గాలిరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఉన్నా.. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండే
గాలిరెడ్డి తండ్రి ఊరుబడి మట్టుకే చదువుకున్నాడు. కొడుకును మాత్రం డిగ్రీ వరకు చదివించాడు. గాలిరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఉన్నా.. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండే. పాడితల్లి కథ ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందినది.
కథ
పాడితల్లి
సూర్యోదయాన్ని పక్షులు రెక్కలతో పిలుస్తున్నాయి. ఎడ్లు ఒళ్లు విరుచుకుంటూ నిన్నటి నిద్రను విదిలించుకుంటున్నాయి. పెండగుల్ల ఎత్తుకొని కొట్టం లోపలి నుంచి బయటకొస్తున్నాడు ధర్మన్న. కొట్టాన్ని, వాకిలిని చీపురుతో ఊడ్చేసి.. గుల్ల, చీపురును కొట్టం సూరుకింద పెట్టి, ఎడ్లకు మేతవేసి, కాళ్లు చేతులు కడుక్కున్నాడు. మేత నములుకుంటూ ఆరోజు పనికి సిద్ధమవుతున్నాయి ఎడ్లు. ఈరోజు చేండ్లో ఏం పనుందని ఆలోచిస్తూ ఎడ్లవైపు చూస్తూ జేబులోంచి బీడీ తీసి ముట్టించాడు ధర్మన్న. రెండు దమ్ములు గుంజిండో లేదో.. రింగవుతున్న సెల్‌ను బనియన్ జేబులోంచి తీసి హడావుడిగా…
“హలో! ఓల్లు మాట్లాడేది?.. హలో”
సరిగా వినిపించక పోవడంతో కొంచెం దూరమెళ్లి, బీడీని కాలుతో నలిచేసి..
“హలో.. ఓల్లు” అదే హడావుడితో అన్నాడు.
“నేను ధర్మన్నా! గాలిరెడ్డిని! ఇనవడ లేదా!?”
“ఆ ఆ.. ఇప్పుడు ఇనవడుతున్నది. అంతా మంచిదేనా పటేలా..”
“అంతా మంచిదే! పంటలు ఎట్లున్నయి?”
“పంటలియ్యేడు అంతపూర్తినే. ఆనలు ఎక్వవడి పత్తులన్నీ జౌకు వట్టినయి”
“అట్లనా! అయ్యో!” పటేలు మాటలు వినుకుంటూ, ఒక కాలు గోడకు ఆనించి.. పటేలుకు పంట ముచ్చటంత చెప్తున్నడు ధర్మన్న.
“ఇగో ధర్మన్నా!”
“చెప్పు పటేలా..” ఆసక్తితో వింటున్నడు ధర్మన్న.
“ఏమి లేదు. మేము వచ్చే ఆదివారం కొడుకు, కోడలు, పిలగాండ్లంతా వస్తున్నాం! ఇల్లు సాపుజేసి ఉంచు” అని ఫోన్ పెట్టేశాడు గాలిరెడ్డి.
గాలిరెడ్డిది ఆ ఊరిలో చదువుకున్న కుటుంబం. గాలిరెడ్డి తండ్రి ఊరుబడి మట్టుకే చదువుకున్నాడు. కొడుకును మాత్రం డిగ్రీ వరకు చదివించాడు. గాలిరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఉన్నా.. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండే. ఒక్కడే కొడుకు. పది ఎకరాల నల్లరేగడి భూమి ఉన్నది. దాంతోని కొడుకు ఊళ్లెనే ఉండాలనుకున్నరు. కానీ, గాలిరెడ్డి మాత్రం తన కొడుకును ఎంటెక్ వరకు, కూతురిని డాక్టర్ చదివించి.. మంచి సంబంధాలు చూసి పెండ్లిళ్లు చేశాడు. అల్లుడూ, కూతురు డాక్టర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే గాలిరెడ్డి తల్లిదండ్రులు మరణించారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు అయ్యేదాకా.. గాలిరెడ్డి భార్యతో ఊళ్లోనే ఉంటూ వ్యవసాయం చూసుకునేవాడు. తర్వాత కొడుకు, కోడలు ఒత్తిడితో బెంగళూరుకు వెళ్లిపోయారు. ధర్మన్ననే పదేండ్ల నుంచి జీతముంటూ వ్యవసాయంతోపాటు గాలిరెడ్డి ఇంటిని చూసుకుంటున్నాడు.
