లాజరస్
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
ఈ ఆదివారం పొద్దున్న ఆరింటికల్లా మా కారు మీ ఇంటి ముందు ఉంటుంది. ఆరూ ఐదుకి నువ్వూ, సరోజ మా కారులో ఉంటారు!” ఆఫీస్ నుంచి బయటికి వస్తూ సుధాకర్‌తో అన్నాడు రాజేష్.
“నీతో ఇదే తలనొప్పి. ఏ సంగతీ వివరంగా చెప్పి చావవు!” స్నేహితుడి మీద చిరాకు పడ్డాడు సుధాకర్.
“నీ చిరాకు మొహం చూడటం అంటే నాకు సరదా. నళిని ఈ ఆదివారం బాసర వెళ్లి వద్దామంటోంది” పెద్దగా నవ్వేశాడు రాజేష్.
రాజేష్, సుధాకర్ ఇద్దరూ ఆరేళ్లుగా కలిసి ఒకేచోట పనిచేస్తున్న స్నేహితులు. రాజేష్ భార్య నళినికి, సుధాకర్ భార్య సరోజకి కూడా మంచి దోస్తీ కుదిరింది. నలుగురూ కలిసి సినిమాలకే కాదు.. ఇలా యాత్రలకు కూడా తిరుగుతూ ఉంటారు.
“అలాగే వెళదాం కానీ, తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌లో ఖిల్లా చూసి రావాలి మనం!” కండీషన్ పెడుతున్నట్లు అన్నాడు సుధాకర్.
“ఖిల్లానా? అంటే ?” అన్నాడు రాజేష్
ఆశ్చర్యంగా మొహం పెట్టి!
“కంగారెందుకు? అక్కడికి వెళ్లాక
చెబుతాను!” అన్నాడు సుధాకర్.
బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్లు బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు దాటింది.
బాసరలో కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడే..
“నిజామాబాద్‌లో లంచ్ చేద్దాం అనుకున్నాం కదా! ఇప్పుడు చెప్పు.. ఖిల్లా అంటే ఏమిటి? లంచ్ చేశాక మనం అక్కడికి ఎందుకు వెళ్లాలి?” అడిగాడు రాజేష్.
“అవునన్నయ్యా.. చెప్పు! ఈ గంటసేపు ప్రయాణంలో మనకేదో కాలక్షేపం ఉండాలి కదా!” కల్పించుకుంది నళిని.
“ఆ ఖిల్లా గురించి నాకు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఊ.. చెప్పండి” అంది సరోజ.
కారు గతుకుల రోడ్డుమీద నెమ్మదిగా కదులుతోంది!
సుధాకర్ గొంతు సవరించుకున్నాడు.
“ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. ముప్పై ఏళ్ల క్రితంది. ఎప్పటికీ మర్చిపోలేనిది”
కళ్లు మూసుకుని తన గతం వివరించడం మొదలుపెట్టాడు సుధాకర్.
“నేను ఆరో క్లాసులో ఉండగా మా నాన్నగారికి సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మా నాన్నగారు జైలర్‌గా పని చేసేవారు. ఖిల్లా అంటే కోట. నిజామాబాద్‌లో జైలు.. కొండ మీద కోటలో ఉండేది. ఆ కోట వెయ్యేళ్ల క్రితందని చెబుతారు. కోట ముందు ఎత్తయిన రాతి ముఖద్వారం మీద జైలర్ క్వార్టర్ కట్టారు. అందులోనే మేం ఉండేవాళ్లం. అదొక రాజ భవనంలా ఉండేది.
మా ఇంట్లో అందరూ దొంగలే.. అదే ఖైదీలే పని చేసేవారు. ఒకడు ఇల్లు శుభ్రం చేస్తే, మరొకడు గిన్నెలు తోమేవాడు. వేరేవాడు మాకున్న రెండు గేదెల పని చూసేవాడు. ఇంకొకడు కింద ఉన్న తోటపని చేసేవాడు. మాకు బాత్రూమ్లో స్నానానికి నీళ్లు పెట్టడం, మా బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, మాకు క్షవరం చేయడం.. ఇలా అన్ని పనులూ ఖైదీలే చేసేవారు”.
“అలా ఇంట్లో దొంగలు తిరుగుతూ ఉంటే మీకు భయం వేసేది కాదా.. అన్నయ్యా?” సుధాకర్ మాటలు వింటూ ఆశ్చర్య పోయింది నళిని.
