అయ్యప్పకు పాటల నీరాజనం
తెలంగాణ పల్లెలు పాటల పూదోటలు. పల్లెపల్లెకూ తిరిగి ఆ మకరందాన్ని ఒడిసిపట్టాడు ఆయన. తేనెటీగలు మధువుని తుట్టెలో దాచినట్టు పల్లెపదాల మాధుర్యాన్నంతా ‘తెలంగాణ పల్లె పాటలు’ పుస్తకంలో నిలుపుకొన్నాడు.
తెలంగాణ పల్లెలు పాటల పూదోటలు. పల్లెపల్లెకూ తిరిగి ఆ మకరందాన్ని ఒడిసిపట్టాడు ఆయన. తేనెటీగలు మధువుని తుట్టెలో దాచినట్టు పల్లెపదాల మాధుర్యాన్నంతా ‘తెలంగాణ పల్లె పాటలు’ పుస్తకంలో నిలుపుకొన్నాడు. బాల్యంలో జానపద పూదోటలో విహరిస్తూ యవ్వన కాలానికి సినిమా పాటల జావళీల్లో తేలియాడాడు. యువరక్తాన్ని మరిగిస్తున్న తెలంగాణ ఉద్యమ వేడిలో ‘చలో ధూం… ధాం’ అంటూ ఉద్యమ గీతం అందుకున్నాడు. పాటతో అయ్యప్పకు చేరువై అపరభక్తుడిగా పాటల నీరాజనం పలుకుతున్నాడు ఈలపంటి శ్రీనివాస రాజు.
చిన్నప్పటి నుంచే పాడేవాడిని. మా నాన్న (గంగమరాజు) కూడా కళాకారుడే. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే బుర్రకథలు చెప్పేవారు. అలా పాట నాకు పరిచయమైంది. మా అమ్మానాన్న ఎప్పుడూ నా పాటకు అడ్డు చెప్పలేదు. మా అన్నయ్యలూ ప్రోత్సాహించారు. స్కూల్లో పాటల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. జిల్లాస్థాయి పోటీల్లోనూ బహుమతులు అందుకున్నాను. వివిధ సాంస్కృతి కార్యక్రమాల్లో జరిగే పాటల పోటీల్లో తప్పకుండా పాల్గొనేవాణ్ని. అలా నా బాల్యమంతా పాట చుట్టూనే తిరిగింది. మా కరీంనగర్ జానపద గాయకుడు ప్రణయ్ కుమార్, వరంగల్ సారంగపాణి పాడే జానపదాలంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ రేడియోలో జానపద గేయాలు పాడేవాళ్లు. వాళ్ల స్ఫూర్తితో నేనూ రేడియోలో పాడాలనుకున్నాను. ఆల్ ఇండియా రేడియో ఆడిషన్స్‌కి వెళ్తే బీ గ్రేడ్ వచ్చింది. దానివల్ల సోలోగా పాడే అవకాశం వచ్చింది. అలా ఇంటర్లో ఉన్నప్పుడే రేడియోలో పాడటం మొదలుపెట్టాను. రేడియోలో పాడటం కోసం పాటలు సేకరించేందుకు ఊళ్లు తిరిగాను. అలా 500 వరకు ‘తెలంగాణ పల్లె పాటలు’ సేకరించాను. పదేండ్లకు పైగా రేడియో శ్రోతలకు వందలాది పాటలు వినిపించాను.

పాటల పల్లకిలో…
కరీంనగర్, ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాను. డిగ్రీ చదువుతూ మోహన స్వామి, కట్టా సత్యనారాయణ దగ్గర లలిత సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం ఆడిషన్స్‌లోనూ బీ గ్రేడ్ వచ్చింది. డిగ్రీ తర్వాత కరీంనగర్లో కళాకారుడు ప్రభాకర్ నడిపే చిత్రకార్ స్టూడియో ఆర్కెస్ట్రాలో చేరాను. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పాటలు పాడేవాళ్లలో నేనొకడిని. ఎన్సీబీ సంగీత పరిషత్ (విజయవాడ) నిర్వహించిన రాష్ట్రస్థాయి లలిత సంగీత పోటీల్లో నాకు మేల్ సింగర్ కేటగిరిలో గోల్డ్ మెడల్ వచ్చింది. నాన్న రిటైర్ అయ్యాక మా కుటుంబానికి నా చేయూత అవసరమైంది.
అందుకే ఓ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగిగా చేరాను. ఆర్కెస్ట్రాలో పనిచేస్తూనే ఉద్యోగం చేసేవాణ్ని. కొన్నాళ్లకు నాకు హైదరాబాద్‌కు బదిలీ అయ్యింది. దీంతో టీవీ రియాలిటీ షోల్లోనూ పాడే అవకాశం దొరికింది. పాడుతా తీయగా, మార్మోగిన పాట, నవరాగం, పాటలపల్లకిలో పాడాను. ఇవే కాకుండా ప్రభుత్వం కోసం వయోజన విద్య, పల్స్ పోలియో, కుష్టు నివారణ, మశూచి నిర్మూలన పథకాల ప్రచార కార్యక్రమాలకు పాటలు పాడాను.
