హైదరాబాద్, ఆట ప్రతినిధి: మన దేశంలో ఆటల్లో క్రికెట్‌కే యమా క్రేజ్. కపిల్ దేవ్ నుంచి కోహ్లీ వరకూ, సచిన్ నుంచి వైభవ్ సూర్యవంశీ దాకా ఎంతో మంది క్రికెటర్లు లెక్కలేనంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే, ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి టోర్నీలు వస్తే అందరూ కళ్లప్పగించి చూస్తారు. కానీ, ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగించే ఫుట్‌బాల్‌కు మన దగ్గర ఆదరణ తక్కువే.అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ వేళ హైదరాబాద్ సైనిక్‌పురి పరిధిలోని వళ్లువర్ నగర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీధుల నిండా అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్ దేశాల జెండాలతో కళకళలాడుతూ ఈ ప్రాంతం ఓ మినీ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తలపిస్తోంది మెస్సీ, రొనాల్డో, నెయ్మార్ లాంటి స్టార్ ఆటగాళ్ల భారీ కటౌట్లతో సాకర్ ఫీవర్‌తో ఊగిపోతోంది.
తమిళ ప్రజలు ఎక్కువగా నివసించే వళ్లువర్ నగర్‌కు మినీ బ్రెజిల్ అనే పేరుంది. ఆ పేరు ఊరికే రాలేదు. ఇక్కడ ఫుట్‌బాల్ అనేది ఒక ఆట మాత్రమే కాదు, అది తరాల నాటి ఒక బలమైన భావోద్వేగం. ఇక్కడి ఇళ్లల్లో, వీధుల్లో ఎక్కడ విన్నా ఫుట్‌బాల్ ముచ్చట్లే వినిపిస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పుడే ఫుట్‌బాల్ మైదానాన్ని పరిచయం చేస్తారు. స్థానిక వళ్లువర్ నగర్ ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్లో పాత ఆటగాళ్లు కోచ్‌లుగా మారి కొత్త తరాన్ని తీర్చిదిద్దడం ఇక్కడి ప్రత్యేకత. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్ జరుగుతుండటంతో ఇక్కడి వీధులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఆరు దశాబ్దాల క్రీడా వారసత్వం..
ఈ సుదీర్ఘ క్రీడా వారసత్వం ఈనాటిది కాదు. వళ్లువర్ నగర్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రయాణం 1960ల చివర్లోనే ప్రారంభమైంది. ఒకప్పుడు సీనియర్ ఆటగాళ్లు జూనియర్లకు కోచింగ్ ఇచ్చే సాంప్రదాయ పద్ధతి, ఇప్పుడు 9 మంది సర్టిఫైడ్ కోచ్‌లతో ఒక క్రమబద్ధమైన ప్రోగ్రామ్‌గా రూపాంతరం చెందింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచే ఇక్కడ కోచింగ్ సెషన్స్ ఎంతో క్రమశిక్షణతో ప్రారంభమవుతాయి. ఎంతో మంది యువకులు, చిన్నారులు ఈ గ్రౌండ్లో ఫుట్‌బాల్ వెంట పరుగులు పెడుతుంటారు. ఈ మైదానంలోనే ఓనమాలు నేర్చకున్న చాలా మంది జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. కొన్నేండ్లుగా అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఈ గ్రౌండ్‌కు వస్తున్నారు. ఫుట్‌బాల్‌ను కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. ఈ మైదానం ఎందరో యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, క్రమశిక్షణతో కూడిన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉపయోగపడిందని కోచ్ ఇమాన్యుయెల్ చెప్పాడు. స్పోర్ట్స్ కోటా ద్వారా యువత ఉద్యోగాలు సాధించడానికి ఈ శిక్షణ ఎంతగానో తోడ్పడుతోందని అతడు పేర్కొన్నాడు. ప్రైవేట్ అకాడమీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో, ప్రతిభ ఉన్న పేద పిల్లలందరికీ ఈ క్లబ్ ఉచితంగా అవకాశం కల్పిస్తూ సాకర్ కలలను నిజం చేస్తోందని ఇదే గ్రౌండ్లో ఆట నేర్చుకొని కోచ్‌గా ఎదిగిన ఇమాన్యుయెల్ గర్వంగా చెప్పాడు.