మనుషుల్ని చాలామంది ఏదో ఒక లక్షణంతో గుర్తు పెట్టుకుంటారనుకుంటా! అయితే, అందులో కూడా కొంచెం ఎక్కువసార్లు శాడిజం ఉంటుందేమో! అననిపిస్తుంది. ఎర్రోడు, కర్రోడు, ఎత్తు పండ్లోడు, సందు పండ్లోడు, పాసు పండ్లోడు, పంగ కాళ్లోడు, ఉంగురాల ఎంటికలోడు, ఊసు కండ్లోడు, పొట్టోడు, పొడుగోడు, బొర్రోడు.. ఇలా మగవాళ్లను పోల్చుతుంటారు.
ఆడవాళ్లనయితే చిప్పిరి ఎంటికలది, బక్కది, దొడ్డుది, కర్రెది, ఒంకెర పాపిటది, చక్కటి పాపటిది, మీది కండ్లది, లబ్బ ముక్కుది ఇట్లాంటి పోలికలతో గుర్తు పెట్టుకుంటారు. అయితే, అమ్మాయిలను కొన్నిసార్లు అందమైన పోలికలతో కూడా గుర్తిస్తారు. చారెడేసి పెద్ద కళ్లపిల్ల, పొడుగు జడ పిల్ల, పసిమిరంగు పిల్ల, చామన ఛాయ పిల్ల, సన్నటి నాజూకు అమ్మాయి.. ఇలాగన్న మాట. సరే, చూడగానే కనిపించేది బాహ్యరూపమే గనుక మొదట్లో ఒకటి రెండుసార్లకు అలా అంటారనుకుంటే పొరబాటే. కొంత పరిచయం పెరిగాక కూడా వాళ్ల పేరుతో గుర్తించాలి. లేదా వాళ్లల్లో మరేదన్నా ప్రత్యేకత ఉంటే దాన్ని కూడా జత చేయాలి. కానీ, లోపాలను గుర్తుపెట్టుకోవడం అన్యాయం కదా యువరానర్? ఇదంతా ఇప్పుడెందుకంటే.. నేను కూడా అలాంటివి ఎదుర్కొన్నాను అని చెప్పడానికి. మా అక్క ఇంటర్లో చేరిన తర్వాత నేను పదో తరగతిలో ఉన్నప్పుడు.. ఓసారి అక్క దగ్గరికి హన్మకొండకు వెళ్లాను. అక్క ఉండేది మా కజిన్ లక్ష్మి అక్క ఇంట్లోనే.
ఆ మర్నాడే కాజీపేటలోని అక్క తన ఫ్రెండ్ సరోజక్క ఇంటికి నన్ను తీసుకెళ్లింది. ఇంకో ఫ్రెండ్ ఇంద్రాణి కూడా అక్కడికి వచ్చింది. సరోజక్క వాళ్ల తమ్ముడు రాజు అప్పుడు ఆర్ఈసీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మేము వెళ్లేసరికే ఆయన స్నేహితులు కొందరు మాట్లాడుకుంటూ, జోకులేసుకుంటూ ఉన్నారు. అక్క వాళ్లందరికీ అదివరకే తెలుసు.
మేము వెళ్లగానే రాజు.. “తను సంధ్య మీకు తెలుసుగా! తిను రమ అనీ.. (ఏమో మరి. కొందరు తనుకు బదులు తిను అనేవారు) సంధ్య వాళ్ల చెల్లెలు. టెన్త్ చదువుతోంది. చాలా ఇంటెలిజెంట్” అని నన్ను తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేశాడు. నేను నమస్కారం పెట్టి లోపలికి వచ్చాను. కొంచెం భయం కలిగింది కూడా. ఎంతైనా ఆర్ఈసీ స్టూడెంట్స్ అంటే గొప్పే కదా!
నా వెనకే ఓ కామెంట్ దూసుకొచ్చింది. “అబ్బ! ఏం తెలుపురా ఆ అమ్మాయి! కడుపులో తిప్పుతోంది”. వెంటనే రాజు గొంతు వినిపించింది. “అదేంటి సీనూ! అలా అనేసావు? రమది పచ్చటి పసిమి ఛాయ. తెలుపు కూడా కాదు. అయినా తను వింటే?!”
“ఏమోరా! అలా అనిపించింది, అనేశాను” అలా అన్నతను బారు శ్రీనివాసరావు. హనుమకొండలోని నక్కలగుట్టలో కాళోజీ గారి ఇంటి దగ్గర్లోనే వాళ్లిల్లు. “ఏం ఫీల్ కాకు రమా! మనక్కూడా టైమొస్తది” ఇంద్రాణి నన్ను ఓదార్చబోయింది. నాకు ఆ పదమూడేళ్ల వయసులో ఫీల్ అవడం, కాకపోవడం, లైట్ తీసుకోవడం లాంటివి తెలిసి చస్తేగా! “ఎహె! నేనేం ఫీలయిత లేను. ఆయన అభిప్రాయం, ఆయనిష్టం” అన్నాను నిజంగానే. అయితే మరో ఆర్నెల్లకో ఏమో సరిగ్గా గుర్తులేదు గానీ, ఓసారి సరోజక్క వాళ్లుండే కాజీపేట రైల్వే క్వార్టర్స్ దగ్గర నేనూ, ఇంద్రాణీ, మా అక్కా, సరోజక్కా, విజయా అందరమూ భద్రకాళి గుడికెళ్దామని సిటీ బస్సెక్కాం. రెండు స్టాపుల తరువాత బస్సు ఆర్ఈసీ దగ్గర ఆగినప్పుడు.. సీను అన్నాయన, ఇంకో ఫ్రెండు బస్సెక్కారు. అప్పటికే బస్సు నిండి పోవడంతో పైన రాడ్‌కు ఉన్న హ్యాంగర్ పట్టుకుని నిలబడ్డాడు సీను.
