ఆ మెడలో ద్రవ్యం కలదు.. నందిపై రాసిందెవరో తెలియదు!
‘ఆ మెడలో ద్రవ్యం కలదు’ అని ఆనాడు నందిపై రాసిందెవరో తెలియదు. కానీ, ఎప్పటినుంచో దానిని ‘ఆమడలో ద్రవ్యం కలదు’ అని అర్థం చేసుకున్న వాళ్లెందరో గుప్తనిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
వెలుగు ఏనాడో మాసిపోయింది. నీడలాంటి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయింది’ అనుకుంది చంద్రమ్మ.
ఇది ఆమె ప్రతిరోజూ ఉదయంపూట అలవాటుగా అనుకునే మాటే.
పూలసజ్జతో ఇంటిలోనుంచి కాలు బయట పెట్టగానే.. తన ముందు పడిన నీడను చూసుకుంటుంది. పడమటి దిక్కుగా అడుగు ముందుకు వేస్తుంటే తన నీడ ముందస్తుగా అడుగులు వేయడాన్ని ఆసక్తిగా గమనిస్తుంటుంది. నడుస్తున్నంతసేపూ ఏవేవో గొణుక్కుంటూ ఉంటుంది. ఇది ప్రతిరోజూ ఆమె అలవాటుగా చేసే పని.
ఈ రోజు కూడా అలాగే నడుస్తోంది. ఆమె మెడ బోసిగా ఉంది. నుదుట విబూది రేఖలున్నాయి. కుంకుమ నిండుకుంది. ఆమె చేతిలో పూలున్నాయి కానీ, కొప్పులో లేవు. ఆమెకు సుమారు పాతికేళ్ల వయసుంటుంది. కాలం ఆమెకు లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది.
దాదాపు ఒక ఘడియకాలం నడక తర్వాత చంద్రమ్మ ఉదయ సముద్రం ఒడ్డుకు చేరుకుంది. కాళ్లు కడుక్కోవడానికి చెరువులో దిగబోతూ నీటిలో తన నీడను చూసుకుంది. ఒక అడుగు లోపలికి పెట్టేసరికి, గట్టుమీది నాచును తినడానికి వచ్చిన చేపలు కొన్ని చంద్రమ్మ కాళ్ల చుట్టూ చేరాయి. నీటిలో కాళ్లు కదుపుతుంటే అలల తాకిడికి ఆ నీటిలోని తన నీడ చెదిరిపోవడాన్ని మౌనంగా పరిశీలించింది చంద్రమ్మ. ఒకసారి తల పైకెత్తి ఆకాశం వంక చూసింది. ఒకప్పుడు ఆ చేపల స్పర్శకు తనకు చక్కిలిగింతలు కలిగిన దృశ్యం తాలూకు ఛాయలేవో ఆకాశంలో కనిపించి కాబోలు.. విరాగిలా నవ్వుకుంది.
కాళ్లు కడుక్కుని వెనుదిరిగితే ఎదురుగా ఛాయా సోమేశ్వరాలయం దర్శనమిచ్చింది. చంద్రమ్మ మెల్లిగా అడుగులు వేస్తూ గుళ్లోకి వెళ్తోంది.
ఆరోజు కార్తికమాస సోమవారం. న్యాయంగా అయితే ఆరోజున భక్తజనుల కోలాహలం ఇబ్బడిముబ్బడిగా ఉండాలి. రెండేళ్ల కిందటివరకు అంతే. కానీ ఇప్పటి కథవేరు. ఆలయంలో చంద్రమ్మ మినహా దాదాపుగా ఎవరూ లేరు. త్రికూటాలయానికి ఎడమవైపున ఉన్న ఆత్మలింగాన్ని దర్శించింది చంద్రమ్మ. పూలసజ్జలోంచి ఒక పువ్వును తీసి, స్వామికి సమర్పించింది.
‘అసలు ఈ స్వామియే ఇక్కడ ప్రధాన దైవమట’ అనుకుంటూ మనస్ఫూర్తిగా ఆ లింగానికి నమస్కరించింది.
* * *
సామాన్యశకం 1136కి సమానమైన నలనామ సంవత్సరంలో.. ఏరువ సింహాసనాన్ని కందూరి ఉదయన చోడ మహారాజు అధిష్ఠించాడు. రాజ్యమంతటా గొప్ప తటాకాలను, ఆలయాలను నిర్మించి.. ఎన్నింటికో భూరి విరాళాలిచ్చిన ఉదారుడాయన.
