ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలి మూడు రోజులు వెయిట్ లిఫ్టర్లు విజృంభిస్తే..సోమవారం జూడో ప్లేయర్లు సాహో అనిపించారు.
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సుశీలాదేవి వెండి వెలుగులు విరజిమ్మగా.. విజయ్ కుమార్ కాంస్యంతో మెరిశాడు. అంతకుముందు లిఫ్టర్ అచింత షూలి దేశానికి మూడో పసిడి పతకం అందించగా.. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్, అమిత్ పంగల్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. లాన్‌బౌల్స్‌లో తొలిసారి పతకం ఖాయం చేసుకున్న మన అమ్మాయిలు రికార్డులు తిరుగరాయగా.. పతకాలు సాధించడం పక్కా అనుకున్న స్విమ్మర్ సజన్ ప్రకాశ్, స్కాష్ ప్లేయర్ జోష్న చినప్ప పరాజయాలతో ఇంటి బాటపట్టారు. హాకీలో ఇంగ్లండ్‌తో పోరును టీమ్ఇండియా ‘డ్రా’ చేసుకోగా.. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో మన షట్లర్లు దుమ్మురేపారు.
మగ్గంపై చిన్న సూదితో రకరకాల ఎంబ్రాయిడరీలు నేసిన ఆ చేతులే.. మూడొందల కేజీల పైచిలుకు బరువెత్తి కామన్వెల్త్ క్రీడల రికార్డు బద్దలు కొట్టాయి! పసితనంలో పతంగులు ఎగరేస్తూ.. మణికట్టు మాయాజాలం కనబర్చిన ఆ చిన్ని చేతులే.. బర్మింగ్‌హామ్‌లో విజృంభించి భారత్ ఖాతాలో మూడో పసిడి పతకాన్ని వేశాయి! పూట గడవడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి మగ్గం నేసిన ఆ 20 ఏండ్ల కుర్రాడే.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గి యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తాడు! పసితనం నుంచే పేదరికంతో సహవాసం చేసిన ఆ యువ వెయిట్ లిఫ్టరే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అచింత షూలి. కష్టాల కడలి దాటి.. విజయ దరహాసం చేసిన బెంగాల్ బుల్లోడి ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:బెంగాల్‌లోని హౌరా జిల్లా దెవుల్పూర్కు చెందిన అచింత షూలి వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేయడం విచిత్రంగా జరిగింది. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో తల్లీ, సోదరుడితో కలిసి ఇంట్లోనే మగ్గం పనులు చేస్తూ జీవనం సాగించిన అచింతకు చిన్నతనంలో పతంగులు ఎగుర వేయడమంటే మహా సరదా. సంక్రాంత్రి పండుగ సందర్భంగా నిర్వహించే పతంగుల పోటీల్లో చురుగ్గా పాల్గొనే అచింత.. స్నేహితుల పతంగులను నేలకూల్చడంలో సిద్ధహస్తుడు. ఈ క్రమంలో ఒక రోజు అచింత పతంగి దారం తెగి తన సోదరుడు అలోక్ వెయింట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకుంటున్న వ్యాయమశాలపై పడింది. దీంతో దాన్ని అందుకునేందుకు అక్కడికి చేరుకున్న అచింత.. పతంగి ఎగురవేసే తన నైపుణ్యంతో సోదరుడి కోచ్ ఆస్తమ్ దాస్‌ను కట్టిపడేశాడు. అతడిలో టాలెంట్ గుర్తించిన కోచ్ రేపటి నుంచి వ్యాయమశాలకు రమ్మని అతడిని కోరాడు.
సచిన్‌కు అజిత్‌లా..
సచిన్ టెండూల్కర్‌కు మార్గనిర్దేశకుడిగా ఉంటూ మాస్టర్ బ్లాస్టర్ కెరీర్‌ను చక్కదిద్దిన సోదరుడు అజిత్‌లా.. అచింతను అలోక్ తీర్చిదిద్దాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తనకు ఇష్టమైన వెయిట్ లిఫ్టింగ్‌ను పక్కనపెట్టి.. కుటుంబం కోసం ఇంట్లో మగ్గం పనులతో పాటు బయట కూలీకి వెళ్లేవాడు. తమ్ముడికి సరైన శిక్షణ ఇప్పిస్తే.. అద్భుతాలు చేయగలడని గుర్తించిన అలోక్.. అచింతను ఆ దిశగా ప్రోత్సహించాడు. అన్న ఆశలు వమ్ము చేయని అచింత.. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకాలు సాధిస్తూ వచ్చాడు. 2015లో జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో పతకం నెగ్గడం ద్వారా ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చోటు దక్కించుకున్న అచింత.. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కామన్వెల్త్ యూత్ చాంపియన్‌షిప్ (2015), ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (2018)లో రజతాలు సాధించిన అచింత.. 2019 పోటీల్లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. అప్పటి వరకు పూరి పాకలోనే నివసించిన అచింత కుటుంబం ఆ తర్వాతే పక్కా ఇంటికి మారింది. ఎదిగే కొద్ది ఒదగాలన్న నానుడిని వంట బాగా బట్టించుకున్న అచింత.. ఆదివారం అర్ధరాత్రి యావత్ భారతావని నిద్రిస్తున్న సమయంలో జాతిని జాగృతం చేసే ఫలితం సాధించి దెవుల్పూర్ గ్రామంలో పండుగ వాతావరణం సృష్టించాడు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే తన లక్ష్యమంటున్న ఈ బెంగాలీ కుర్రాడికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం!