వరుసగా ఆరుగదుల మిద్దె ఇల్లు. కింద ఫ్లోరింగు, మధ్యలో మూడు గదులకు, చిలక చెక్క గదులకు ఎడమ వైపు మూడు గాదెలు, ఇంటి వెనుక పెరట్లో మంచినీళ్ల బావి, జామ, మల్లె, మందారం చెట్లు. ఇంటి ముందర వంద మంది కూర్చునేట్లు విశాలమైన వాకిలి. వాకిట్లో వచ్చిపోయే వాళ్లకు ఆహ్లాదాన్ని పంచే వేప, అరటి, ఎర్రగన్నేరు చెట్లు. ముందర ఏడు గదులంత విశాలమైన కొట్టం. చుట్టూ ప్రహరీ. ముందర పెద్ద దర్వాజా (పాటాకు).
ధర్మన్న ఎప్పుడూ ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ నిగ్రాని చేస్తుంటడు. పంటకాలంలో అక్కడే పడుకుంటడు. గాలిరెడ్డి చెప్పినట్లుగానే ధర్మన్న ఇంటి బూజుదులిపి కడిగి శుభ్రం చేశాడు. మడేలుకు చెప్పి పక్క బట్టలు ఉడక పెట్టించాడు. నీళ్లపొయ్యి కిందికి కట్టెలు, వాకిట్లో నీళ్ల డ్రమ్ము కడిగి.. అన్నీ సిద్ధం చేసి ఉంచాడు. వాకిట్లో మొరంపోసి గుంతలు నింపి మైదానం చేశాడు. రోజూ ఉదయం, సాయంత్రం రెండు రోజుల నుంచి పటేలు ఇంటి పనులే చేస్తున్నడు. ఆరోజు ఎప్పటిలాగే ఎడ్లకు మేత వేసి పెద్ద దర్వాజకు తాళం వేశాడు ధర్మన్న.
“ఇల్లు సాపు జేసుడైందా?” మొగనికి నీళ్లందిస్తూ అన్నది ధర్మన్న భార్య గంగ.
“ఇంకా పెరట్ల కొంచెం సగవెట్టేదున్నది. రేపు అయిపోతదేమో” తువాలు చిలక్కొయ్యకు తగిలేస్తూ అన్నడు ధర్మన్న.
“ఆవు ఇప్పుడే తిన్నది” అని చెబుతూ..
“గోలీలు సాపయినయి. రేపు ఎట్లన్న తెప్పియ్యాల”.. అత్త పరిస్థితి చెప్పింది గంగ, భర్తకు చాయ్ ఇచ్చుకుంటూ.
“అవుగనీ.. అవ్వ దిన్నదా?” అడిగాడు ధర్మన్న
సప్పుడు అవుతున్న ఫోన్‌ను జేబులోంచి తీస్తూ..
“మర్లా పటేలే ఫోన్ జేస్తున్నాడు” ఆందోళనగా భార్యకేసి చూస్తూ అన్నడు ధర్మన్న.
“లేపవూ.. లేపి మాట్లాడు”
“ఇంకా ఏం అడుగుతడో ఏమో” కంగారుగా అన్నడు ధర్మన్న.
“ఏమన్న అననీ.. ఫోన్ లేపకుంటే ఏమన్న అనుకోడా?” అన్నది గంగ.