ధూం.. ధాం..
నేను సేకరించిన జానపదాలు కొన్ని, దిండిగల రవీందర్ రాసిన కొన్ని పాటలతో ‘జానపద తరంగాలు’ అనే ఆల్బమ్ తీశాను. దానికి మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌లో పాడే అవకాశాలూ వచ్చాయి. కొన్నాళ్లు హరీశ్‌రావు దగ్గర పనిచేశాను. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. ఉద్యమ సమయంలో రసమయి బాలకిషన్ అన్న పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఆయనతో కలిసి ‘తెలంగాణ ధూంధాం’లో అన్ని జిల్లాలు తిరిగాను. ఉద్యమ పాటలు పాడుతూనే ఆర్కెస్ట్రాలో కొనసాగాను. తర్వాత ఉద్యోగం మానేశాను. ఆ రోజుల్లో సినిమాలోనూ పాడే అవకాశం వచ్చింది. ‘విజేత’ అనే సినిమా కోసం లక్ష్మణ్ సాయి గారు నాతో ఓ పాట పాడించారు. ఆ సినిమాకు ఆదరణ లేకపోవడం వల్ల నాకు గుర్తింపు రాలేదు.
స్వామి శరణం
ఉన్న రోజు ఆర్కెస్ట్రా, ధూంధాం వేదికలపై పాటలు పాడేది. లేని రోజు ఖాళీగా ఉండేది. ఎట్లాగూ ఉద్యోగం లేదని అయ్యప్ప మాల వేసుకున్నాను. ఓ గురుస్వామితో కలిసి వెళ్తే… ఆయన నాకు రెండు, మూడు భజన పాటలు పాడే అవకాశం ఇచ్చేవాడు. అలా భజనలు పాడటం వ్యాపకంగా మారిపోయింది. 24 ఏండ్లుగా ఇది కొనసాగుతున్నది. ఏటా అయ్యప్ప భక్తి గీతాలతో ఒక ఆల్బమ్ విడుదల చేస్తుంటాను. రచయితలతో పాటలు రాయించుకుని, నేనే ట్యూన్ చేస్తుంటాను. కొన్నింటికి అల రవి, గోరంట కృష్ణ సంగీత సహకారం అందించారు.
ఎస్పీ బాలు, అనూప్ జెలోట, నెహాల్, సురేశ్ బాబుతోనూ పాటలు పాడించాను. ఈ ఏడాది ఎనిమిది అయ్యప్ప పాటలతో రూపొందించిన ఆల్బమ్ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేశాను. ఈ భక్తిగీతాలతో అయ్యప్ప మాలధారుల్లో నాకు మంచి పేరొచ్చింది. భజనలకు బాగా అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు ఎస్ఆర్ మ్యూజికల్ పేరుతో ఆర్కెస్ట్రా నడుపుతున్నాను. అయ్యప్ప సీజన్ అయిపోగానే పెళ్లి వేడుకల్లో, ప్రైవేట్ ఈవెంట్స్‌లో పాటలు పాడుతున్నాం.
పాటల సారథినై
జానపద కళారంగంలో నా కృషిని గుర్తించి ఓసారి ఆటా సంస్థ అమెరికా ఆహ్వానించింది. సన్మానించింది. రెండుసార్లు ఆటా వేదికపై పాడి అమెరికా తెలుగు వాళ్లకు జానపదాన్ని వినిపించాను. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. రసమయన్న నన్ను పిలిచి సారథిలో కళాకారుడిగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి పాటపాడుతూ తెలంగాణ సంక్షేమంలో పాలుపంచుకున్నాను. రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేస్తూ గాయకుడిగానే కాకుండా పలు వేదికలపై వ్యాఖ్యాతగానూ నా గళం వినిపిస్తున్నాను.
పన్నెండు గంటల స్వరార్చన!
‘శ్రీ మణికంఠుని స్వరార్చన’లో పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దాదాపు వంద పాటలు వరకు పాడాను. ఈ ప్రదర్శనకు శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమహేశ్వర తంత్రి గారు వచ్చారు. శబరిమలలో జరిగిన మహాకుంభ అభిషేక వేడుకకు ఆయన ఆహ్వానించారు. ఆ సందర్భంలో జరిగిన పడిపూజలో నాతో భజనలు పాడించారు.
– శ్రీనివాస రాజు
– నాగవర్ధన్ రాయల
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

