చెన్నూర్ రూరల్: రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు విప్లవాత్మకంగా తీసుకొచ్చిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ మైలురాయిగా నిలుస్తాయని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. గురువారం చెన్నూర్ మండల కేంద్రంలో జరిగిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంత యువత నిరంతరం క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రతీ దగ్గర క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం.
స్పోర్ట్స్ కిట్లను అందజేయడం ద్వారా యావత్ క్రీడా సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలను క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సీఎం చేపడుతున్న వినూత్నమైన, విభిన్నమైన పథకాలు ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధంగా ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పథకం కచ్చితంగా నిలిచిపోతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.