“మరి వాళ్లు అలా బయటికి వచ్చినప్పుడు పారిపోరా?”
“వాళ్లకి ఒక జవాన్ కాపలాగా ఉంటాడు! కొన్నాళ్లపాటు వాళ్ల ప్రవర్తన గమనించి, మంచి వాళ్లనే బయట పనులకు పంపుతారు. మాకు మాత్రం దొంగలు ఇంటి మనుషుల్లా కనిపించేవారు. వాళ్లు అన్ని పనులూ చేస్తూ తిరుగుతూ ఉంటే ఎటువంటి భయం వేసేది కాదు! కానీ, ఒకడిని చూసి నేను కూడా భయపడే రోజు వచ్చింది”.. క్షణం ఆగాడు సుధాకర్.
“ఎందుకు భయం? త్వరగా చెప్పన్నయ్యా! ఎవరిని చూసి?” ఆతృతగా అడిగింది నళిని.
“అతను.. అతను.. లాజరస్!”
“లాజరస్.. అతనంటే భయం ఎందుకు?”
గొర్రెలు అడ్డు రావడంతో కారుకి సడన్ బ్రేక్ వేశాడు రాజేష్.
“ఎందుకంటే.. లాజరస్ మామూలు దొంగ కాదు. ఒక హంతకుడు! ఆ సంగతి ఒక జవాన్ నాకు చెప్పాడు. అప్పుడే డిటెక్టివ్ నవలలు
చదవడం మొదలుపెట్టిన నేను.. ఒక హంతకుడు ఇంట్లోకి రావడంతో భయపడ్డాను! అదే మాట అమ్మకి చెప్పి..
‘ఆ లాజరస్ మన ఇంట్లో కూడా ఎవరినైనా చంపేస్తాడు! వాడిని జైల్లోనే ఉండమను. బయటికి తీసుకురావద్దని జవాన్‌కి చెప్పు!’ అన్నాను.
‘భయపడకు! అయినా ఖైదీలను చూసి కొత్తగా ఈ భయం ఎప్పటి నుంచి? రాత్రి నాన్నతో మాట్లాడతాను లే!’ అంది అమ్మ.
ఆ రోజు ఆదివారం. మా ఇంటికి నాలుగు వైపులా ఏటవాలుగా పెంకులు పరచిన బాల్కనీ ఉండేది. నేను బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని చందమామ పుస్తకం చదువుకుంటున్నాను.
‘లాజరస్.. ఇలా రా! వచ్చి టీ తీసుకో!’ వంటింటి గుమ్మంలో నుంచి పిలిచింది అమ్మ.
చీపురుతో బాల్కనీ ఊడుస్తున్న లాజరస్ కుళాయి దగ్గర చేతులు కడుక్కుని వచ్చాడు.
అతను టీ గ్లాసు తీసుకోబోతూ ఉంటే..
‘లాజరస్.. నువ్వొక ఆడ మనిషిని చంపి జైలుకి వచ్చావట! నిజమేనా?’ అని సూటిగా అడిగేసింది అమ్మ.
అమ్మ అలా అడగ్గానే టీ గ్లాసు పక్కన పెట్టేసి, పెద్దగా ఏడ్చేసాడు లాజరస్. అమ్మ కంగారు పడిపోయి..
‘అలా బాధపడకు! నాకేమీ చెప్పొద్దులే!’ అంది.
లాజరస్ పైగుడ్డతో మొహం తుడుచుకుని..
‘లేదమ్మా! మీకుకాక ఎవరికి చెబుతాను? ఆరేళ్ల క్రితం జరిగిన సంగతి. అదంతా నా ఖర్మ తల్లీ! క్షణికావేశంలో చేసిన సరిదిద్దుకోలేని పొరబాటు. బందరులో మా ఇల్లు, మంగమ్మ ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మా రెండు కుటుంబాలూ ఎంతో స్నేహంగా ఉండేవి. నా ఆరేళ్ల కొడుకు బెంజిమిన్ అంటే మంగమ్మకు ఎంతోప్రేమ. మంగమ్మ ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో ఎన్నో కూరగాయల మొక్కలు, పాదులు నాటింది మంగమ్మ. ఒకరోజు సాయంత్రం మంగమ్మ పెరట్లో మిరపకాయలు దంచుకుంటోంది. ఎవరో మంగమ్మ చుట్టాలు ఇంట్లో నుంచి బయటికి వెళుతూ.. వీధిగేటు మూయడం మరచిపోయారు. అదే అదనుగా మా గేదె మంగమ్మ ఇంట్లోకి వెళ్లి, మొక్కలన్నీ తొక్కేసింది. పాదులకు వేసిన పందిళ్లు కూల్చేసింది. ఎవరో ఈ సంగతి మంగమ్మకు చెప్పినట్లు ఉన్నారు. మంగమ్మ చేతిలో రోకలితో సహా అరుస్తూ వచ్చి.. మా గేదె నెత్తిమీద ఆ రోకలితో దబదబా నాలుగు దెబ్బలు వేసింది. అంతే! మా గేదె అక్కడే కుప్పకూలి పోయింది.