“హలో! ఆ పటేలా.. నేను ధర్మన్నని. ఏంటిదో..”
“ఏం లేదు. ఈసారి మా కొడుకు కుటుంబం, మేమంతా రెండు మూడు నెలలు ఉండతందుకు వస్తున్నం. కొంచెం కరెంటు ఎల్పరును పిలిపిచ్చి చెక్ జెయ్యుమను. ఆదిలాబాద్‌ల దిగంబర్ సేటు దుకాండ్లకెళ్లి బియ్యం, పప్పు, శక్కరి, గోధుమలు, నూనె అన్నీ.. మూన్నెల్ల సామాను దీస్కచ్చి ఉంచు. ఇద్దరు పని మనుషులను సుకా మాట్లాడి ఉంచు” అని ఫోన్ పెట్టేశాడు.
“ఏమైంది గట్లజూస్తున్నవ్? అదే.. ఏమన్నడు పటేలు?” అన్నది గంగ కంగారుగా.
“ఏ ఏమిలేదే! ఆల్ల కొడుకు, పటేలు జోడ రెండు మూడు నెలలు ఈన్నే ఉండి పోతందుకు అస్తున్నరట. కిరాణసామాను అదీ ఇదీ అంత కొని ఉంచుమన్నడు. ఆడికెల్లే ఫోన్ల పైసలు గడ్తడట” అని చెప్పాడు ధర్మన్న.
“అబ్బ.. గన్నొద్దులు ఉండతందుకు వస్తున్నరా! అటు శేనుపని జూసుకుంటవా, ఇటు మాలక్ ఇల్లును జూసుకుంటవా?” అని అసహనంగా అన్నది గంగ.
“ఆవే! నాకు సుకా అనిపిస్తున్నది. ఆల్ల లగ్గమైన్నుంచి గిన్నొద్దులు ఉండెతందుకు ఎన్నడు రాలేదు. మాలక్, మాలక్ సాని దివిలెకు, ఉగాదికి, దగ్గరోల్ల లగ్గాలకు అత్తరు. గిప్పుడు అందరత్తున్నరు. నాక్కూడా ఏదో అనుమానంగున్నది” అన్నడు ధర్మన్న.
“ఆల్ల ఇల్లే.. మనమేం అనత్తది. యాడాదిసుకా ఉన్నా ఉండచ్చు” అని విషయాన్ని ముగించింది గంగ.
ధర్మన్నకు ఆ ఊరిలో మంచి పేరున్నది. నమ్మకమైన మనిషని, నిజాయితీ పరుడని అందరంటరు. పదేండ్ల కంటె తక్కువ ఎవరికీ జీతం ఉండలేదు. అతను జీతమున్న ఇంటివాళ్లు నిశ్చింతగా ఉంటరు.
ధర్మన్న భార్య గంగ. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్దకూతురి పెండ్లి చేశాడు. చిన్న కూతురు మండల కేంద్రంలో ఇంటర్, కొడుకు జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నరు. తల్లి ఏడు పదులు దాటిన పెద్దమనిషి. ఆరోగ్యం అంతంత మాత్రమే.
* * *
సాయంత్రం చెట్లమీద పక్షులు అల్లరి చేస్తున్నయి. కొన్ని వాటి పిల్లలతో గూట్లో ముచ్చట్లు పెడుతున్నయి. ఊరి ఆవులు, గేదెలు దుమ్ము లేపుకొంటూ ఇండ్లకు చేరుతున్నయి. వాటి పిల్లలు, తల్లుల అరుపులతో ఊరు ఊరంతా సందడిని సంతరించుకున్నది. నారింజ, బూడిద రంగులు పశ్చిమ దిక్కుకున్న సూర్యున్ని కప్పేశాయి. ఇండ్ల గూనపెంకుల సందుల్లోంచి వంట పొగ మేఘాల్లా కనిపిస్తున్నది. ధర్మన్న ఎడ్లను కట్టేసి, తాళాలన్నిటినీ మళ్లీ ఒకసారి చూసి బయటకొస్తుండగా.. కారు హారన్ చెవిలో పడ్డది. పాటాకు తలుపులు తీసి పక్కకు నిలుచున్నడు. కారు లోపలికొచ్చి ఆగిన వెంటనే గాలిరెడ్డి కుటుంబమంతా ఒక్కొక్కరూ దిగారు. సూటు కేసులు, బ్యాగులన్నిటినీ లోపల పెట్టాడు ధర్మన్న.