బస్సు వెళ్తుండగా ఎవరో అడ్డొచ్చేసరికి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసాడు. సీను అమాంతం హ్యాంగర్‌తో సహా చాలా ముందుకు తోసుకొచ్చి పడిపోబోయి.. మేము కూర్చున్న సీటును చేత్తో పట్టుకుని ఆగిపోయాడు. అందరూ ఫక్కున నవ్వారు. నిజానికి ఎవరైనా పడినప్పుడు మొదట నవ్వు వస్తుంది. తరువాతనే ‘అయ్యో పాపం’ అంటాం. “అయ్యో సీనూ! దెబ్బ తగిలిందా!” అని సరోజక్క లేచి అతన్ని పట్టుకుంది. “ఏం లేదు! ఏం కాలేదు” అన్నాడే గానీ, అతని మొహం ఎర్రగా అయింది. కళ్లల్లోంచి నీళ్లు వచ్చాయి. “ఏం కాలేదేంటి? నా సీట్లో కూర్చో. మొహం టమాటో పండులా అయింది” అన్నది సరోజక్క. అతను పడ్డందుకు కాదు గానీ, ఆ సమయంలో ఆ పోలికకు నవ్వొచ్చింది. ఇప్పటికీ ఉక్రోషంతో ఎర్రబడ్డ ఎవరి మొహం చూసినా ఆ పోలిక గుర్తొస్తుంది.
నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌కు వచ్చేటప్పటికి ఆ ఎండాకాలంలో మా కజిన్ లక్ష్మి వాళ్లు గౌలిగూడలోని ఇంటినుంచి చార్మినార్ అవతల హరిబౌలి అనే చోట ఉన్న పెద్ద దేవిడీకి మారారు. దానిని బేలా చౌరస్తా అనేవారు కూడా. ఒకసారి టైలర్ దగ్గరికని మేము వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ఏడెనిమిదేళ్ల పిల్లవాడు నన్ను చూసి పక్క పిల్లవాడితో.. “కిత్నా గోరీ హై దేఖ్! గోర్ గోరీ! గోర్ గోరీ!” అనడం మొదలుపెట్టాడు. “ఏయ్ చుప్! మజాక్ కర్ రే క్యా?” అంటూ లక్ష్మి వాడి వెనక పరిగెత్తింది గానీ, వాడు పక్క సందులోకి తుర్రుమన్నాడు. “వాడు అన్నది నిన్నేనే!” చెప్పింది లక్ష్మి. నాకు టెన్త్ క్లాసులో హిందీలో బాగానే మార్కులు వచ్చాయి కానీ, ఈ ‘గోరీ’కి ఇంకో అర్థం తెలీదు. ‘గోరీ’ అని నన్నెందుకు అన్నాడో అర్థమై చావలేదు. మా ఊర్లో ముస్లింల ఖబర్‌స్థాన్‌లో సమాధులను గోరీలు అంటారు. నన్ను సమాధితో పోల్చడానికి నేను వాడికి ఏమి ద్రోహము సలిపితిని? ఆలోచించి మొత్తానికి లక్ష్మినిఅడిగాను. తను ఆపకుండా ఓ పది నిమిషాలు నవ్వి.. “ఇంటికి పోయినాంక చెప్త” అంది.
ఇంటికెళ్లాక అందర్నీ కూచోబెట్టి నవ్వీ నవ్వీ హరికథలాగా వర్ణించి, వర్ణించి చెప్పింది. “అయితేంది? ఆమె తెల్లగ ఉన్నదని ‘గోరీ’ అన్నడు. అంత సస్పెన్సు ఏంది చెప్పేదానికి?” అని పద్మ చిన్నమ్మ కోప్పడి.. “ఏం లేదురా రామయ్యా! ‘గోరీ’ అంటే తెల్లటి పిల్ల అని, గంతే!” అన్నది. మరి కాసేపు ఏడిపిద్దామనుకున్న లక్ష్మి.. “అబ్బా! ఎందుకు జెప్పినవమ్మా!” అని గింజుకుంది. ఆ తరువాత జేసుదాసు స్వరంలో ‘చిత్ చోర్’సినిమాలోని ‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ విన్నప్పుడల్లా.. ‘గోర్ గోరీ’ అన్న ఆ పిల్లవాడు గుర్తొస్తాడు.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి