ఆసక్తి లేని మ్యాచ్‌లకు స్వస్తి పలుకుతూ..హుషారెత్తించే పోటీలకు స్వాగతం చెబుతూ..నేటి నుంచి టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ ప్రారంభం కానుంది. ఏడాది తిరగక ముందే వచ్చేసిన మెగాటోర్నీ.. మరింత మజా అందించేందుకు రెడీ అయింది. ఆతిథ్య ఆస్ట్రేలియా తరఫున అల్లాడించేందుకు వార్నర్, ఫించ్ సిద్ధమైపోగా.. జెంటిల్మెన్ క్రికెట్‌కు పెట్టింది పేరైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన క్లాసిక్ టచ్ ప్రపంచానికి చాటేందుకు సమాయత్తమవుతున్నాడు. షాహీన్ అఫ్రిది బుల్లెట్ యార్కర్లకు దీటైన బదులివ్వాలని రోహిత్, కోహ్లీ స్కెచ్‌లు వేస్తుంటే.. రిజ్వాన్, బాబర్ హిట్‌పెయిర్ అనిపించుకోవాలని చూస్తున్నారు. వీరబాదుడే పరమావధిగా ఇంగ్లండ్ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటుంటే.. గింగిరాలు తిప్పే గూగ్లీలతో మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ కాచుకు కూర్చున్నాడు. మరింకెందుకు ఆలస్యం.. పొట్టి ఫార్మాట్లోని అసలు సిసలు ఆనందాన్ని ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
సిడ్నీ: సరిగ్గా ఏడాది క్రితం యూఏఈ వేదికగా భారత్ నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ను మరవక ముందే.. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల ఉప్పెనలో ముంచెత్తేందుకు మరోసారి వరల్డ్‌కప్ వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా వారం రోజుల క్రితమే టీ20 ప్రపంచకప్‌నకు తెరలేవగా.. శనివారం నుంచి సూపర్-12 దశ ప్రారంభం కానుంది. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగనున్న ఈ మెగాటోర్నీలో 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-1లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ శ్రీలంక ఉండగా.. గ్రూప్-2లో బంగ్లాదేశ్, భారత్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే పోటీ పడుతున్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో పోటీ పడనుండగా.. టేబుల్ టాపర్స్‌గా నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి.
ఆస్ట్రేలియా X న్యూజిలాండ్
నిరుడు ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన ఇరు జట్ల మధ్య పోరుతో ఈ ఏడాది సూపర్-12 దశ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. రన్నరప్ న్యూజిలాండ్ మధ్య శనివారం తొలి పోరు జరుగనుంది. విశ్వవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే సూచనలున్నాయి. పేస్‌కు స్వర్గధామమైన సిడ్నీ పిచ్‌పై మబ్బులు కమ్మిన వాతావరణంలో స్పీడ్ స్టార్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. ఇరు జట్లలోనూ సూపర్ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఫించ్, వార్నర్, మిషెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, డేవిడ్‌తో కూడిన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తుంటే.. కాన్వే, గప్టిల్, విలియమ్సన్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, నీషమ్‌తో న్యూజిలాండ్‌కు కూడా మెరుగైన బ్యాటింగ్ బలగం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హజిల్‌వుడ్ రూపంలో కంగారూలకు ముగ్గురు మొనగాళ్లు అందుబాటులో ఉండగా.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్‌పై కివీస్ ఆశలు పెట్టుకుంది. మరి గత ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంటుందా లేక, సొంతగడ్డపై ఆసీస్ శుభారంభం చేస్తుందా చూడాలి. మరో పోరులో అఫ్గానిస్థాన్‌తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది.