IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో బ్యాటర్లే కాదు బౌలర్ల ప్రదర్శనతోనూ విజయాలు సాధిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad స్క్వాడ్‌లోకి కొత్త పేసర్ వచ్చాడు. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee)ని సన్‌రైజర్స్ తీసుకుంది. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న ఈ సఫారీ పేసర్‌కు స్వాగతం పలుకుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది యాజమాన్యం. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ఆడిన కొయేట్జీ ఈసారి ఆరెంజ్ ఆర్మీ జెర్సీతో నిప్పులు చెరిగేందుకు సిద్ధమవుతున్నాడు.
ఐపీఎల్-19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కుర్ర బౌలర్లు దుమ్మురేపుతున్నారు. సీనియర్లు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్లు విఫలమవుతున్నా.. మేమున్నామంటూ రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ విజేతలుగా అవతరించారు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్. ఇప్పుడు వీరికి తోడుగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా చేయి వేయబోతున్నాడు. ఫిట్నెస్ సాధించిన ప్యాటీ సన్‌రైజర్స్ స్క్వాడ్‌లో చేరడం ఖాయమైన వేళ.. గాయపడిన పైన్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీతో ఒప్పందం చేసుకుంది ఫ్రాంజైజీ.
Gerald Coetzee joins our squad as David Payne’s replacement for the remainder of the season. pic.twitter.com/DQgVCLSp5F
— SunRisers Hyderabad (@SunRisers) April 18, 2026
ఇదివరకూ ముంబై, గుజరాత్ జట్లకు ఆడిన అనుభవమున్న కొయేట్జీ రాకతో హైదరాబాద్ పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. రాజస్థాన్‌పై అదిరే విజయంతో జోష్ మీదున్న ఇషాన్ కిషన్ బృందం శనివారం ఉప్పల్ మైదానంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే గుజరాత్ టైటాన్స్‌ను దాటేసే అవకాశముంది.