Lauzaras 1
‘పక్కింటి మంగమ్మ మన గేదెని చంపేసింది. ఒకసారి ఇలా రండి!’ అంటూ మా ఆవిడ అరుస్తూ ఉంటే.. అప్పుడే పొలం నుంచి వచ్చి నడుం వాల్చిన నేను, నిద్రలో ఉలిక్కిపడి లేచి బయటికి పరిగెత్తాను! మా గేదెలో చలనం లేదు. తలంతా రక్తం. చేతిలో రోకలితో బొమ్మలా నిలబడిపోయి ఉంది మంగమ్మ. గేదె చచ్చిపోయిందన్న కోపంలో నేను ముందూ వెనకా ఆలోచించకుండా మంగమ్మ చేతిలో రోకలి లాక్కుని.. దానితోనే మంగమ్మ నెత్తిన గట్టిగా రెండు దెబ్బలు వేశాను. ‘చచ్చాను రోయ్!’ అని అరుస్తూ కుప్పకూలి పోయింది మంగమ్మ. అప్పుడే గడ్డి కోసుకుని వచ్చిన మంగమ్మ మొగుడు.. తన చేతిలో ఉన్న కొడవలి నా మీదికి విసిరాడు. మొహానికి కొడవలి తగలకుండా నేను చేయి అడ్డం పెట్టుకున్నాను. అయితే కొడవలి చేతికి తగలడంతో నా చూపుడు వేలు, మధ్య వేలు సగానికి తెగి కింద పడిపోయాయి. ఇంత ఘోరం ఐదు నిమిషాల్లోనే జరిగిపోయింది. నేను ఒక పథకం ప్రకారం కాకుండా ఆవేశంలో చేసిన హత్య అని నాకు పదేళ్ల శిక్ష పడింది. ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు శిక్ష మరో పదిహేనేళ్లు పెంచితే బాగుండునని అనిపిస్తోంది నాకు!’ అంటూ.. మళ్లీ భోరుమని ఏడ్చేశాడు లాజరస్.
‘అలా అంటావేంటి లాజరస్? బయటికి వెళ్లి నీ భార్యా, కొడుకుతో సుఖంగా బతుకు!’ అంది అమ్మ.
‘ఇంకా ఎక్కడ భార్యాకొడుకు? క్రితం ఏడాది నా భార్య.. కొడుకుతో సహా ఒక పంజాబీ ట్రక్ డ్రైవర్‌తో ఎటో వెళ్లిపోయిందని తెలిసింది. ఇక జీవితంలో నా కొడుకుని నేను చూడలేను! నా కొడుకు బెంజిమిన్ వయసులోనే జైలర్ గారికీ కొడుకు ఉన్నాడని తెలిసి.. ఆ బాబులో నా కొడుకును చూసుకుందామని ఎంతో కష్టం మీద మీ ఇంటికి డ్యూటీ వేయించుకుని వచ్చానమ్మా!’ అని, ఇంకా ఏదో చెప్పబోతున్న లాజరస్.. కింది నుంచి జవాన్ పిలవడంతో వెళ్లిపోయాడు.
లాజరస్ తెగిన వేళ్లు చూస్తే నాకు భయంతో వణుకు పుట్టేది.
ఖిల్లా మీద ఒకవైపు జైలు, మరోవైపు శివాజీ కట్టించిన రామాలయం ఉండేవి. ఆ రామాలయానికి వెళ్లే దారిలో ఒకపక్క కొండ రాళ్ల సందుల్లో చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఎప్పటి గుడో! పూజారి ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ ప్రతి శనివారం నన్ను ఆ గుడికి వెళ్లి, గుడిలో దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి రమ్మనేది. నాతోపాటు గుడి కడగటానికి ఒక ఖైదీ బకెట్‌తో నీళ్లు, చీపురు తీసుకుని వచ్చేవాడు.
