దగ్గరైన వైద్యం
ఒకప్పుడు అనారోగ్యమొస్తే ఊరు దాటాల్సిందే! ఇప్పుడు వైద్యమే ఇంటి ముందుకొచ్చింది. ఒకప్పుడు అనారోగ్యం అంటే ఆందోళన... ఆసుపత్రి ఆమడ దూరం. అత్యవసర వైద్యం అంటే కరీంనగర్‌కో, వరంగల్‌కో, హైదరాబాద్‌కో పరుగులు తీయాల్సి వచ్చేది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఆ పరిస్థితి క్రమంగా మారింది. పాలన ప్రజల చెంతకు చేరినట్లే... వైద్య సేవలూ ఇంటింటికీ చేరువయ్యాయి.
జగిత్యాల జిల్లా ఆవిర్భావానికి ముందు పరిస్థితిని చూస్తే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. 2016కు పూర్వం జిల్లా కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి మాత్రమే ప్రధాన ప్రభుత్వ వైద్యసదుపాయంగా ఉండేది. అత్యవసర వైద్యంలో కీలకమైన ఆక్సిజన్ బెడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండేది కాదు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో 50 పడకల సామర్థ్యంతో కమ్యూనిటీ ఆసుపత్రులు ఉండగా, 14 మండలాల పరిధిలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. రాయికల్ , ధర్మపురి మండల కేంద్రాల్లో కేవలం ఆరు పడకల ప్రభుత్వ ఆసుపత్రులే ఉండేవి. వెంటిలేటర్, డయాలసిస్, ఇతర శస్త్రచికిత్సలు… ఇవన్నీ అప్పట్లో జగిత్యాల లాంటి రెండో గ్రేడ్ మున్సిపాలిటీకి దూరమైన వైద్య సౌకర్యాలే.
ప్రాణాల మీదికి వస్తే.. ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి. కానీ, జిల్లాల పునర్విభజన తర్వాత వైద్యం అందరికీ చేరువైంది. అదే జగిత్యాల జిల్లా కేంద్రంలో 650 పడకల జిల్లా ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఏర్పడింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మాతా-శిశు సంరక్షణ ఆసుపత్రి ఏర్పాటైంది. 130కి పైగా రక్త పరీక్షలు నిర్వహించే టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లు, వైరల్ వ్యాధుల నిర్ధారణ, అధ్యయనానికి వైరల్ ల్యాబ్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 15 వెంటిలేటర్లు, మూడు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటయ్యాయి. కీలక శస్త్రచికిత్సలు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహించే స్థాయికి వైద్యం ఎదిగింది. వికేంద్రీకరణతో పాలనలో ఎంతటి విస్తృతి పెరిగిందో.. వైద్య సేవల పరిధి కూడా అదే బాటపట్టింది.

Govt Hospital
జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు రావడం ప్రారంభమైంది. వారి రాకతో ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య నిపుణుల సేవలు విస్తరించాయి. సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలి కీళ్ల మార్పిడి వంటి ఆధునిక శస్త్రచికిత్సలు జరుగుతున్న దృశ్యం.. వైద్య రంగంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును తెలియజేస్తున్నది.
2016లో రాష్ట్రవ్యాప్తంగా 3,742 మంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తుండగా, 2024 నాటికి ఆ సంఖ్య 5,637కు చేరింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 671 నుంచి 885కు పెరిగింది. వీటికి తోడు బస్తీ దవాఖానాలు, పాలీ క్లినిక్‌లు, పల్లె దవాఖానాలు వంటి ప్రజలకు చేరువైన వైద్య వ్యవస్థలు మరింత విస్తరించాయి. 33 జిల్లాల పరిధిలో 274 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పటాన్ని మాత్రమే మార్చలేదు; ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన భౌగోళిక దూరాన్నీ తగ్గించింది. అందుకే 33 జిల్లాల తెలంగాణలో వైద్యరంగ ప్రగతి కేవలం ఆసుపత్రుల సంఖ్య పెరగడం కాదు… ఆరోగ్యంపై భరోసా పెరగడం, ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కుదరడం!

Mphc
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

