సెలవిప్పించండి! నేను ఈ శ్రమణక సోదరులతో కలిసి ఆచార్య మాధవ గారి శిష్యులలో చేరుతాను! ఈ కుటుంబంతో కలిసి ప్రయాణించే అర్హతగానీ; అదృష్టం గానీ నాకు లేవు!”
“చూడు తల్లీ! తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పును తెలుసుకొని మళ్లీ చేయకుండా ఉండగలవాళ్లే బుద్ధి జీవులు! ఇక మన అర్హతను ఎదుటివాళ్లు నిర్ణయిస్తారు; అదృష్టాన్ని కాలం నిర్ణయిస్తుంది! ఈ శ్రమణకులు ఉత్తములు కాబట్టే నిన్ను భద్రంగా గమ్యస్థానానికి చేర్చినారు. అందుకు వారికి మన రెండు కుటుంబాలు రుణపడి ఉంటాయి!” అన్నాడు మేఘచంద్రుడు.
శ్రమణకులిద్దరి హృదయాలు తేలికపడ్డాయి.
“ప్రభూ! మాకు అనుమతినియ్యండి! మేము మా ఆచార్యులను చేరుకోవాలి! ఇప్పటికే చాలా ఆలస్యమైంది!” నమస్కరించినాడు ప్రణాలానందుడు.
నిర్మలానందుడు కూడా సెలవిప్పించమన్నట్లు వందనం ఆచరించినాడు.
“మీరు చేసిన మహోపకారం మరువలేనిది స్వామీ! అందుకు కృతజ్ఞతగా బౌద్ధుల కోసం మేము ఏదో ఒకటి తప్పకుండా చేస్తాం! సమస్యలన్నీ సద్దుమణిగిన మీదట, మేం సకుటుంబ సపరివార సమేతంగా ఆచార్య మాధవుల వారిని దర్శించుకుంటాము!” అంటూ వీడ్కోలు నమస్కారం చేసినాడు మేఘచంద్రుడు.
అతనితోపాటు కూతురు రోహాదేవి, అక్క సిరిసత్తి, పరిచారిక అలసుద్ది.. ఆ ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించినారు.
ఇప్పుడు రోహాదేవి కళ్లల్లో ఏ కోరికలూ లేవు; ఆమె మనసు కడిగిన ముత్యంలా ఉంది.

Apoorva Ragam
చిలుకవాడలో…
ఆ రాత్రి అద్భుతమైన రీతిలో విందులూ, వినోదాలు ఏర్పాటు చేసింది సవరసత్తి.
చెంచుగూడెం నుంచి వచ్చిన వాళ్లకు అవన్నీ వింతగా, కొత్తగా, మాయలాగా అనిపించి మరో లోకంలో విహరిస్తున్న అనుభూతి చెందినారు.
ఆ కార్యక్రమానికి అతిథులుగా మహారాజు కళింగాదిత్యునితోపాటు కుసుమ శ్రేష్ఠి, జయచంద్రుడు, మలయసేహరుడు ఉపస్థితులైనారు.
వామదేవుడు, పోటిసుడు, సౌగంధిక, చంద్రహత్థి మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. కొంతమంది కళ్లు వాళ్లకోసం అప్పుడప్పుడూ వెతుకుతూనే ఉన్నాయి.
అప్పుడు హఠాత్తుగా పూలతో అలంకరించిన మండపం మధ్యలోకి ఆ నలుగురినీ మంగళవా ద్యాల నేపథ్యంలో తీసుకొని వచ్చింది సవరసత్తి.
సరిగ్గా అప్పుడే ఒక వార్తాహరుడు మలయసేహరుని కలిసి చెవిలో ఏదో గుసగుసలాడి వెళ్లినాడు. మలయసేహరుడు అదే విషయాన్ని జయసేనునికి; జయసేనుడు కుసుమ శ్రేష్ఠికి రహస్యంగా వినిపించినారు.
ఆ ముగ్గురి ముఖాలు ఆనందంతో వెలుగొందినాయి. అంతవరకూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్న వాళ్ల ముఖాలు ప్రకాశమానం కావడం గమనించిన మహారాజు కుసుమ శ్రేష్ఠిని..
“ఏం జరిగింది?” అని అడిగినాడు.
సిరిసత్తి, రోహాదేవి, అలసుద్దిల క్షేమ సమాచారం అది! విషయం తెలుసుకోగానే ఆగలేక, సభాముఖంగా ఆ ప్రకటన చేసినాడు కళింగాదిత్యుడు. ఆ కథ తెలిసిన వాళ్లందరూ ఎంతో ఆనందించినారు. వేదిక మీద వధూవరుల దుస్తులలో ఉన్న పోటీసుడు – చంద్రహత్థి; వామదేవుడు – సౌగంధిక కూడా ఎంతో సంతోషంతో వెలిగిపోయినారు అది విని!
తాను మాట ఇచ్చిన ప్రకారం ఆ రెండు జంటలకు వైభవోపేతంగా వివాహం జరిపించింది సవరసత్తి. కొన్నిరోజుల కింద మృత్యు భయంతో వణికిపోయిన చిలుకవాడ.. ఇప్పుడు స్వర్గసీమను తలపించింది!
