మెరిసిన ఉప్పల్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా 9వ విజయం. ఇంతకుముందు చెన్నై.. చెపాక్‌లో ఆర్సీబీపై 8 సార్లు గెలవడమే ఇప్పటిదాకా రికార్డు.
ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్లలో హైదరాబాద్.. పంజాబ్‌ను 10 సార్లు (11 మ్యాచ్‌ల్లో) ఓడించి రెండో స్థానంలోఉంది. ఫస్ట్ ప్లేస్ ముంబై (కోల్‌కతాపై 11 సార్లు)ది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మొదట బ్యాటర్ల మెరుపులు, తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. ఇటీవలే కోల్‌కతా చేతిలో ఓడినా మూడు రోజుల వ్యవధిలోనే బలంగా పుంజుకోవడమే గాక పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాని (14 పాయింట్లతో)కి ఎగబాకింది. బుధవారం ఇరుజట్ల మధ్య ఉప్పల్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సన్‌రైజర్స్.. ప్రత్యర్థిని 33 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
మొదట హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 55, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో కింగ్స్.. 20 ఓవర్లలో 202/7కే పరిమితమైంది. కూపర్ కనోలి (59 బంతుల్లో 107 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. కమిన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది ఏడో విజయం కాగా కింగ్స్‌కు హ్యాట్రిక్ పరాభవం.
23/3.. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 3.3 ఓవర్లకు పంజాబ్ స్కోరిది! ఛేదన తేలికేమీ కాదని తెలిసినా అయ్యర్ సేన ఏ దశలోనూ ఆ దిశగా సాగలేదు. ఈ సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థుల బౌలింగ్ లైనప్‌ను చీల్చి చెండాడుతున్న ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (3), ప్రియాన్ష్ (1) తేలిపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. కమిన్స్ తొలి ఓవర్లోనే ప్రియాన్ష్‌ను పెవిలియన్‌కు చేర్చగా రెండో ఓవర్లోనే బంతినందుకున్న నితీశ్.. ఫస్ట్ బాల్కే ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేసి పర్యాటక జట్టుకు మరో షాకిచ్చాడు.
నాలుగో స్థానంలో వచ్చిన సారథి శ్రేయాస్ (5) సైతం తక్కువ స్కోరుకే ఔటవడంతో ఆ జట్టు ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ క్రమంలో స్టోయినిస్ (28)తో జతకలిసిన కనోలి.. ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్టోయినిస్ దూకుడుగా ఆడేందుకు యత్నించినా శివాంగ్ అతడికి చెక్ పెట్టాడు. సుర్యాన్ష్ (25) కొద్దిసేపు మెరుపులు మెరిపించినా కమిన్స్ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. శశాంక్ (4) సైతం విఫలమవగా యాన్సెన్ (19) ధాటిగా ఆడలేకపోయాడు. కనోలి చివరిదాకా క్రీజులో నిలిచి 57 బంతుల్లో సెంచరీతో తన ఐపీఎల్ కెరీర్లో మొదటి శతకాన్ని సాధించినా అతడి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే!
టాస్ గెలిచి హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించిన శ్రేయాస్‌కు తానెంత తప్పు చేశాడో తెలియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. ‘ట్రావిషేక్’ జోడీతో పాటు టాపార్డర్ బ్యాటర్లు కింగ్స్ బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడటంతో రైజర్స్ ఈ సీజన్లో 8వసారి 200+ స్కోరును అవలీలగా అందుకుంది. ఓపెనింగ్ ద్వయం ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగి ఆడటంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ 79/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన అభిషేక్ (13 బంతుల్లో 35, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు).. యాన్సెన్ రెండో ఓవర్లో రెండేసి బౌండరీలు, సిక్స్‌లతో రెచ్చిపోయాడు. ఆ వెంటనే హెడ్ (19 బంతుల్లో 38, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు).. అర్ష్‌దీప్‌ను రెండు సిక్స్‌లు, ఫోర్‌తో శిక్షించాడు.
సిక్స్‌తోనే ఫెర్గూసన్‌కు స్వాగతం పలికిన అభిషేక్.. మూడో బంతికి షాట్ సరిగ్గా కనెక్ట్ కాక లాంగాఫ్‌లో శ్రేయాస్ చేతికి చిక్కాడు. పవర్ ప్లే ముగిశాక హెడ్‌ను చాహల్ ఔట్ చేశాడు. 7 ఓవర్లకు 86/2తో ఉన్న సన్‌రైజర్స్‌కు పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్చేయడం కలిసొచ్చింది. వ్యక్తిగత స్కోరు 9 రన్స్ వద్ద ఇషాన్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ స్కేర్ లెగ్‌లో కనోలి జారవిడువగా చాహల్ ఓవర్లో క్లాసెన్ కొట్టిన బంతి చేతుల్లో పడ్డా శశాంక్ మిస్ చేశాడు. చాహల్ ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయిన ఇషాన్‌ను స్టంపౌట్ చేయడంలో కీపర్ ప్రభ్‌సిమ్రన్ విఫలమయ్యాడు.
రెండుసార్లు లైఫ్ రావడంతో ఇషాన్ రెచ్చిపోయి ఆడాడు. వైశాక్ 14వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిన అతడు.. 28 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. కానీ ఫిఫ్టీ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో అర్ష్‌దీప్ అతడిని వెనక్కి పంపాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న క్లాసెన్.. దంచుడు బాధ్యతను నితీశ్‌కుమార్ (13 బంతుల్లో 29 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి పంచుకోవడంతో రైజర్స్ స్కోరుబోర్డు బ్రేకుల్లేని బండిలాగా దూసుకుపోయింది. యాన్సెన్ ఓవర్లో ఈ ద్వయం తలా ఓ సిక్స్ బాది స్కోరును 200 పరుగుల మార్కును దాటించారు. క్లాసెన్.. 32 బంతుల్లో మరో అర్ధ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వైశాక్ ఆఖరి ఓవర్లో 6, 4 దంచిన అతడు.. చివరి బంతికి నిష్క్రమించాడు.
మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ నిర్వహణలోపం మరోసారి బట్టబయలైంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆఖరి ఓవర్లో మైదానంలోని ఫ్లడ్లైట్స్ ఉన్నట్టుండి వెలగడం ఆగిపోయాయి. రెండునిమిషాల తర్వాత మళ్లీ ఆన్ అవడంతో ఆట సాగింది.
హైదరాబాద్: 20 ఓవర్లకు 235/4 (క్లాసెన్ 69, ఇషాన్ 55, చాహల్ 1/32, అర్ష్‌దీప్ 1/43);
పంజాబ్: 20 ఓవర్లకు 202/7 (కనోలి 107*, స్టోయినిస్ 28, కమిన్స్ 2/34, శివాంగ్ 2/45)