ఒకరోజు ఆ మహారాజు కొలువుకూటానికి కొందరు ఒక వార్త తీసుకువచ్చారు.
‘పచ్చల సోమేశ్వరాలయానికి కూతవేటు దూరంలో సహజసిద్ధంగా నీటిచెలమ పుడుతోంది. కొద్దిదూరంలోని శివలింగం లాంటి ఒక రాతిని ఆ చెలమ అభిషేకిస్తోంది’ అని.
ఉదయన చోడుడు ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళ్లాడు. అతనితోపాటు జలార్గళ నిపుణులు కూడా ఉన్నారు. నేల కిందనుంచి ఎంతదూరం ఆ నీరు ప్రవహిస్తోందో లెక్కలు వేసి చూశారు.
“మహారాజా! దీనికి ఎగువగా ఒక గొప్ప తటాకాన్ని నిర్మింప చేయండి. ఆ తటాకం నుంచి వచ్చే నీటితోనూ, ఇక్కడి సహజ జలధారలతోనూ కొన్ని వందల మర్తుళ్ల భూమిని సస్యశ్యామలం చేయవచ్చు. అలాగే ఇక్కడొక శివాలయాన్ని నిర్మింప చేయండి” అని సూచించారు.
ఉదయన చోడుడు అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ముందుగా తన పేరుతో ఉదయాదిత్య సముద్రాన్ని నిర్మింప చేశాడు. దానికి అనుబంధంగా ఉండే చెరువులను కూడా తవ్వించడం పూర్తి చేసేలోపుగా.. మహారాజుకు వార్ధక్య ఛాయలు పొడచూపాయి. తన కుమారులైన భీమదేవ, గోకర్ణ దేవులిద్దరికీ చోడ సింహాసనాన్ని అప్పగించాడు.
భీమదేవ చోడుని పర్యవేక్షణలో పానుగల్లులో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది.
మరోపక్క కాకతి రుద్రదేవుడు మధ్యందిన మార్తాండుడై నిప్పులు చెరుగుతున్నాడు. అతను ఉన్నట్టుండి ఒకసారి కందూరు రాజధాని అయిన వర్ధమానపురాన్ని ముట్టడించాడు. కోటద్వారాలు పగులగొట్టించి, పురాన్ని దహించివేశాడు. మహా పరాక్రమశీలిగా పేరుగాంచిన భీమదేవ చోడుడు హడిలిపోయి, పరివార సమేతంగా అడవులు పట్టిపోయాడు.
కాకతీయ రుద్రదేవుడు అంతటితో వదలకుండా అతణ్ని వెంబడించాడు. భీమదేవుడు సంధి చేసుకుని, సామంతునిగా ఉండటానికి అంగీకరించాడు. అంతేకాకుండా తన చెల్లెలైన పద్మావతీదేవిని రుద్రదేవుడికిచ్చి పెళ్లి చేశాడు.
* * *
చంద్రమ్మ ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టివచ్చింది. శిథిలమైపోయిన ప్రాకార దేవతల ఆలయాలను చూస్తూ… రెండేళ్ల కిందటిదాకా తానక్కడ చూసిన రూపాలను మనస్సులో స్మరించుకుంటూ… ఒక్కొక్క పువ్వు చొప్పున సమర్పించుకుంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించింది.
ఎదురుగా రంగమంటపం. నాలుగువైపులా సుందరశిల్పాలతో కూడిన నాలుగు స్తంభాల నడుమ వెలిసిన చిన్ని మంటపమది. ఒకసారి మంటపంలో నిలిచి తల పైకెత్తి చూసింది చంద్రమ్మ. అష్టదిక్పాలకుల బొమ్మలు దర్శనమిచ్చాయి.
సరిగ్గా ఆ మంటపంలోని బొమ్మల్లో చెక్కినట్టుగా… కుబేర స్థానమైన ఉత్తర దిక్కుకు సమాంతరంగా ఒకప్పుడు విష్ణులింగం ఉండేది. అక్కడ ప్రస్తుతం ఖాళీగా ఉంది. కుడివైపు తిరిగితే ఇంద్రస్థానంలో తూర్పుదిక్కున సూర్యలింగం ఉండాల్సిన స్థానాన్ని ఒకసారి పరికించింది. ఆ చోటుకూడా ఖాళీగా ఉంది. ఆ సూర్యలింగం తన ఎదురుగా నందితో సహా మాయమైంది.
ఇక వెనుకకు తిరిగి, వరుణ స్థానమైన పడమటి దిక్కున అంటే తూర్పునకు అభిముఖంగా నిలిచిన ఛాయాసోమేశ్వరుడిని దూరం నుంచే చూసి నమస్కరించింది. వెలుగులను రెండుగా చీలుస్తూ వెలిసిన స్తంభాకారంలోని నీడ తనను నిత్యమూ అర్చిస్తుండగా అభినవ సోమేశ్వర లింగం ఠీవిగా నిలబడి ఉంది.
* * *
పానుగల్లులో పచ్చల సోమేశ్వరాలయం ముందే ఉంది. కొత్తగా నిర్మించిన ఈ ఆలయానికి చోడులు పెట్టిన పేరు అభినవ సోమనాథాలయం. ఈ నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఉదయన చోడుడు కాలం చేశాడు. భీమదేవ, గోకర్ణదేవ చోడులిద్దరూ ఒకేసారి ఏరువ సింహాసనాన్ని అరమరికలు లేకుండా పాలించసాగారు.
ఆలయాన్ని చూడవచ్చిన భీమదేవ చోడుడు..
“సాయణ్నా! వెలుగు కిరణాలు స్వామిని తాకేలా ఆలయాన్ని నిర్మించి ఉంటే బాగుండేది కదా!” అన్నాడు యాథాలాపంగా.
ఆ మాటలతో ఆలయ ప్రధాన శిల్పి అయిన సాయణ్ణ.. పాపం దిగులుపడ్డాడు.
తన ప్రతిభకు దొరికిన సన్మానం ఇదేనా!?
అని నిరాశ చేసుకున్నాడు.
పురోహితుడైన దామోదర భట్టు ఇలా సర్ది చెప్పాడు.
“మహారాజా! సూర్యకిరణాలైతే ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఇది నీడ. సూర్యగమనంతో పాటే కదిలే నీడ నిజానికి ఒకసారి ఓ దిక్కులోనూ, మరోసారి మరోదిక్కులోనూ పడాలి. కానీ ఏ ఋతువులోనూ, ఏ అయనంలోనూ కదలని స్థిరమైన నీడను ఇక్కడ శిల్పి కనుగొన్నాడు. దీనికి అతణ్ని మనం అభినందించాలి. మరోవిశేషం… పగలే కాదు, పున్నమి వెలుగుల్లో కూడా ఈ నీడను చూడవచ్చు. అలాగే మీరు కోరిన వెలుగును కూడా ఆలయంలో దర్శించవచ్చు. కానీ, దానికి గ్రహణ సమయం రావాలి. ఇక ఈ ఆలయం నిర్మించడానికి తలపెట్టే నాటికి కల్యాణీ చాళుక్యుల నుంచి స్వాతంత్య్రం తెచ్చుకున్న మీ చోడవంశం… ఇప్పుడు కాకతీయుల ఛత్రఛాయలోకి చేరుకోవడం యాదృచ్ఛికం. మళ్లీ మన రాజ్యం స్వతంత్రాన్ని పొందకపోవచ్చు. కానీ, మీ బంధుత్వం పదికాలాలపాటు పచ్చగా ఉండాలి. మీ చెలిమి ప్రజలందరికీ మేలు చేకూర్చేది కావాలి”.
భీమదేవ చోడుడు ఆయనకు నమస్కరించాడు. గోకర్ణదేవుడు అన్నను అనుసరించాడు. ఆలయ కుంభాభిషేకానికి కాకతీయ సామ్రాట్టు పక్షాన ఆయన తంత్రపాలుడైన మల్లినాథుడు విచ్చేశాడు.
