వేల కాళికల దసరా వేడుక!
దక్షిణ భారతదేశంలో దసరా వేడుకలు అనగానే.. ‘మైసూరు’ నగరమే కళ్లముందు కదలాడుతుంది. ఆ తర్వాత స్థానం.. తమిళనాడులోని కులశేఖర పట్టణానికే దక్కుతుంది. విజయదశమి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ‘కులై దసరా’ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. ఇక్కడికి సమీపంలోని ‘కుదిరైమొళి తేరి’.. తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం.
తూత్తుకుడి జిల్లాలో ఉన్న చారిత్రక తీరప్రాంత గ్రామం.. కులశేఖరపట్టణం. ఆధ్యాత్మికంగానే కాదు, ఎన్నెన్నో విశేషాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పల్లెటూరు ఇది. తనకే ప్రత్యేకమైన దసరా ఉత్సవాలు, సమీపంలోని ఎర్రని ఎడారి ప్రాంతం, మనపాడ్ బీచ్.. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. ఇక ఇస్రో అంతరిక్ష కేంద్రం నిర్మాణంతో సాంకేతికరంగంలోనూ తన పేరును సుస్థిరం చేసుకుంటున్నది ఈ గ్రామం.
వేలాది కాళికలు..
కులశేఖరపట్టణంలోని ప్రసిద్ధ శ్రీ ముత్తారమ్మన్ – జ్ఞానమూశ్వరర్ ఆలయం వేదికగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణ.. భక్తుల వేషధారణ. మొక్కులు చెల్లించుకునే లక్షలాది మంది భక్తులు కాళీమాత, శివుడు, వినాయకుడు, రాజులు, సన్యాసులు, వివిధ పౌరాణిక పాత్రల రూపాలు ధరిస్తారు. ముఖ్యంగా ‘కాళీ మాత’ వేషం వేయడం ఇక్కడ ప్రధానాంశం. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. వారంతా ముందుగా అమ్మవారి మాల ధరిస్తారు. 41 రోజులపాటు లేదా నవరాత్రి రోజుల్లో కఠినమైన దీక్షను ఆచరిస్తారు. ఉపవాసాలుంటూ, భక్తితో అమ్మవారి నామస్మరణ చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారి వేషధారణలో కులశేఖర పట్టణానికి తరలివస్తారు. తమ ఊళ్లలో, ప్రయాణించే దారుల్లో ఇళ్ల వద్ద భిక్షాటన స్వీకరిస్తారు. అలా సేకరించిన ధనం, వస్తువులను ఆలయానికి కానుకగా సమర్పిస్తారు. ఇక నవరాత్రుల చివరి రోజైన విజయదశమి నాడు.. సముద్ర తీరంలో అమ్మవారు మహిషాసురుడిని సంహరించే ఘట్టం (సమహారం) అత్యంత నేత్రపర్వంగా జరుగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి దేశనలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు తరలివస్తారు.

Kulashekhara Dasara
కుదిరైమొళి తేరి..
కులశేఖరపట్టణానికి సమీపంలో.. బయటి ప్రపంచానికి అంతగా తెలియని ఓ రహస్య పర్యాటక ప్రదేశమే కుదిరైమొళి తేరి. ఇదో అద్భుతమైన, ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం. ఎరుపు రంగు ఇసుక దిబ్బలు, పచ్చని చెట్లతో కూడిన ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది సాధారణ ఇసుక ఎడారుల్లా కాకుండా, పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే దీనిని దక్షిణ భారతదేశపు ‘ఎరుపు రంగు ఎడారి’ అని పిలుస్తారు. దాదాపు 12,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఎర్రని ఎడారిని ఏటా వేలాదిగా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

Kudiramolitheri
మనపాడ్ బీచ్..
కులశేఖరపట్టణానికి సమీపంలోని మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం.. మనపాడ్ బీచ్. ఇక్కడి నుంచి సముద్రం అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ సర్ఫింగ్తోపాటు వాటర్ స్పోర్ట్స్లో పాల్గొనడానికి ఎంతోమంది ఔత్సాహికులు తరలివస్తుంటారు. ఈ బీచ్ ఒడ్డునే ఉన్న కొండపై 1581 నాటి చారిత్రక ప్రాధాన్యత గల ‘హోలీ క్రాస్ చర్చ్’ ఉంటుంది. నగర శబ్దాలకు దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మనపాడ్ బీచ్ మంచి ఎంపిక.

Manapad Beach
శాస్త్ర సాంకేతిక రంగంలోనూ..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట తర్వాత.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన రెండో రాకెట్ ప్రయోగ వేదికను కులశేఖర పట్టణంలోనే నిర్మిస్తున్నది. చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగాల కోసం ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుతున్నారు.
ఇలా వెళ్లాలి..
జిల్లా కేంద్రం తూత్తుకుడి నుంచి 54 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కులశేఖరపట్టణం చేరుకోవచ్చు. చెన్నైతోపాటు తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి తూత్తుకుడికి బస్సు, రైలు సౌకర్యం ఉన్నది.

Kulashekhara Town
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