ఆరోజు లాజరస్ అమ్మతో..
‘అమ్మగారూ! ప్రతి వారం నేను సుధాకర్ బాబుతో గుడికి వెళ్లి, గుడి శుభ్రం చేసి వస్తాను. నన్ను పంపించండి!’ అన్నాడు.
ఆ మాటలకు నా గుండెలు దడదడలాడాయి. నాకు లాజరస్ అంటే ఒక రకమైన భయం! అతనితోపాటు ఒంటరిగా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.
‘మీరు క్రిస్టియన్లు కదా.. మరి హనుమంతుడి గుడికి ఎలా వెళ్తావు?’ ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.
లాజరస్ నవ్వి..
‘నాకు కుల-మతాల పట్టింపు లేదు’ అన్నాడు.
ఆ రోజునుంచి నాతోపాటు ప్రతి శనివారం గుడికి రావడం మొదలుపెట్టాడు లాజరస్. దారంతా ఎన్నో కబుర్లు చెప్పేవాడు. నన్ను బాగా చదువుకోమని అనేవాడు. పాలు తాగమని చెప్పేవాడు. ఎండలో తిరగవద్దని అనేవాడు. జీవితంలో ఎప్పుడూ బీడీలు, సిగరెట్లు కాల్చవద్దని చెప్పేవాడు. నేను మౌనంగా అతను చెప్పేది వినేవాడిని. నా అంతట నేను మాట్లాడే వాడిని కాను.
ఒకరోజు సాయంత్రం నేను స్కూల్ నుంచి వస్తూ ఒక తెగిన గాలిపటం మా మేడ మీదికి వెళ్లడం చూసి, తిన్నగా మేడ మీదికి పరుగు తీశాను. గాలిపటం బాల్కనీ పైన ఉన్న పెంకుల మీద పడి ఉంది. నేను ముందూ వెనకా ఆలోచించకుండా ఆ పెంకుల మీదికి దిగిపోయి, చిన్నగా నడుస్తూ ఏటవాలుగా ఉన్న ఆ పెంకుల చివరికి వెళ్లాను. హఠాత్తుగా ఆ పాత పెంకులు పగిలి కదలడం మొదలుపెట్టాయి. గమ్మున అలాగే కూర్చుండి పోయాను. నా బరువుకి పెంకులు పటపటమంటూ పగిలి పోతున్నాయి. నేల ఎక్కడో అగాధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కదిలిపోతున్న ఆ పెంకుల అంచులో ఉన్న నాకు.. మరుక్షణంలో నా జీవితం ముగిసి పోబోతోందని అర్థం అయిపోయింది.
‘భయపడకు బాబూ.. నా చేయి పట్టుకో!’
ఎప్పుడు వచ్చాడో, నా పక్కగా పగలని పెంకుల మీదుగా కిందకు వచ్చి, తన చేయి అందించాడు లాజరస్.
తెగిన వేళ్లు ఉన్న ఆ చేతిని చప్పున గట్టిగా పట్టుకున్నాను. నన్ను జాగ్రత్తగా పైకి తీసుకువచ్చాడు. ఆ రోజు లాజరస్ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ కథ చెప్పడానికి నేను ఉండేవాడిని కాను!
ఆ తర్వాత నేను, లాజరస్ మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నేను తన వెనకే తోటలోనూ, రామాలయంలోనూ తిరుగుతూ ఉండేవాడిని. రామాలయానికి ఆ పక్కన ఉన్న జైలుని చూపిస్తూ..
‘నీకు తెలుసా 1947-48 మధ్య ఆ జైలులోనే ఎనిమిదో నంబర్ బ్యారక్‌లో దాశరథి రంగాచార్యని నిజాం నవాబులు బంధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందుకు!’
లాజరస్ చెప్పేది నేను మౌనంగా
వింటున్నాను.
‘అసలు నీకు దాశరథి రంగాచార్య ఎవరో తెలుసా?’ అడిగాడు.
‘నా తెలంగాణా కోటి రతనాల వీణ!’ అన్నాను నేను వెంటనే!
‘అబ్బో! ఇంత చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసునే నీకు’ అంటూ నవ్వాడు లాజరస్.