“అంతా మంచిదేనా ధర్మన్నా!” కుర్చీలో కూర్చుంటూ అడిగాడు గాలిరెడ్డి.
“మంచిగనే పటేలా” వినయంగా అన్నడు.
“ఇల్లు మొత్తం సాపు జేసినవా?”
అవునన్నట్లు తలూపాడు.
కొడుకూ-కోడలు, పిల్లలు వాకిలంతా తిరుగుతూ ఇంటిని, కొట్టాన్ని, పెద్ద దర్వాజని, పూలచెట్లని వింతగా చూస్తున్నరు.
“పొయస్త పటేలా..” అని ఇంటికి బయలుదేరాడు ధర్మన్న.
ఇంట్లోకి వస్తూనే..
“ఏమైంది అవ్వ గునుస్తున్నది” ఆశ్చర్యంగా అడిగాడు.
“పగటి నుంచీ పానం మంచిగ లేదు. దగ్గు ఎక్వయింది. దమ్ము సుకా సతాయిస్తున్నది”.. అత్తవైపు చూస్తూ భర్తకు చెప్పింది గంగ.
తల్లి దగ్గరికి వంగి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ..
“గోలీలు ఏసుకున్నదా?”
“తిండి పెట్టినంక ఏస్తా” అన్నది గంగ.
“ఈన్నే కూసుంట అవ్వ దగ్గర. ఇద్దరికీ ఈడికే తీస్కరా!”
పప్పులో నానబెట్టిన జొన్నరొట్టె ముక్కలను తల్లికి తినిపిస్తున్నడు. గంగ చేతులు కడుక్కొని అత్తకు గోలీలు వేసింది.

Paditalli 1
తెల్లారి పటేలు ఇంటి దగ్గర.. ఎడ్ల మొగుతాళ్లు విప్పి బయట కట్టేస్తున్నడు ధర్మన్న.
గాలిరెడ్డి కొడుకు వాకిట్లో వేపచెట్టు కింద ల్యాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటున్నడు. గాలిరెడ్డి, ధర్మన్న కొంచెందూరంగా ఏదో మాట్లాడుతున్నరు. ధర్మన్నను దగ్గరికి పిలిచి..
“ధర్మన్నా! ఈ ఊళ్లో రోజూ రెండు మూడు లీటర్ల పాలు దొరుకుడు కష్టమే! బయట కొన్న పాలు మా పిల్లలకు పసందుగావు. మీ బర్రెని మేమున్నన్ని రోజులు మా ఇంట్లనే కట్టెయ్యి. దినాం మాకు పాలు పిండిచ్చి, మీ ఇంటికి కొన్ని తీస్కపో” అన్నడు గాలిరెడ్డి.
గాలిరెడ్డి మాటలు పూర్తికాక ముందే.. ధర్మన్న మొఖంలో నెత్తురు ఇంకిపోయినట్లు అయ్యింది. ఏమనాలో తోచడంలేదు. తువాలుతో మొఖాన్ని తుడుచుకుంటూ..
“ఇక్కడెందుకు పటేలా? మా ఇంటికెళ్లే పిండుకొని తెస్తా” ధైర్యం చేసి అన్నడు.
“మా పిలగాండ్లకు ఎడ్లు, బర్లు, శేన్లు, శెట్లు సూసుడంటే ఎంతో గమ్మతు. గందుకే ఈన్నే కట్టెయ్యుమంటున్న” మనసులో మాట చెప్పేశాడు గాలిరెడ్డి.
