ఏంజెల్ ఇన్వెస్టర్.. స్టార్టప్ యజమానుల కళ్లల్లో మెరుపు మెరిపించే పదం. కంపెనీ పెట్టాలనుకునేవారికి చుక్కానంత బలం. అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే వృత్తిగా పెట్టుకున్నారు ఓ ఓరుగల్లు బిడ్డ. మహిళల స్టార్టప్‌లకు దన్నుగా నిలుస్తూ.. మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆమె పేరు.. రేణుక బొడ్ల. ఆహా ఓటీటీ ‘నేను సూపర్ ఉమెన్’ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఈ ఏంజెల్ ఇన్వెస్టర్ సాధారణ ఉద్యోగి నుంచి స్టార్టప్ మెంటార్ దాకా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఆ మలుపులన్నీ ‘జిందగీ’తో పంచుకుంటున్నారు రేణుక..
ఫలానా రంగంలో విజయం ఎలా సాధించాలన్నది చెప్పాలన్నా, ఆ ఐడియాకు మార్కెట్‌ను ఆకట్టుకునే శక్తి ఉందోలేదో బేరీజు వేయాలన్నా.. ముందుగా మనకు ఆ విషయం మీద పట్టు ఉండాలి. అప్పుడే ఎదుటివారితో చర్చించగలం. లోతుగా విశ్లేషించగలం. నేను ఈ నైపుణ్యాన్ని జీవితానుభవాల నుంచి నేర్చుకున్నాను. కెరీర్లో చేపట్టిన ప్రతి బాధ్యత నుంచీ తెలుసుకున్నాను. స్టార్టప్‌లలో ఒడుదొడుకులు స్వయంగా చూశాను కాబట్టే, నేనే ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారాను. చదువు వేరు. కెరీర్ వేరు. మన కెరీర్ చదువుల చుట్టే తిరగాలన్న నియమం ఎక్కడా ఉండదు. అందుకు నేనే ఉదాహరణ. మాది వరంగల్. నాన్న ఆటోమొబైల్ వ్యాపారం చేసేవారు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు. నేను రెండోదాన్ని. పిల్లల విషయంలో నాన్న ఎప్పుడూ వివక్ష చూపలేదు. మేం ఏం చదువుతామన్నా చదివించారు. ఏం చేయదలచుకున్నా ప్రోత్సహించారు. నేను డాక్టరవ్వాలనుకున్నాను. కానీ రక్తమంటే భయం, దానికి తోడు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. బీ ఫార్మసీలో చేరిపోయాను. అప్పుడే కంప్యూటర్ పరిచయమైంది.
కంప్యూటర్ వైపు..
తొలిచూపులోనే కంప్యూటర్ దగ్గరైంది. భలే సరదాగా అనిపించింది. అందుకే కాలేజీ బయట ఏదో ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్స్‌లో డిప్లొమా చేశాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూనే ఫార్మసీ పూర్తిచేశాను. ఆ వెంటనే పెళ్లయింది. ఆయనతో కలిసి అమెరికా వెళ్లి పోయాను. అక్కడ ఉద్యోగం రావడానికి కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉపయోగ పడింది. ఒక సంస్థలో వెబ్ డిజైనర్‌గా చేరాను. తర్వాత ఒరాకిల్, సిస్కో, జీఈ లాంటి సంస్థల్లో టీమ్ లీడ్‌గా, మేనేజర్‌గా, విభాగాధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశాను. నోవార్టిస్ బయోమీ ఇండియాకు హెడ్‌గానూ పనిచేశాను. ఈ బాధ్యతల మధ్యలోనే కలకత్తా ఐఐఎం నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. ఆ సమయానికి పాపకు రెండేండ్లు. పసిదాన్ని చూసుకుంటూనే చదువుకోవడం, పని చేయడం కష్టమనిపించింది. అయినా పట్టుదలతో బ్యాలెన్స్ చేశాను. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగు పరచుకుంటేనే వృత్తిలో ముందుకు వెళ్లగలమనే నమ్మకమే ఇందుకు కారణం.
టీ హబ్ పెట్టడంతో..
ఉద్యోగపరంగా మంచి పదవుల్లో ఉన్నా.. సొంతంగా సంస్థ నడపాలన్నది నా చిరకాల వాంఛ. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్టార్టప్‌ల ప్రోత్సాహానికి టీ-హబ్‌ను నెలకొల్పడం ఆ ఉత్సాహానికి ఊతమిచ్చింది. విభిన్న విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండటం, అదే సమయంలో ప్రభుత్వ భరోసా లభించడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇంక్యుబేషన్ సెంటర్, టీ హబ్‌లో స్టార్టప్స్ కోసం మార్కెట్ రీసెర్చ్ చేసిపెట్టే ‘ఎర్లీ పాడ్’ సంస్థను నెలకొల్పాం. దానిలో పనిచేస్తున్నప్పుడు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పెట్టుబడుల కోసం పడుతున్న ఇబ్బందులను చూశాను. అంతకు ముందు కాస్తో కూస్తో సంపాందించాను కనుక, అసలు నేనే ఇన్వెస్టర్ అయితే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. అలా స్టార్టప్‌లకు ఆర్థిక సాయాన్నీ, ఎదుగుదలలో సలహానూ అందించే సిల్వర్ నీడిల్ అనే సంస్థలో వెంచర్ పార్ట్ట్‌నర్ అయ్యాను. కొత్త కంపెనీలకు డబ్బు సమకూర్చే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సీడ్ ఫండ్ గ్రూప్, హైదరాబాద్ ఏంజెల్స్లాంటి సంస్థల్లోనూ పనిచేశాను.
ఆడవాళ్లకు సాయపడాలని కొత్తగా వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి ముందుకు వచ్చేవాళ్లకు ఆర్థికంగా చేయూత ఇవ్వడం ఒక సంతోషమైతే.. తమకాళ్ల మీద తాము నిలబడటంతో పాటు నలుగురికీ బతుకునివ్వాలని ఆశపడే మహిళలకు సాయపడటం మరింత ఆనందకరం. నా ప్రొఫైల్ చూసి ఆహా వాళ్లు తమ షో కోసం నన్ను సంప్రదించారు. “నేను సూపర్ ఉమెన్.. పేరిట మహిళా ఆంత్రప్రెన్యూర్ల కోసం కార్యక్రమం చేస్తున్నాం, మీరు మాతో కలుస్తారా…’ అని అడిగారు. అలా ఇందులో నేను ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారాను. చాలా మంది ఆడపిల్లల్లానే నేను కూడా కెరీర్లో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను. పిల్లల అవసరాలకు తగ్గట్టు కొన్నిసార్లు గ్యాప్ తీసుకున్నాను. అది తల్లిగా నా బాధ్యత కూడా. ఈ ప్రయాణంలో నా భర్త సహకారం ఎంతో ఉంది. అయితే విరామం తీసుకున్న ప్రతిసారీ మరింత వేగంగా ముందుకెళ్లేలా నా నైపుణ్యాలు పెంచుకున్నా. ఇలా ఎవరైనా చేయవచ్చు. ఇటు ఇంటినీ, అటు కెరీర్‌నూ తప్పక విజయవంతంగా నడపొచ్చు. అలాంటి వాళ్లకి మెంటారింగ్ అందించే ప్రయత్నమూ చేస్తున్నా. ఇప్పటికే వివిధ బిజినెస్ స్కూళ్లూ, కాలేజీల్లోని ఇంక్యుబేషన్ సెంటర్లలో విద్యార్థులకు మెంటార్షిప్ చేస్తున్నా. మరింత ఎక్కువ మందికి గెలుపుదారి చూపించడమే నా లక్ష్యం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి