ఐపీఎల్ 2022లో తన వేగంతో అందరి మతులూ పోగొట్టిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్‌కు టీమిండియా పిలుపు కూడా వచ్చింది. సౌతాఫ్రికాతో ఆడే జట్టులో అతన్ని ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఉమ్రాన్ గురించి దిగ్గజ పేసర్ బ్రెట్‌లీ స్పందించాడు. ఉమ్రాన్ బౌలింగ్ చూస్తే తనకు పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ గుర్తొస్తాడని బ్రెట్‌లీ చెప్పాడు.
‘‘ఉమ్రాన్ దగ్గర చాలా పేస్ ఉంది. పోరాడే ఆటగాడు కూడా. గతంలో ఉన్న చాలా మంది పేసర్లలాగే పరిగెడుతున్నాడు’’ అని వివరించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేస్తూ.. కీలక వికెట్లు తీస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.