ఆ సమయంలో దామోదర భట్టు ఇలా ప్రసంగించాడు…
“ఇది త్రికూటాలయం. ఇక్కడ ప్రతిష్ఠితమైన ప్రధాన లింగం తూర్పును చూసే తత్పురుష లింగం. ఈ లింగాన్ని సృజనాత్మకతకు సంకేతంగా చెబుతారు. ఈ ఆలయం మన శిల్పి సాయణ్ణ అద్భుత ప్రతిభకు తార్కాణం. కాగా పరమేశ్వరుని అయిదు ముఖాల్లో తత్పురుష ముఖం మనల్ని మాయ నుంచి వెలుపలికి తీసుకువస్తుందని పెద్దలు చెబుతారు. సాయణ్న ఆ మాయనే ఈ గుడిలో నీడగా మలిచాడు. ఛాయాదేవి సూర్యదేవుని ఇల్లాలే కాకుండా, శనిదేవునికి తల్లి కనుక… ఈ స్వామిని అర్చిస్తే శనిదోషాలు తొలగిపోతాయని మీరు భావించండి. మరేం ఫరవాలేదు. కానీ దానికంటే ముందు మరికొన్ని విలువైన మాటలు చెప్పాల్సి ఉంది. ఈ ఆలయంలో సోమనాథ లింగం కంటే పవిత్రమైనది ఆత్మలింగమే. మొదట ఇక్కడ పుట్టిన అలుగులోని నీరు ఈ ఆత్మలింగాన్ని అభిషేకించడం చూసిన తర్వాతే ఈ ఆలయాన్ని మన మహారాజుగారు నిర్మించారు. కనుక ఆత్మలింగమే ఈ ఆలయానికి మూలాధారం. జిజ్ఞాసువు అయిన మానవుడు ఏ పద్ధతుల్లో అయినా ప్రయత్నపూర్వకంగా ఆత్మను తెలుసుకోవాలి. దానికి నాలుగు ఉపాయాలను ఉపనిషత్తులు చెప్పాయి. మొదటిది… అద్దంలో ప్రతిబింబంలా తెలుసుకోవాలి. మనం స్థిరంగా అద్దం ముందు నిలబడినంత సేపూ మన ప్రతిబింబం అందులో కనిపిస్తూనే ఉంటుంది. రెండోది… నీటిలో ప్రతిబింబంలా చూడాలి. మనం స్థిరంగా ఉన్నా మన ఆలోచనలన్నీ జలరాశిలా కదలిపోతుంటే ప్రతిబింబం కూడా కదిలిపోతూ ఉంటుంది. ఆ ఆలోచనా తరంగాల మధ్య ఆత్మను తెలుసుకోవాలి. మూడోది… ఒక కలలా చూడాలి. మెలకువలోనూ, నిద్దరలోనూ కూడా కలలొస్తాయి. కలల్లో మనకు మనం కొన్నిసార్లు స్పష్టంగానూ, మరికొన్నిసార్లు అస్పష్టంగానూ కనిపిస్తుంటాం. ఆ స్పష్ట-అస్పష్టతల మధ్య ‘ఏది అసలైన నేను’ అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి. చివరిది… వెలుగు నీడల్లా తెలుసుకోవాలి. ఆత్మ వెలుగునిస్తుంటే మన దేహాది అవస్థలు నీడను కల్పించి మనల్ని మాయలో ముంచెత్తుతుంటాయి. అటువంటి వెలుగునీడల మధ్య ‘ఏది సరైన నేను’ అనేది తెలుసుకో గలిగినవాడికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందనేది ఉపనిషత్తుల మాట. కానీ, ఆ ప్రయత్నం చాలా కష్టసాధ్యమైనది. అలాంటి పనిని ఈ ఆలయ దర్శనంతో సులభసాధ్యం చేసుకోవచ్చని నమ్మండి. ఈ స్వామికి భక్తులై నిరంతరమూ బ్రహ్మచింతనలో బతుకులు తరింప చేసుకోండి”.
భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ఆనాటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది.
కందూరి చోడులతో కాకతీయులు ఎక్కువకాలం బంధుత్వ మర్యాదను పాటించలేదు. చోడ రాజ్యం క్రమక్రమంగా కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోసాగింది. చివరికి పానుగల్లు సీమ మాత్రమే వారికి మిగిలింది. భీమదేవ చోడుని తర్వాత ఆ వంశంలో నలుగురు రాజులు పాలించారు.
కాకతి రుద్రదేవుడి తర్వాత గణపతి దేవుడు, రుద్రమదేవి పాలనాకాలం ముగిసే సమయానికి పానుగల్లును రామనాథ చోడుడు పాలిస్తున్నాడు. కాకతీయ రెండో ప్రతాప రుద్రుడు సా.శ. 1289లో సింహాసనం అధిష్ఠించాడు.
ఆ మరుసటి సంవత్సరమే పానుగల్లు సైతం చోడుల చేజారిపోయింది. ఆ తర్వాత ఆ వంశమే కనుమరుగైంది.
అక్కడినుంచి పదమూడేళ్లు తెలుగునేల కాకతీయుల ఏలుబడిలో ప్రశాంతంగా ఉంది. సా.శ. 1303 నుంచి 1310 వరకు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పనుపున అతని నపుంసక బానిస మాలిక్ కాఫర్ వరుస దండయాత్రలు ప్రారంభించాడు.

Katha
తన రాకను పసిగట్టిన పాము ఒకటి సోమేశ్వర లింగాన్ని విడిచిపెట్టి కలుగులోకి మాయమై పోవడాన్ని గమనించింది చంద్రమ్మ.
‘ఆనాడు ఈ పాములే కనుక లేకుంటే, ఈ స్వామి కూడా ఈపాటికి…’ అనుకుంటూ మెల్లిగా లోపలికి అడుగుపెట్టింది. తన పూలసజ్జలోంచి హారాన్ని తీసి స్వామికి అలంకరించింది.
తాను తొలిసారి మల్లన్న మెడలో పూలహారం వేసి, సిగ్గుతో నిలబడ్డ క్షణం గుర్తుకు వచ్చిందామెకు.
సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఈ గుడిలోనే తమ ప్రేమకు అంకురార్పణ జరిగింది.
చంద్రమ్మ కుటుంబం కొన్ని వందల ఏళ్లుగా చోడరాజుల భార్యలకు, కూతుళ్లకు పూలజడలు అల్లే పనిలో ఉండేది. ఆ రాజ్యం పడిపోయిన తర్వాత తమ వృత్తి కుంటుపడింది. పానుగల్లులోని సంపన్న కుటుంబాలలో తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.
చంద్రమ్మ తాను పదిహేడేళ్ల వయస్సులో ఉండగా తొలిసారి మల్లన్నను చూసింది. తాను ఆ రోజున పూలసజ్జతో ఛాయా సోమేశ్వరాలయానికి వెళ్లింది. ఉదయ సముద్రం ఒడ్డున నడుస్తుండగా సన్నటి గాలి తెమ్మెర వీచింది. ఆ గాలి తాకిడికి సజ్జలోని పూలు కొన్ని కింద రాలిపడ్డాయి.
చంద్రమ్మ వాటిని గమనించకుండా ముందడుగు వేసింది.
వెనుక నుంచి మల్లన్న ఆ పూలను ఏరుకొచ్చాడు. అతను సైనిక దుస్తుల్లో ఉన్నాడు. చేతిలో బల్లెం ఉంది. మరోచేతిలో కొన్ని పూలున్నాయి.
చంద్రమ్మ మారుమాటాడకుండా ఆ పూలను తీసుకుంది. నలుగురూ నడిచే నేలమీద పడినవాటిని స్వామికి సమర్పించవచ్చునా లేదా? అనే శంకతో గుడిలోపల ఒక గూడులో పెట్టి వెళ్లిపోయింది. వెనుక నుంచి మల్లన్న అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆలయం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు చంద్రమ్మ దించిన తల ఎత్తకుండా వెళ్లిపోయింది. ఏవో కళ్లు తనను గుచ్చుతున్న అనుభూతికి లోనవుతూనే ఉంది.
మరుసటి రోజున చంద్రమ్మ అలవాటుగానే గుడికి వచ్చింది. ఆమె తలదించుకుని ఉంది. ఆమె కళ్లు మాత్రం దొంగచాటుగా నిన్నటి వ్యక్తిని గురించి వెతుకుతూనే ఉన్నాయి. కానీ, అతను కనిపించలేదు.
గుడిలోకి వెళ్లి స్వామికి పూలహారం సమర్పించి, తిరిగి వచ్చే సమయానికి సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. వాన పెరిగేలోపుగా ఇంటికెళ్లి పోవచ్చులే అనుకుంటూ బయటికి వచ్చింది చంద్రమ్మ.
ఉన్నట్లుండి చినుకులు ఆగిపోయాయి. ఊహూఁ… ఆమె మీద వాన పడటం ఆగిపోయింది.
మల్లన్న ఆమెకు గొడుగు పట్టి నడుస్తున్నాడు. చంద్రమ్మ సిగ్గుపడి, పైకి కనిపించనివ్వకుండా నవ్వుకుంది.
మల్లన్న తాను నడక కొనసాగిస్తూనే..
“నేను ఓరుగల్లు నుంచి వచ్చాను. నన్ను మల్లన్న అంటారు. నీ పేరేమిటి?” అని తొలిసారి మాట కలిపాడు.
“చంద్రమ్మ” అంటూనే పరుగు తీసిందామె.
నాటినుంచి వారిద్దరి అనుబంధం కొనసాగింది.
కార్తికమాసంలో రెండుపూటలా చంద్రమ్మ గుడికి వస్తుండేది. ఆమె ఎక్కడుంటే మల్లన్న అక్కడుండేవాడు. గుడినిండా భక్తులున్నా, వారి ప్రేమైక దృక్కుల ప్రవాహానికి అడ్డుకట్ట ఏమీ లేదు. ఒకప్పుడు చిన్నమాట. మరొకప్పుడు కన్నుగీటు. ఇంకొకప్పుడు చేతి స్పర్శ. పున్నమి వెలుగుల్లో అందరూ ఛాయా సోమేశ్వరునిపై పడే నీడను అబ్బురంగా చూడటానికి పోతే… వీరిద్దరూ కల్యాణ మంటపంలో చెరో స్తంభానికీ ఆనుకుని ఊసులాడుకుంటున్నారు.
ఆరోజు మల్లన్న ఎంతో మురిపెంగా చంద్రమ్మకి ఒక మువ్వల పట్టీల జత తెచ్చి కాళ్లకు పెట్టాడు. కొద్దిసేపు ఆ మాటామంతీ అయ్యాక…
“అవునూ… నువ్వు ఓరుగల్లు సైనికుడివి కదా! మీ సైనికులకు దేవాలయాల్లో ఏమిటి పని?” చంద్రమ్మ ఆరా తీస్తున్నట్లుగా అడిగింది.
“నువ్వు విని ఉండకపోవచ్చు. ఈ మధ్యన ఓరుగల్లుపైన తురకలు దండయాత్రలు చేస్తున్నారు. ఏడాది కిందట ఉప్పరపల్లి దగ్గర పెద్ద యుద్ధం జరిగింది. మా సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఆ తురక సైన్యాన్ని గోదావరి నది దాటేంతవరకూ తరిమికొట్టాడు. కానీ, మళ్లీ వాళ్లెప్పుడైనా దండెత్తవచ్చు. తురకలు మన మతాన్ని గౌరవించరు. గుళ్లను దోచుకుంటారు. ఇప్పటికే ఉత్తర భారతంలో చాలా గుళ్లను పడగొట్టారట. అందుకని గుళ్లను, గుడికొచ్చే నీలాంటివాళ్లను కాపాడటమే మా ఉద్యోగం అయింది” అని సమాధానం చెప్పాడు మల్లన్న.
చంద్రమ్మ ఇంటిలోని పెద్దలను ఒప్పించి, ఆ మాఘంలోనే మల్లన్న ఆమెను పెళ్లాడాడు.
పెళ్లికి కట్టిన పందిరి ఇంకా ఊడదీయకముందే ఓరుగల్లులో మరోసారి యుద్ధం సంభవించింది. మల్లన్న హుటాహుటిన మళ్లీ ఉప్పరపల్లికి వెళ్లిపోయాడు.
అటుపైన చంద్రమ్మ-మల్లన్న కాపరం చేసిన ఆరేళ్లలో కాకతీయులకు ఢిల్లీ సైన్యంతో అయిదు యుద్ధాలు సంభవించాయి. అంతకుముందు జరిగినదానితో కలిపితే ఇవి ఆరు యుద్ధాలన్నమాట.
అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడైన మాలిక్ కాఫర్ ఆరోసారి అతిపెద్ద ప్రయత్నం చేసి, ముందస్తు ప్రణాళికలతో ఓరుగల్లుపై దాడి చేశాడు. దేవగిరి, సిర్పూరు, హనుమకొండ మీదుగా ఓరుగల్లును చేరుకొన్నాడు. అప్పటికే అంతులేని యుద్ధాలతో అలసిపోయిన కాకతీయ సైన్యం ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉన్నది. ఈ వార్త విని మళ్లీ అతిత్వరలో సైన్యాన్ని సమకూర్చుకొనే అవకాశం చక్రవర్తికి లేకపోయింది.
కోటలోపలి సైన్యానికి ఆయుధాలు, ఆహారం అందకుండా కట్టుదిట్టం చేశాడు మాలిక్ కాఫర్. ఉన్మాదిలా మారి గ్రామాలన్నీ తగులబెట్టించాడు. పంటపొలాలను ధ్వంసం చేశాడు. సామాన్య ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. నాలుగు నెలలకాలం ఒక్కరీతిగా ఓరుగల్లు అట్టుడికిపోయింది. చివరికి ప్రజాశ్రేయస్సు కోరినవాడై చక్రవర్తి సంధికి అంగీకరించాడు.