మారుమాట్లాడకుండా ఇంటికొచ్చి.. విచారంగా మంచంలో పడుకున్నడు ధర్మన్న.
దిగాలుగా ఉన్న తండ్రిని చూసి..
“ఏమైంది బాపూ.. నెత్తి నొస్తున్నదా!?” అని అడిగింది కూతురు.
బిడ్డ మాటలు విని పరుగెత్తుకొచ్చింది గంగ..
“ఏమైంది? అస్తకస్తనే పన్నపు” భయపడుతూనే అన్నది.
ధర్మన్న లేచి కూర్చొని..
“మాలక్ ఇంటోళ్లు ఉన్నన్ని రోజులు మన బర్రెని ఆళ్ల ఇంటికాడనే కట్టెయ్యుమన్నడు”
“అయితే నువ్వేమన్నవ్?” ఆతృతగా అన్నది గంగ.
“పాలు పిండుకొని వాళ్లింటికే తెస్తనన్నా! ఎన్నితీర్ల జెప్పినా ఆళ్లు ఇన్లే!”
“ఈల్ల శాంతానం గనీ.. ఓల్లన్న బర్రెని ఇంటికాడ కట్టెయ్యుమంటరా! ఈల్లేమ్మంది!? శెరుకు మెత్తగున్నదంటె ఏల్లదంక శీకుడేనా!? అద్దననుంటివి” కసురుకుంటూ అన్నది గంగ.
“అయ్యో! ఇగ బర్రె ఆల్లింటికాడ్నే ఉంటదా! రేపట్నుంచి కాలేజికెట్ల వొకన్నే బాపు!?” బాధతో అన్నది కూతురు.
“అద్దననుంటివి గదనే! మాకు తక్లీబయితదని అననుంటివి” అన్నడు కొడుకు.
“ఏమ్మంది!? దునియల అల్కగున్నోల్ల బతుకులే గింత. కొత్తలు సుకా అస్తయో రావో!?” దిగులుగా అన్నది గంగ.
తిండి పొయిమీదనే ఉన్నది. ముసలమ్మ దగ్గు తప్ప.. ఆ ఇల్లంతా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.
బర్రెని మాలక్ ఇంట్లో ఉంచడం ధర్మన్నకు, గంగకు తీరని వేదనకు గురిచేసింది. బర్రె లేకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుంది. వద్దు అనొస్తదా! పెద్ద కూతురు పెండ్లికి పటేలు దగ్గర రెండు లక్షలు బాకీ తీస్కున్నడు. యాడాదికి నలభైవేలు మిత్తి. జీతం పైసలు డబ్బు వేల నుంచి మిత్తి కట్ చేసుకొని ముప్పై వేలు ఇస్తున్నడు. ఇంకా రెండు సంవత్సరాలకు గాని బాకీ తీరదు. బండ కింద చెయ్యి మనదున్నపుడు అడిగే ధైర్యమొస్తదా!? ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నరు.
రోజూ పొద్దునపూట ధర్మన్న మాలక్ ఇంటికి పనికెళ్తే.. కొడుకు బర్రె పెండ దీసి ఊడ్చేయ్యడం, నీళ్లు, కుడితి పెట్టడం, గడ్డిమోపు తేవడం, పెయిదుడ్డెకు సన్నంగడ్డి వెయ్యడం లాంటి పనులన్నీ చేసి కాలేజీకెళ్తడు. గంగ పాలు పిండి, ఊర్లో ఇంటింటికీ తిరుగుతూ పాలమ్ముతుంది. కూతురు ఇంటిపని, వంటపని చేసి కాలేజీకెళ్తుంది. ఇలా ఎవరూ ఖాళీ ఉండకుండా పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నరు.
ఇంట్లో బర్రె లేకపోవడంతో ఇబ్బందులతోపాటు దాని యాది అందరినీ కలిచివేస్తున్నది. ధర్మన్న కూతురికి జ్ఞాపకాలు ఒక్కక్కటి కండ్లముందు కదలుతున్నయి.
* * *
సరిగ్గా నెల ముందు సట్టి పండుగునాడు బాపు బర్రెను, దుడ్డెను చెరువులో శుభ్రంగా కడుక్కొని వచ్చిండు. సట్టి పండుక్కు రావాలని అక్కకు, బావకు, మామకు ఫోన్ చేసి చెప్పిండు. సాయంత్రం అమ్మ సల్లచారు, పప్పు, పాషం రెండు కూరలు సిద్ధం చేసింది. బాపు పాలకుండలు, పెరుగు దుత్తలకు బంతిపూల దండలు కట్టిండు. అన్నిటినీ వరుసగా పెట్టి.. పాలునింపి పసుపుకుంకుమ బొట్టు పెట్టింది అమ్మ. బర్రెకు, దుడ్డెకు, ఇంటికీ, పంటకు ఎప్పుడూ కాపలా ఉండే కుక్కకు మల్లన్న దేవునిగా భావించి పూలదండలు ఏసిండు అన్న. ముద్దుగా ముస్తాబైన పెయిదుడ్డెను మెడనిండా చేతులేసి ముద్దుపెట్టుకున్నది ధర్మన్న కూతురు. కుక్కను తలపై పునుకుతూ హత్తుకున్నది.
“సల్లంగ జూడండ్రి! పాడి పంటలు ఇంటినిండా ఇయ్యుండ్రి” అని బర్రెకు, కుక్కకు ఇంటి వాళ్లంతా మొక్కి నైవేద్యం పెట్టినరు.
“అమ్మా! పెద్దగ అయినంక ఈ దుడ్డెను అమ్మద్దు. మనమే ఉంచుకుందం”.. దుడ్డెను పునుకుతూ గావురంగా అన్నడు ధర్మన్న కొడుకు.
“మనమే ఉంచుకుందం కొడుకా” అన్నది తల్లి.
ఐదేండ్ల కింద అమ్మమ్మ ఇంట్లో పాము కుట్టి పాడిబర్రె చనిపోతే.. పెయిదుడ్డెని తెచ్చున్నది అమ్మ. అదే ఈ బర్రె! పెరిగి పెద్దగయి.. నిరుడు ఈని ఆడబిడ్డను కన్నది. బర్రె తొందరగా ఈనకపోతే తెలిసినోళ్లని తీసుకొచ్చిండు ధర్మన్న. తల్లీబిడ్డ సుఖంగా బయట పడాలె మల్లన్న దేవుడా.. అని! ఇంటివాళ్లంతా పబ్బతి వట్టినరు. వారం రోజులు కోమట్ల హనుమండ్లు బావ, సతీషు, పరీదులు శెక్కరి తెచ్చుకుని జున్ను తిన్నరు.
రోజూ రెండు మూడు లీటర్లు పాలిస్తుంది. ధర్మన్న జీతం పైసలు సగం ఖర్చుకు పనికొస్తే.. ఈ పాల పైసలతోనే చదువుకు పుస్తకాలు, నోట్‌బుక్స్, కాలేజీ పోడానికి ఆటోకు, పెద్దమనిషి మందుల ఖర్చులు అన్నీ తీరిపోతయి. గట్ల.. ఈ బర్రెనే వాళ్లను కన్నతల్లిలా సాదుతున్నది. ఇప్పుడు బర్రెలేదు. పాలు లేవు. పైసలు లేవు. తెల్లారి, మరునాడు కాలేజీకి వెళ్లలేక.. బర్రెలేనిది చూసి బోరున ఏడ్చింది కూతురు. తల్లికీ ఏడుపాగలేదు.
నెల రోజులు దాటి పోయింది. పటేలు ఇంటి దగ్గరే బర్రె పాలు పిండిచ్చి, కుడితి పెట్టి.. ఎప్పటిలాగే చూసుకుంటున్నడు ధర్మన్న.
గాలిరెడ్డి కొడుక్కు వర్క్ ఫ్రం హోం. ఇక్కడి నుంచే డ్యూటీ చేస్తున్నడు. భార్యాపిల్లలను కారులో తిప్పుతూ.. ఊరి బయట పంట పొలాలు, వాగులు, వంకలు, చెరువులు చూయిస్తున్నడు. ధర్మన్న పాలు పిండుతున్నపుడు పిల్లలకు చూయిస్తూ..
“మన బెంగళూరు ఇంట్లో మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి కదా! ఆ పాలు ఈ బఫెల్లో నుంచే ఇలా పిండి ప్యాకెట్లో అమ్ముతారు” అని ఇద్దరు పిల్లలకూ ఇంగ్లిషులో చెప్తున్నడు.
పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నరు.
“వాటీస్ దిస్ పప్పా!” అడిగింది కూతురు
“మరి అవ్వేంటి పప్పా!?” ఎడ్లను చూయిస్తూ అడిగాడు కొడుకు.
“దానిని గ్రాస్.. తెలుగులో గడ్డి అంటారు. మనకు అన్నంలాగే.. దానికి ఇది అన్నం” చెప్పాడు.
* * *
ధర్మన్న తల్లి పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నది. బర్రె ఉన్నప్పుడు రోజూ కొన్ని పాలు తాగేది. ఒకరోజు తల్లికి ఒంట్లో బాగాలేదని ఇంట్లోనే ఉండిపోతే.. బర్రె రాత్రంతా అరిచిందట. రాత్రి పది దాటింది. నిద్రలోకి జారి పోయాడు ధర్మన్న. అంతలోనే ఫోన్ మోగింది.
“హలో హలో.. ఆ పటేలా ఏం చెప్పు?”
“మన బర్రెకు కడుపుబ్బింది. కాళ్లు గొట్టుకుంటా బొర్లుతున్నది”
పటేలు మాట పూర్తిగా కాకముందే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పరుగెత్తుకుంటూ వెళ్లాడు ధర్మన్న. అప్పటికే అక్కడ చాలామంది గుమిగూడారు. కొందరు పొట్టగొట్టి చూస్తున్నరు. కొందరు కాళ్లకు గాట్లు, గాయాలు చూస్తున్నరు. ఆముదం తాగించాలని కొందరు, గాజరి చెక్కు, ఇంగు పొయ్యాలని ఇంకొందరు చెబుతున్నరు. కొందరేమో వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ చేస్తున్నరు. బర్రెను బతికించడానికి ఎవరికి తెలిసిన రీతిలో వాళ్లు ప్రయత్నం చేస్తున్నరు. అయినా తగ్గలేదు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది.
గాలిరెడ్డికి లోపల భయం భయంగా ఉంది.
ఏమైనా జరగరానిది జరిగితే.. ధర్మన్న కాళ్లు, చేతులు వణకుతున్నయి. చేసేదేమీ లేక ఒకమూలకు వెళ్లి కాళ్ల మధ్యన తలపెట్టి ఏడుస్తున్నడు. ఏ ముఖంతో ఇంటికెళ్లాలని దుఃఖిస్తున్నడు.
‘కాని కాలంలో కన్నీళ్ల గాయాల్ని తుడిచిన కొంగుని చివరిజాము గుండె నిండా కండ్ల కద్దుకొని.. రేపటి తన బువ్వ గిన్నెల్ని, పాలబుగ్గల్ని మనసారా దయ తీసుకొని, మృత్యులోయ అంచును తాకుతూ వస్తున్న ఆ మట్టిమనిషి.. రేపు కచ్చితంగా పొద్దును చూస్తాడని చెప్పలేము’ అన్నట్టు ధర్మన్న పరిస్థితి మారిపోయింది.
ఉదయం ఆరుగంటలు.. తూర్పు దుప్పటిని చీల్చుకొని సూర్యుడు మెల్లగా లోకాన్ని చూస్తున్నడు. పక్షులు, జంతువులు నిద్రను దులిపేసుకుంటున్నయి. పాలకోసం పెయిదూడ అరుస్తున్నది.
“బర్రె మంచిగైందా బాపు!?” బాధగా అడిగాడు గాలిరెడ్డి కొడుకు.
ఏమీ మాట్లాడకుండా బర్రె వైపు చూస్తూ ఉండిపోయాడు గాలిరెడ్డి.
బర్రె కొమ్ముల నుంచి మూతి, చెవులు అన్నిటినీ ముద్దించుకుంటూ ఏడుస్తున్నడు ధర్మన్న.
‘ఇగ నా పాలొడ్సినయి కొడుకా!’ అన్నట్లు.. రెప్పవేయకుండా ధర్మన్నవైపే చూస్తున్నది బర్రె.
ఓ అమ్మలా తన ఇల్లును, పిల్లల్ని సాదుతున్న ఆ పాడితల్లిని చూస్తూ దుఃఖిస్తున్నడు ధర్మన్న.
ఆ ఏడుపుతో చుట్టు పక్కలవాళ్లంతా గుమిగూడి బర్రె వైపు, ధర్మన్న వైపు దీనంగా చూస్తున్నరు.
“చూసినవా బాపు! అనవసరంగా కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అయింది. బర్రె ధర ఇప్పుడు దాదాపు లక్ష రూపాలు. పాపం.. ధర్మన్న మామ కుటుంబానికి ఇదే ఆధారమట. నువ్వు మా మీద ప్రేమతో మేం ఉన్నన్ని రోజులు మమ్మల్ని సంతోషంగా ఉంచుదామని అనుకున్నావు. మంచి పాలు దొరుకుతాయని బర్రెను మనింట్లోనే ఉంచావు. ఇన్నేండ్ల నుంచి మనకు జీతం ఉండి.. తన నెత్తురును చెమటగా మార్చి మన గాదెలు నింపిండు ధర్మన్న మామ. తాను మాత్రం చాలీచాలని తడకల ఇంట్లో గడుపుతున్నాడు. ఆళ్ల పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. పాపం.. వాళ్ల అమ్మకు ఆరోగ్యం బాగాలేక, మందులు లేక, తాగేందుకు పాలుకూడా లేక పరిస్థితి ఘోరంగా మారిందట. పిల్లలు కాలేజికి కూడా పోతలేరట. ఇక్కడ ఉన్నన్ని రోజులే కదా ఈ పాలు. తర్వాత! అక్కడ అవ్వే పాలు!”
కొడుకు మాటలకు గాలిరెడ్డి శరీరమంతా భయంతో వణికిపోతున్నది. ఆ మాటలు వింటూనే బర్రె వైపు చూస్తున్నడు. ధర్మన్న ఏడుపు మాత్రం ఆగడంలేదు.
అంతలోనే బర్రె దగ్గరినుంచి పెండ, మూత్రం.. కాలువలా పారుతూ కనిపించింది. కడుపు ఉబ్బరం మెల్లగా దిగుతున్నది. బర్రె చిన్నగా కదలడం మొదలు పెట్టింటి. ఇద్దరూ చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు.
బర్రెను, దుడ్డెను అదిలిస్తూ.. గాలిరెడ్డి, ధర్మన్న ఇంటివైపు నడుస్తున్నరు. వాటిని చూసి గంగ సంతోషం గంగలా పారింది. పిల్లలు దూడల్లా గంతులేశారు.
– డాక్టర్ ఉదారి నారాయణ, 94414 13666
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