‘ఆ కవిత ఆయన మొదటిసారి రాసింది ఈ జైలులోనే! జైలు అధికారులు అప్పట్లో ఖైదీలు మొహం కడుక్కోడానికి బొగ్గు ముక్కలు ఇస్తే.. ఆ బొగ్గుతో ఎన్నో కవితలు, విప్లవ గీతాలు జైలు గోడల మీద ఆయన రాసేవారట. నా అదృష్టం.. నేనిప్పుడు ఆ ఎనిమిదో నెంబర్ బ్యారక్‌లోనే ఉన్నాను!’ అన్నాడు లాజరస్.
ఇలా లాజరస్ నాకు ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, లాజరస్ నాకు బర్రెల పాలు పితకడం, ఈత కొట్టడం లాంటివెన్నో నేర్పించాడు.
చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.
ఓ రోజు అమ్మ కాల్చి ఇచ్చిన మక్కజొన్న కంకి తీసుకుని మెట్లు దిగి కిందికి వచ్చాను. కింద మా ఆవరణలో ఒక వేపచెట్టు ఉండేది. దాని చుట్టూ అరుగులా కట్టారు. ఆ అరుగు మీద కూర్చుని నేను మక్కజొన్న కంకి తింటున్నాను. ఆ పక్కనే కొట్టంలో గేదెలు కట్టేసి ఉన్నాయి. గేదెలకు వరిగడ్డి వేస్తున్నాడు లాజరస్. ఉన్నట్లుండి లాజరస్ నా వైపు పరిగెత్తుకు వచ్చి, నన్ను పక్కకు లాగేశాడు. ఆ విసురుకి నేను కింద పడిపోయాను. నేను కూర్చున్న చోటు వెనకవైపు ఒక తాచుపాము పడగ విప్పి బుసలు కొడుతోంది. నేను అక్కడే కూర్చుని ఉంటే.. అది ఆ పాటికి తప్పకుండా నన్ను కాటేసి ఉండేది.
లాజరస్ ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకుని చాలా ప్రయాసపడి ఆ పామును చంపేశాడు.
తర్వాత పక్కనే తోటలో ఉన్న ఖైదీని పిలిచి..
‘శివాజీ! ఈ పామును తీసుకెళ్లి నువ్వే
చంపావని జైలర్ గారికి చూపించు’ అన్నాడు.
శివాజీ ఆ చచ్చిన పామును తీసుకుని వెళ్లిపోయాడు.
‘అదేంటి? పామును చంపింది నువ్వు కదా! మరి శివాజీ చంపినట్లుగా నాన్నతో ఎందుకు చెప్పమన్నావు?’ ఆశ్చర్యంగా అడిగాను నేను.
‘జైలు రూల్ ప్రకారం ఒక విషపు పామును చంపితే నాలుగు రోజులు శిక్ష తగ్గించి, ముందే విడుదల చేస్తారు. బయట నాకోసం చూసేవాళ్లు ఎవరూ లేరు. శివాజీకి ముగ్గురు పిల్లలు. అందుకే చచ్చిన పామును వాడికి ఇచ్చేశాను!’ అంటూ నవ్వేశాడు లాజరస్.
ఇది జరిగిన మరునాడే నాన్నకి ప్రమోషన్ మీద వరంగల్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజు పొద్దున పదింటి బస్సుకే మేము వరంగల్ వెళ్లిపోతున్నాం. అప్పుడే టిఫిన్ చేసిన నన్ను.. కింద ఉన్న తోటలోకి తీసుకు వెళ్లాడు లాజరస్. వెళ్లగానే నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు! అనుకోకుండా నా నుదుటన ముద్దు పెట్టుకున్నాడు.
‘నా కోసం ఒక పని చేస్తావా బాబూ?’ అని అడిగాడు ఏడుస్తూనే.
‘ఏం చేయాలి?’ అన్నాను నేను.. లాజరస్నే చూస్తూ.
‘ఒకసారి నన్ను ‘నాన్నా!’ అని పిలవవా?’ అని అడిగాడు, నా చేయి పట్టుకుని.
అలా పిలవడం తప్పు అనిపించింది నాకు. చిన్నగా చేయి విడిపించుకుని మేడ మీదికి వెళ్లిపోయాను నేను. అనుకున్నట్లుగానే మేము వరంగల్ వెళ్లే పది గంటల బస్ ఎక్కేశాం.
ఆ రోజు నిజామాబాద్ వదిలేసిన నేను.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రోజు నిజామాబాద్‌లోకి అడుగు పెడుతున్నాను” అన్నాడు సుధాకర్.
కారు నిజామాబాద్ పట్టణంలోకి ప్రవేశించింది. అప్పటిదాకా ఆసక్తిగా సుధాకర్ చిన్ననాటి కథ వింటున్న నళినికి ఆకలి గుర్తుకు వచ్చింది.
