IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో ఆరెంజ్ క్యాప్ (Orange Cap) విజేత ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో శతకం చేజార్చుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) 776 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (Subhman Gill ), సాయి సుదర్శన్ (Sai Sudarshan) అతడికి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజస్థాన్‌పై సెంచరీతో గిల్ ఏడొందల క్లబ్లో చేరగా.. అర్ధ శతకంతో మెరిసిన సుదర్శన్ సైతం రేసులోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్ ఒకే సీజన్లో ముగ్గురు ఆటగాళ్లు 700లకు పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి.
ఐపీఎల్ ప్రతి సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందుండే విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ 19వ ఎడిషన్‌లో వెనకబడ్డారు. లీగ్‌లో ఎందరో స్టార్లున్నా.. తన విధ్వంసక ఆటతో వైభవ్ సూర్యవంశీ ఈసారి టాప్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులతో చరిత్ర సృష్టించిన ఈ కుర్రాడే అత్యధిక పరుగుల వీరుడు. తుఫాన్ ఇన్నింగ్స్‌లతో రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ తన్నుకుపోయేలా ఉన్నాడు.
IPL 2026 is the first ever season where three batters have gone past 700 runs 😮 pic.twitter.com/svvjkZtgVg
— ESPNcricinfo (@ESPNcricinfo) May 30, 2026
లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శతకం, ఎలిమినేటర్ సన్‌రైజర్స్‌పైనే 97, క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌పై 96 రన్స్ చేసిన వైభవ్.. టాప్‌లో కొనసాగుతున్నాడు. ప్రపంచస్థాయి బౌలర్లను భయపెడుతూ… ఈ సీజన్లో 776 కొట్టిన ఈ చిచ్చరపిడుగు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెన్ సాయి సుదర్శన్ కంటే ముందున్నాడు.
క్వాలిఫయర్ 2లో మెరుపు సెంచరీతో గిల్, అర్ధ శతకంతో సుదర్శన్‌లు ఆరెంజ్ క్యాప్ రేసులో వరసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 722, సుదర్శన్ ఖాతాలో 710 పరుగులున్నాయి. రాజస్థాన్ నిష్క్రమించడంతో ఆదివారం ఆర్సీబీతో ఫైనల్లో ఈ ఇద్దరిలో ఒకరు అర్ధ శతకంతో మెరిస్తే వైభవ్‌ను దాటేసే అవకాశముంది. ఇప్పటికే వీరు చెరొకసారి ఈ క్యాప్ అందుకున్నారు. 2023లో 890 రన్స్‌తో గిల్.. 2025లో 759 పరుగులతో సుదర్శన్‌లు విజేతలుగా నిలిచారు.

ఒకవేళ అహ్మదాబాద్ వేదికగా మే 31న జరుగనున్న ఫైనల్లో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ ధాటికి ఇద్దరూ త్వరగా ఔటైతే.. ఆరెంజ్ క్యాప్ వైభవ్‌నే వరించనుంది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్(624 పరుగులు) నాలుగో స్థానంలో, ఇషాన్ కిషన్(602 పరుగులు) ఐదులో కొనసాగుతున్నారు. కోహ్లీ 6000 పరుగులతో ఆరులో నిలిచాడు.