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి వెయిట్ లిఫ్టర్ అచింత షూలి పసిడి పతకంతో ఆకట్టుకుంటే.. సోమవారం జూడోలో మనవాళ్లు రెండు పతకాలు పట్టారు. మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా దేవి రజతం సాధించగా.. పురుషుల 60 కేజీల ఈవెంట్లో విజయ్‌కుమార్ యాదవ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. తుదిపోరులో 4.25 నిమిషాల పాటు ప్రత్యర్థితో హోరాహోరీగా పోరాడిన 27 ఏండ్ల సుశీల.. ఆఖర్లో మిచేలా వైట్‌బోయ్ (దక్షిణాఫ్రికా) చేతిలో పరాజయం పాలై రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు కాంస్య పతక పోరులో విజయ్‌కుమార్ విజృంభించాడు. సుశీలకు కామన్వెల్త్లో ఇది రెండో రజతం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన సుశీల.. తాజా గేమ్స్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. మణిపూర్ పోలీస్ శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుశీల.. క్వార్టర్స్‌లో హారియట్పై, సెమీస్‌లో ప్రిసిల్లా మొరాండ్పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.
సెమీస్‌లో సౌరవ్
భారత స్టార్ స్కాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. జోష్న చినప్ప క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. సోమవారం పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ 11-5, 8-11, 11-7, 11-3తో పాల్ కోల్ (న్యూజిలాండ్)పై గెలిచి ముందడుగు వేయగా.. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో జోష్న 9-11, 5-11, 13-15తో హాగ్టన్ (కెనడా) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సునైన సనా కురువిల్లా ప్లేట్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఐదో స్థానంలో ప్రణతి
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్ ఈవెంట్లో సత్తాచాటి ఫైనల్‌కు చేరిన ప్రణతి.. తుదిపోరులో చక్కటి ప్రదర్శన కనబర్చినా.. పతకం కైవసం చేసుకోలేకపోయింది.
నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలు
కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారత లిఫ్టర్లు పతకాల పంట పండిస్తే.. ఇప్పుడిక మా వంతు అంటూ అథ్లెట్లు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. బర్మింగ్‌హామ్‌లో మంగళవారం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా పోటీల నుంచి తప్పుకోగా.. మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), అవినాశ్ సబ్లే (స్టీపుల్ చేజ్), సీమ పునియా (డిస్కస్‌త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో) పతకాలు కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్, అబ్దుల్లా, ఎల్డస్ పాల్ ఆశలు రేపుతుండగా.. 4×100 మీటర్ల మహిళల రేసులో ద్యుతీచంద్, హిమాదాస్ పోటీ పడుతున్నారు.
అచింత అదుర్స్
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లిఫ్టర్లు హవా కొనసాగిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఇప్పటికే మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా స్వర్ణాలు కైవసం చేసుకోగా.. ఇప్పుడా జాబితాలో అచింత షూలి చేరాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోటీల్లో.. 73 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అచింత రికార్డు స్థాయిలో 313 కేజీల బరువెత్తి పసిడి పతకం కొల్లగొట్టాడు. స్నాచ్‌లో కామన్వెల్త్ క్రీడల రికార్డు బద్దలు కొడుతూ 143 కేజీలు ఎత్తిన ఈ బెంగాల్ లిఫ్టర్.. క్లీన్ అండ్ జర్క్‌లో 170 కేజీలెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. మలేషియా లిఫ్టర్ హిదాయత్ 303 కేజీల (138+165)తో రజతం చేజిక్కించుకోగా.. కెనడా లిఫ్టర్ షాద్ డార్సినీ 298 కేజీల (135+163)తో కాంస్యం గెలుచుకున్నాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో.. అన్నీ తానై ప్రోత్సహించిన అన్నకు ఈ పతకం అంకితమని అచింత పేర్కొన్నాడు. ‘చాలా సంతోషంగా ఉంది. ఈ పతకం కోసం ఎంతో శ్రమించా. దీని కోసం మా కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా మా అన్నయ్య ఎన్నో త్యాగాలు చేశాడు. కోచ్, భారత ఆర్మీ సాయం కూడా మరువలేనిది. ఇక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోను. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తా’ అని అచింత అన్నాడు. మరోవైపు పురుషుల 81 కేజీల విభాగంలో పతకం ఆశలు రేపిన భారత లిఫ్టర్ అజయ్ సింగ్.. కేజీ తేడాతో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.