క్వార్టర్స్‌లో ఓడిన డిఫెండింగ్ చాంపియన్.. మహిళల సెమీస్‌లో నలుగురూ కొత్తవారే ఫైనల్ ఫోర్ చేరిన నాదల్, సిట్సిపాస్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో సంచలనాల మోత కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌కు క్వార్టర్స్‌లోనే మారియా సకారి చేతిలో షాక్ ఎదురైంది. దీంతో ఈసారి ఇద్దరు అన్‌సీడెడ్, మరో ఇద్దరు కనీసం టాప్-15లో కూడా లేని ప్లేయర్లు మట్టికోర్టు టోర్నీ సెమీస్ చేరారు. వీరందరికీ గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పురుషుల విభాగంలో మట్టికోర్టు రారాజు నాదల్, సిట్సిపాస్ సెమీస్‌లో అడుగుపెట్టగా.. మెద్వెదెవ్ ఓడిపోయాడు.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో పోరు అనూహ్యంగా మారిపోయింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లో అడుగుపెట్టిన నలుగురు మహిళా ప్లేయర్లు ఫైనల్లో చోటు కోసం పోటీపడనున్నారు. టాప్-10లో మిగిలిన డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)కు కూడా క్వార్టర్స్‌లోనే ఓటమి ఎదురవడంతో టోర్నీ నుంచి మహిళా స్టార్ ప్లేయర్లందరూ నిష్క్రమించినట్టయింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 8వ సీడ్ స్వియాటెక్ 4-6, 4-6 తేడాతో 17వ సీడ్ మారియా సకారీ (గ్రీకు) చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోని స్వియాటెక్ క్వార్టర్స్‌లో తేలిపోయింది. సకారి ఐదు ఏస్‌లు, 26 విన్నర్లతో రెచ్చిపోతే.. స్వియాటెక్ ఒక్క ఏస్ కూడా బాదలేకపోయగా.. 17 విన్నర్లకే పరిమితమైంది. మూడుసార్లు సర్వీస్ బ్రేక్‌కు గురై మూల్యం చెల్లించుకుంది. దీంతో ఇగా 11 విజయాల పరంపరకు బ్రేక్ పడింది.
అమెరికా 17 ఏండ్ల యువ సంచలనం కోకో గాఫ్‌కు క్వార్టర్స్‌లో ఎదురుదెబ్బ తగిలింది. అన్‌సీడెడ్ బార్బోరా క్రెజ్సికోవా చేతిలో 6-7 (8/6), 3-6 తేడాతో గాఫ్ ఓటమి పాలైంది. ఆదిలో విజృంభించిన గాఫ్ ఓ దశలో 3-0తో ముందంజ వేసినా ఆ తర్వాత చతికిలపడింది. దీంతో తొలిసెట్ టైబ్రేకర్‌కు వెళ్లగా బార్బోరా సత్తాచాటింది. రెండో సెట్ వెనుకబడిన గాఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా.. క్రెజ్సికోవా తొలిసారి సెమీస్‌కు వెళ్లింది. మ్యాచ్‌లో 41 తప్పిదాలు చేసి గాఫ్ మూల్యం చెల్లించుకుంది.
13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ రఫా 6-3, 4-6, 6-4, 6-0తో పదో సీడ్ డిగో స్వార్జ్‌మన్ (అర్జెంటీనా)ను అలవోకగా ఓడించాడు. ఈ ఏడాది తొలిసారి సెట్ కోల్పోయినా నాదల్ తన ైస్టెల్లో రఫ్పాడించాడు. కాగా రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)కు ఐదో సీడ్ స్పెఫనోస్ సిట్సిపాస్ చేతిలో నిరాశ ఎదురైంది. క్వార్టర్స్‌లో సిట్సిపాస్ (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/3), 7-5తో మెద్వెదెవ్‌ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. సెమీస్‌లో ఆరో సీడ్ జ్వెరెవ్‌ను సిట్సిపాస్ ఢీకొట్టనున్నాడు. కాగా మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్.. తొమ్మిదో సీడ్ బెరెటినీతో తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్ నాదల్కు ఎదురుపడనున్నాడు. దీంతో సెమీస్‌లో రఫా – జొకో సూపర్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఈసారి స్టార్ ప్లేయర్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమించారు. బార్టీ, సబెలెంక, సోఫియా, స్వితోలినా, సెరెనా విలియమ్స్ ఇలా ఒక్కొక్కరు ఓడిపోవడంతో ఈసారి సెమీస్‌లో నలుగురూ కొత్తవాళ్లే చేరుకున్నారు. తమారా జిదాన్సెక్ , పవ్లుచెన్‌కోవా, సకారి, క్రెజ్సికోవా ఈసారి సెమీస్‌లో చోటు దక్కించుకున్నారు. గ్రాండ్‌స్లామ్ మహిళల సెమీస్‌లో అందరూ కొత్తవారు తలపడడం టెన్నిస్ చరిత్రలో ఇది రెండోసారి.