“ముందు మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉందో చూడండి!” భర్తకు పురమాయించింది.
నలుగురూ లంచ్ చేసి ఖిల్లాకు చేరుకునే సరికి నాలుగు దాటింది.
సుధాకర్ వాళ్లు ఉన్న కమాన్ మీది ఇల్లు పాడు పడిపోయినట్లుగా కనిపిస్తోంది. వరండా మొత్తం కూలిపోయి, పెంకులు ఊడిపోయి ఉన్నాయి. పైన రాళ్ల మధ్యలో నుంచి మొక్కలు మొలిచి పోయాయి. కిందంతా చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు.. కింద తలుపు తాళం పెట్టి ఉంది.
దారిన వెళుతున్న ఒక ముసలి మనిషిని
అడిగితే..
“పదిహేనేళ్ల క్రితం అనుకుంటా.. జైలును సారంగ్పూర్కి మార్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండటం లేదు!” అని చెప్పాడు.
అలా పాడు పడిపోయినట్లుగా ఉన్న తమ ఇదివరకటి ఇంటిని చూసి సుధాకర్‌కి ఎంతో బాధగా అనిపించింది. ఇంటి నిండా మనుషులతో సందడిగా, రాజ మందిరంలా ఉండే ఇల్లు.. ఇప్పుడు బావురుమంటూ దయ్యాల కొంపలా తయారైంది.
పైన పెంకులు ఊడిపోయి ఉన్న వరండా చూపిస్తూ..
“అక్కడి నుంచే నేను పడిపోకుండా లాజరస్ కాపాడాడు” అన్నాడు సుధాకర్.
తర్వాత వేపచెట్టు కింద విరిగిపోయి, మొక్కలు మొలిచి ఉన్న అరుగును చూపిస్తూ..
“లాజరస్ కాపాడకపోయి ఉంటే.. ఈ అరుగు మీదనే నాగుపాము నన్ను కాటువేసి ఉండేది!” అన్నాడు.
కొండమీది రామాలయానికి వెళ్లే దారి ఉంది కానీ, అప్పటికే ఐదు దాటి పోవడంతో తిరుగు ప్రయాణం అయ్యారు ఆ నలుగురూ.
“కొన్ని అందమైన జ్ఞాపకాలను అలాగే పదిలంగా మనసులో దాచుకోవాలి! ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన నేను.. ఇక్కడి దృశ్యం చూసి పూర్తిగా నిరుత్సాహ పడిపోయాను. అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది!” బాధగా అన్నాడు సుధాకర్.
“మనం వెళ్లే దారిలోనే అరవై ఏళ్ల క్రితం కట్టిన సాయిబాబా గుడి ఉంది. చాలా బావుంటుంది. ఒకసారి దర్శనం చేసుకుని వెళదాం” అంది నళిని.
గుడిలో ఎవరో స్వామీజీ ప్రవచనం అవుతోంది.
“అరే! సత్యానంద స్వామీజీ ప్రవచనం. ఎప్పుడూ టీవీలో వినడం తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. ప్రవచనం విని వెళదాం!” అంది సరోజ.
నలుగురూ బాబా దర్శనం చేసుకుని వచ్చి, ప్రవచనం వింటూ కూర్చున్నారు. సుధాకర్‌కి ప్రవచనం మీద బొత్తిగా ధ్యాస లేదు. తమ చిన్నప్పటి ఇల్లు ప్రస్తుతం ఎంత ఘోరంగా ఉందో చూసి తట్టుకోలేక పోతున్నాడు.
ప్రవచనం అయ్యాక స్వామీజీ అందరికీ పువ్వో, పండో ఇస్తున్నారు. భార్య వెనకే వస్తున్న సుధాకర్ చేతిలో స్వామీజీ ఒక నారింజ పండు జార విడిచాడు. పండు తీసుకుని ముందుకు వెళ్లిన సుధాకర్.. వెనక్కి వచ్చి, స్వామీజీ పాదాలకు నమస్కారం చేశాడు. ఇప్పుడు సుధాకర్ మనసు తేలిక పడి, ఎంతో సంతోషంగా ఉంది. తిరుగు ప్రయాణమంతా.. పండు ఇస్తున్న స్వామీజీ చేయి, తెగిన రెండు వేళ్లూ సుధాకర్ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.
– మాచిరాజు కామేశ్వరరావు, 90000 80396
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