ఆ రాత్రి వధూవరులను తమ తమ ఏకాంత మందిరాలకు పంపుతూ ఒక అపురూపమైన కానుకను ఇరువురికీ వేరువేరుగా ఇచ్చి, ఇట్లా అన్నది సవరసత్తి…
“దంపతులారా! ఈ లోకంలో నవ దంపతులకు ఇంతకు మించిన గొప్ప కానుక ఎవరు ఇవ్వలేరని నా అభిప్రాయం! ఇది మన హాల చక్రవర్తి లోకానికి సమర్పించిన అపూర్వ రాగం – గాథా సప్తశతి ప్రాకృత భాషలో ఉన్నది…
ప్రాకృత కవిత గన ప్రణయామృత మ్మది!
చదువ కుండ, వినక, సరసు వోలె
మాటలాడు టనగ మతిహీనతే యగు!
తెలుసుకొనుడి! ప్రేమ నిలుపుకొనుడి!
(ఈ ప్రాకృత గాథలు ప్రేమామృతమే! చదువకుండా, సరిగ్గా వినకుండా… తామే సరసులమని మాట్లాడేవాళ్లు మతి హీనులే! ఈ గాథలు తెలుసుకొని, మీ ప్రేమను పదిలంగా కలకాలం నిలబెట్టుకోండి!)” అంటూ ఆశీర్వదించింది.
ఆ మరుసటి రోజు ఉదయమే లేచి, కుసుమ శ్రేష్ఠి తన వాళ్లను అందరినీ తీసుకొని పోదన నగరానికి చేరుకున్నాడు.
అక్కడ తన కోట బూడిద కావడం చూసి చాలా బాధపడ్డాడు. కువిందుని కోల్పోవడం తలుచుకొని దుఃఖించినాడు. కానీ… తన భార్యను, కోడలిని చూసుకొని ఆ దుఃఖంతోపాటు, తన కష్టాన్ని కూడా మరిచిపోయి అమితానందాన్ని అనుభవించినాడు.
సౌరిసంబ మహారాజు తన అంతఃపురంలో మిత్రుడు కుసుమ శ్రేష్ఠి కోసం ఆరు మందిరాలు ఏర్పాటు చేయించినాడు. మల్లికాగిరి నుంచి మేఘచంద్రుని కుటుంబం కూడా తరలివచ్చింది.
ఆ రాత్రి జయసేనుడు, రోహాదేవి అమర సుఖాన్ని అనుభవించినారు.
మరుసటి రోజు ఉదయం స్నానాదికాలు పూర్తిచేసుకుని అంతఃపురంలోని శివాలయానికి వెళుతూ, కోనేటి వద్ద హఠాత్తుగా ఆగినారు.
కోనేటి ఒడ్డున అలసుద్దిని చూస్తుంటే గాథాసప్తశతిలోని మొదటి గాథ గుర్తుకు వచ్చింది జయసేనుడికి…
“శివుడు సంధ్యఁ జూచి చేయు నమస్కృతిన్
గాంచి యెఱ్ఱబారె గౌరి ముఖము
అతని దోసిలి నది యగుపించె నెఱ్ఱని
కమల మట్లు చూడు! కమలనయన!
(శివుడు సంధ్యకు నమస్కరించడానికి కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకున్నాడు. అది చూసి అతనిలో సగభాగమైన గౌరీదేవి ముఖం ఎర్రబారింది. ఆ ముఖ కమలం శివుని దోసిలి నీటిలో ఎర్రని కమలంలా ప్రతిఫలించింది!)” అన్నాడు.
ఫక్కున నవ్వింది రోహ.
ఠక్కున తలతిప్పి చూసి, లేచి నిలబడింది అలసుద్ది.
పక్కనే ఉన్న పోటిసుడు, చంద్రహత్థి అక్కడికి చేరుకున్నారు.
“సుద్దీ! నేను నిన్ను ఇష్టపడ్డ మాట నిజమే కానీ, ప్రేమించలేదు! నన్ను నాకంటే అమితంగా ప్రేమించిన ఈ చంద్రహత్థిని తప్ప ఇంకొకరిని నా సరసన ఊహించుకోలేను! నా మాట విని, ఎంతో ఉత్తముడైన చంద్రహత్థి బావ కటిలుడిని పెండ్లి చేసుకో! నీ జీవితం సంతోషభరితం అవుతుంది! అందరమూ ఆనందంగా ఉంటాం!” అన్నాడు, బతిమిలాడుతున్నట్లు పోటిసుడు.
పోటిసుడు ఇప్పుడు పనివాడు కాదు; కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి ఆప్తుడు! అతని మాట అందరికీ ఆదరణీయమైంది!
అప్పుడే అక్కడికి వచ్చిన సిరిసత్తి కూడా పోటిసుని మాటను సమర్థించింది…
“సుద్దీ! మనం ఏమేమో అనుకుంటాం! ఎన్నెన్నో కలలు కంటాం! అవన్నీ జరగవు కదా! జరిగేవన్నీ మంచికే అనుకుంటూ ముందుకు సాగడమే మనం చేయదగిన పని! పోటిసుడు అన్నమాటకు నీవు ‘ఊఁ’ అను. మిగతా వ్యవహారమంతా నేను చూసుకుంటాను!” అన్నది.
“ఊఁ!” అన్నది అలసుద్ది.
అందరూ హాయిగా నవ్వినారు.
(శుభం)
సంప్రదించిన గ్రంథాలు
1. గాథా సప్తశతీ సారం – డాక్టర్ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ
2. ప్రాకృత గాథా సప్తశతి – దీవి సుబ్బారావు
3. సమగ్ర సాహిత్య చరిత్ర – ఆరుద్ర
4. తెలంగాణ సాహిత్య చరిత్ర – డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
– దోరవేటి, 89788 71961
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

