Success Story : మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఒకసారి చదువులో వెనుకబడితే అంతే అనుకుని నిరాశలోకి వెళ్లిపోతారు. కానీ పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ వైఫల్యాన్నైనా విజయంగా మార్చుకోవచ్చని ఐపీఎస్ అధికారి (IPS officer) సమీర్ శర్మ (Sameer Sharma) నిరూపించారు. సమీర్ శర్మ స్కూల్ రోజుల నుంచే మెరిట్ విద్యార్థి కాదు. పదో తరగతిలో 57 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్ ఫస్టియర్‌లో పరిస్థితి మరింత దారుణమైంది. కేవలం 34 శాతం మార్కులే వచ్చాయి.
తర్వాత సెకండియర్‌లో కొంత మెరుగుపడి ఇంటర్ పూర్తిచేసే సమయానికి 60 శాతం మార్కులు సాధించారు. అయితే అతడు ఐపీఎస్ అధికారి అవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇంటర్ అయిపోయాక బీటెక్‌లో చేరారు. కొత్త జీవితానికి అది మంచి ప్రారంభం అవుతుందని భావించారు. కానీ ఇంజినీరింగ్ ఆయనకు అత్యంత కఠినమైన దశగా మారింది. చదువులో ఇబ్బందులు ఎదురవడంతో మొత్తం 24 బ్యాక్‌లాగ్స్ పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో చాలామంది విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటారు.
సమీర్ శర్మ మాత్రం అలా చేయలేదు. తన వైఫల్యాలను జీవితానికి ముగింపు కాకుండా కొత్త ప్రారంభంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌పై దృష్టిపెట్టారు. క్రమశిక్షణతో చదవడం ప్రారంభించారు. ప్రతిరోజూ నిరంతరం శ్రమించారు. ఇతరులతో పోల్చుకోకుండా తన లక్ష్యంపైనే దృష్టిపెట్టారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివిన అభ్యర్థులను చూసి తాను తక్కువనుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకుసాగారు.
ఆ కృషి ఫలితంగా కేవలం 18 నెలల్లోనే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. ఆలిండియా ర్యాంకు 182 దక్కించుకున్నారు. 2011 బ్యాచ్ ‘ఏజీఎంయూటీ’ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం ఢిల్లీ పోలీస్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కూడా సేవలందించారు. తన గత వైఫల్యాలను సమీర్ ఎప్పుడూ దాచిపెట్టలేదు. వాటినే విద్యార్థులకు స్ఫూర్తిగా చెబుతుంటారు. విజయానికి ముందు మనసులోని భయాన్ని, ఆత్మన్యూనతను జయించాలని సూచిస్తారు.
ఇతరుల విజయాలతో మన ప్రారంభాన్ని పోల్చుకోవద్దని చెబుతారు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుందని గుర్తుచేస్తారు. లక్ష్యంపై దృష్టిపెట్టి నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక దక్కుతుందని యువతకు సందేశం ఇస్తుంటారు. సమీర్ శర్మ ప్రయాణం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. తక్కువ మార్కులు, బ్యాక్‌లాగ్స్ లేదా గత వైఫల్యాలు భవిష్యత్తును నిర్ణయించవని, వాటిని అధిగమించే పట్టుదలే మన జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళుతుందని స్పష్టంచేశారు.