సా.శ. 1310కి సరియైన సౌమ్యనామ సంవత్సరం మాఘ అమావాస్యనాడు ఓరుగల్లును మాలిక్ కాఫర్ చేజిక్కించుకున్నాడు. సాలుకు ఆరువేల ఖర్వారుల ధనం, వంద ఏనుగులు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి కప్పంగా చెల్లించేట్లు నిర్ణయించారు.
మాలిక్ కాఫర్ అక్కడితో సంతృప్తి చెందకుండా దక్షిణాపథంలో మరికొన్ని రాజ్యాలు గెలవడానికి సిద్ధమయ్యాడు. ముందుగా హోయసలకు వెళ్తూ మధ్యలోని గ్రామాలను ఇష్టమొచ్చినట్లుగా దోచుకోసాగాడు.
ఆ క్రమంలో కాఫర్ సేన పానుగల్లులో ప్రవేశించింది. ఆ సైన్యంలో తురకలతో పాటుగా ఓరుగల్లులో పట్టుబడ్డ యుద్ధఖైదీలు కూడా కొందరున్నారు. అటువంటి వారిలో మల్లన్న కూడా ఒకడు.
పానుగల్లు పట్టణాన్ని దోచుకునే క్రమంలో మాలిక్ కాఫర్.. ఛాయా సోమేశ్వరాలయంలో ప్రవేశించాడు.
ఆనాడు ఫాల్గుణ పౌర్ణమి. అప్పుడప్పుడే కనుచీకటి పడుతోంది. సైనికులు కాగడాలు పట్టుకున్నారు. ఆలయం పట్టపగటిలా వెలుగులు చిందుతోంది.
ఆ వెలుగుల మధ్య విధ్వంసకాండ కొనసాగింది. మాలిక్ కాఫర్ పదునైన కరవాల ధాటికి ఆలయ విగ్రహాలు ఒక్కొక్కటీ ధ్వంసమవుతున్నాయి. కాఫర్ ప్రధానాలయంలో ప్రవేశించే సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది.
మాలిక్ కాఫర్ మొదటిగా ఎడమ చేతివైపు మళ్లాడు. ఛాయా సోమేశ్వర లింగాన్ని ఒక శ్వేతనాగు చుట్టుకుని ఉంది. అతను పట్టించుకోకుండా ముందడుగు వేశాడు.
గ్రహణవేళ స్వామిని అర్చించడానికి కాబోలు… ఒకదానివెంట ఒకటిగా పదుల సంఖ్యలో శ్వేతనాగులు లోపలికి వస్తూనే ఉన్నాయి. చూస్తుండగానే గర్భాలయం అంతా నాగులతో నిండిపోయింది.
ఆ దృశ్యాన్ని చూసిన కాఫర్కి ఒళ్లు జలదరించింది. అక్కడినుంచి వెనక్కి తిరిగాడు.
ఎదురుగా సూర్యలింగం ధగద్ధగాయమానంగా వెలుగుతూ కనిపించింది. ఆ వెలుగుకి కారణమేంటో తెలియక మాలిక్ కాఫర్ తికమక పడ్డాడు. గ్రహణ సమయంలో ఆ ఆలయంలో జరిగే అద్భుతం అది.. అని అతనికి తెలియదు.
బహుశా ఆ రాయి విలువైన వజ్రం కావచ్చనుకున్నాడు. గబగబా వెళ్లి పానపట్టం మీదనుంచి లింగాన్ని ఊడబెరికి చేతుల్లోకి తీసుకున్నాడు.
అంతే… వెలుగు మాయమైంది. లింగం కేవలం మామూలు రాయిలా మిగిలిపోయింది. దానిని కసితీరా బద్దలు కొట్టాడు. అయితే… వెలుగుకి కారణం అక్కడున్న పానపట్టం కాబోలు అనుకున్నాడు. దానిని కూడా విరగ పొడిచాడు. ఫలితం లేకపోయింది.
సూర్యలింగానికి పట్టిన గతే కొద్దిసేపటికి విష్ణులింగానికి కూడా పట్టింది.
అటుపైన అతని దృష్టి అక్కడున్న నందులపై పడింది. సూర్యలింగం ముందుండే నంది విగ్రహంవైపు చురచురా నడిచాడు. కరవాలాన్ని పైకెత్తి శిలను నరకబోయాడు. ఇంతలో ఏదో అనుమానం తోచి ఆగిపోయాడు.
“అరె వో..” అని అరిచాడు.
వెనువెంటనే అతని సైన్యం ప్రతిస్పందించింది.
