ఫిలాడెల్ఫియా (యూఎస్): రెండుసార్లు ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్స్‌కు ప్రవేశించింది. ఆ జట్టు సారథి కిలియన్ ఎంబాపె ఈ టోర్నీలో ఏడో గోల్‌తో మాజీ చాంపియన్‌కు మరో విజయం అందించి తన జట్టు ముందంజ వేయడంలో కీలకపాత్ర పోషించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్.. 1-0తో పరాగ్వేను ఓడించి వరుసగా నాలుగోసారి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన పోరులో స్టార్ స్ట్రైకర్ ఎంబాపె మాత్రమే ఏకైక గోల్ కొట్టాడు. ఈ విజయంతో ఫ్రాన్స్.. గురువారం జరిగే క్వార్టర్స్ పోరులో మొరాకోను ఢీకొననుంది. ఖతార్ ప్రపంచకప్‌లో ఇవే రెండు జట్ల మధ్య జరిగిన సెమీస్‌లో మొరాకో.. ఫ్రాన్స్ చేతిలో అపజయం పాలైంది.
పరాగ్వే చెత్త ఆట
రౌండ్-32లో అగ్రశ్రేణి జట్టు జర్మనీని షూటౌట్లో ఓడించిన పరాగ్వే.. ప్రిక్వార్టర్స్‌లో మాత్రం చెత్త ఆట ఆడింది. మ్యాచ్‌లో గోల్స్ చేయడం కంటే ప్రత్యర్థి జట్టు సారథితో పాటు ఇతర ఆటగాళ్లను కవ్విస్తూ వారితో వాగ్వాదానికి దిగడం, భౌతికంగా దాడులకు దిగడంపైనే దృష్టి సారించింది. దీంతో మ్యాచ్‌లో పలుమార్లు ఇరుజట్ల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా ఎంబాపెను లక్ష్యంగా చేసుకున్న ఆ జట్టు అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేసింది. ఇక పరాగ్వే గిల్లికజ్జాలకు పాల్పడినా ఫస్టాఫ్‌లో 85 శాతం బంతిని తమవద్దే ఉంచుకున్నా ఫ్రాన్స్ మాత్రం గోల్ చేయలేకపోయింది. సెకండాఫ్ మొదలయ్యాక కొద్దిసేపటికే ఎంబాపె.. పరాగ్వే గోల్ పోస్ట్‌కు సమీపంలో కార్నర్ వరకూ వచ్చినా దానిని గోల్‌గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. 55వ నిమిషంలో మన్యు కొనె ప్రయత్నం కూడా ఫలించలేదు. తొలి అర్ధభాగం మొత్తం ఆ జట్టు గోల్స్ కొట్టకుండా అడ్డుకోవడంలో పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు.
కిలియన్ మ్యాజిక్
సుమారు గంటకు పైగా ఫ్రాన్స్‌ను గోల్ చేయకుండా నిలువరించడంలో విజయవంతమైన పరాగ్వే తర్వాత డియాగొ గొమెజ్ చేసిన తప్పిదంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతిని ప్రత్యర్థి రక్షణశ్రేణిని దాటుకుని గోల్ వైపుగా దూసుకువస్తున్న ఫ్రాన్స్ ఆటగాడు డిజిరె డుయెకు గొమెజ్ అడ్డుపడటంతో ఎంబాపె సేనకు పెనాల్టీ లభించింది. దీనిని ఫ్రాన్స్ కెప్టెన్ రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని తెలివిగా వలలోకి నెట్టేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పరాగ్వే గేరు మార్చి ప్రత్యర్థి గోల్‌పోస్ట్ పైకి ఎదురుదాడికి దిగినా ఫలితం లేకపోయింది. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్‌లోనూ పరాగ్వే గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పరాగ్వే ఆటగాళ్లు నానా రచ్చ చేసిన మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లకు ఒక్కటంటే ఒక్క ఎల్లో కార్డు రాకపోగా ఫ్రాన్స్‌కు మాత్రం మూడు పసుపు కార్డులు రావడం కొసమెరుపు.
గోల్డెన్ బూట్ రేసులో..
సాకర్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా దిగ్గజం మెస్సీ, ఫ్రాన్స్ స్ట్రైకర్ ఎంబాపె మధ్య రసవత్తరంగా సాగుతున్న గోల్డెన్ బూట్ రేసు ఆదివారం నాటి మ్యాచ్‌తో తారాస్థాయికి చేరింది. పరాగ్వే మ్యాచ్‌లో గోల్‌తో కిలియన్ కూడా ఏడు గోల్స్‌తో అర్జెంటీనా సారథితో సమంగా నిలువడం గమనార్హం. ఖతార్ ఎడిషన్‌లో ఎంబాపె (8 గోల్స్)నే గోల్డెన్ బూట్ వరించింది. తాజా టోర్నీలో భాగంగా ఈ రేసులో ఈ ఇద్దరి తర్వాత ఎర్లింగ్ హాలెండ్ (నార్వే-5), హ్యారీ కేన్ (ఇంగ్లండ్-5), ఒస్మాన్ డెంబెలె (ఫ్రాన్స్-2) టాప్-5లో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా ఆరు వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఖాతాలో 20 గోల్స్ ఉండగా 19 మ్యాచ్‌లే ఆడిన ఎంబాపె.. 19 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.