మల్లన్నను తీసుకొచ్చి మాలిక్ కాఫర్ ముందు నిలబెట్టారు. కాఫర్ అతని మెడమీద కత్తిపిడిని ఆన్చి నందివైపు తోశాడు.
“ఇస్ పర్ క్యా లిఖా హై? పడో” అని గర్జించాడు.
కాఫర్ తెలుగు మాట్లాడలేడు. కానీ, చాలాకాలంగా ఓరుగల్లుతో యుద్ధాలలో పాల్గొంటూ ఉండటం వల్ల తెలుగు విని అర్థం చేసుకోగలడు. ఆ సంగతి మల్లన్నకు తెలుసు. కానీ అక్కడ ఉన్నదేదో చదివితే ఏమవుతుందో అని కొద్దిసేపు తటపటాయించాడు.
ఈసారి పిడిని కాకుండా మొనవైపున కత్తిని మల్లన్న మెడకు తగిలించాడు కాఫర్.
“నాకు చదువొస్తే యుద్ధంలో ఎందుకు చేరతాను” అన్నాడు మల్లన్న బెదురులేకుండా.
కాఫర్ ఈసారి మెడమీద చిన్నగా గాటు పెట్టాడు. మల్లన్న మెడ నుంచి రక్తం చిందడం మొదలైంది.
“ఆ మెడలో ద్రవ్యం కలదు”… అని మల్లన్న నంది మెడపై రాసి ఉన్నదాన్ని చదివాడు.
“క్యాఁ మిలేగా…” అంటూనే మల్లన్నను పక్కకు జరిపాడు కాఫర్.
కత్తితో నంది మెడను తెగనరికాడు. ఫలితం కనిపించలేదు. విగ్రహాన్ని వీలైనన్ని చిన్నముక్కలు చేశాడు. అయినా ఫలితం శూన్యమే.
“అరె బే… కౌన్ సీ గర్దన్ మే ముద్రా హై?!” మరోసారి గద్దించాడు కాఫర్.
మల్లన్న పిచ్చి చూపులు చూశాడు.
వెనువెంటనే ఆ ఆలయంలోని మరో ఆరు నందులు తలలు లేని శకలాలయ్యాయి.
మల్లన్న మెడలు వంచి మోకాళ్లపై కూచోబెట్టారు.
“ఝూటా కహీకా!?” అంటూ మల్లన్న మెడను ఒక్కవేటున నరికాడు కాఫర్.
అదే సమయానికి ఒక నాగు అతని కాలిని కాటేసింది.
అప్పటికి చంద్రగ్రహణం సరిగ్గా సగానికి వచ్చింది. ఆకాశంలో కదిలే నీడలాంటి రాహువు కెవ్వుమంటూ కేకపెట్టాడు.
ఆ కేక ఎక్కడెక్కడో ప్రతిధ్వనించి… చంద్రమ్మ హృదయాన్ని తాకింది. ఆమె కంటి నుంచి కన్నీటి బొట్లు జలజలా రాలి, ఛాయా సోమేశ్వరునిపై పడ్డాయి.
* * *
‘ఆ మెడలో ద్రవ్యం కలదు’ అని ఆనాడు నందిపై రాసిందెవరో తెలియదు. కానీ, ఎప్పటినుంచో దానిని ‘ఆమడలో ద్రవ్యం కలదు’ అని అర్థం చేసుకున్న వాళ్లెందరో గుప్తనిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఛాయా సోమేశ్వరాలయానికి ఆమడ దూరంలో ఎన్నోసార్లు రహస్య తవ్వకాలు జరిగాయి. పచ్చల సోమేశ్వరాలయంలో స్వామి మెడలోని పచ్చల పతకం మాయమైంది. అది కాకుండా ఎవరికైనా ఏమైనా లభించిందేమో తెలియదు.
* * *
“నీ నీడలో నా బతుకు హాయిగా వెళ్లిపోనీయి” అన్నది చంద్రమ్మ, ఆనాడు మల్లన్న యుద్ధానికి వెళ్లబోయే ముందురోజు రాత్రి.
“నీ నీడలా నన్ను చూసుకో. నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను” అని హామీ ఇచ్చాడు మల్లన్న ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
‘అప్పుడున్న నీడ ఇప్పుడేదీ?!’ అనుకుంది… మధ్యాహ్నపు ఎండకు తన నీడ తనపైనే పడుతుండగా ఇంటివైపుగా అడుగులు వేస్తూ చంద్రమ్మ.
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

