కొలంబో : వరుసగా రెండో టెస్టులోనూ విజయం ఖాయం.. 2-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ పక్కా.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడం ఇక లాంఛనమే అంటూ లెక్కలేసుకున్న భారత్‌కు షాక్. ఫాలోఆన్ భారాన్ని నెత్తిన మోస్తూ, ఓటమి అంచున నిలిచిన జట్టును కాపాడుకోవడానికి ఒక బ్యాటర్ ఏ స్థాయి పోరాటం చేయగలడో కొలంబో ఎస్ఎస్సీ మైదానంలో శ్రీలంక యువ ఆటగాడు సోనల్ దినుషా (264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 నాటౌట్) నిరూపించాడు. 16 పరుగుల ఆధిక్యం.. చేతిలో నాలుగు వికెట్లతో ఆఖరి రోజు మైదానంలోకి వచ్చిన ఆతిథ్య జట్టు.. ఐదు టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న దినుషా చేసిన అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో గట్టెక్కి డ్రా చేసుకుంది.
భారత బౌలర్ల దాడులను ఎదుర్కొంటూ 420 నిమిషాల పాటు సాగించిన సోనల్ అసమాన పోరాటం స్వదేశంలో శ్రీలంకుకు వైట్‌వాష్ తప్పించింది. ఓవర్‌నైట్ స్కోరు 229/6తో గురువారం ఆట కొనసాగించిన లంక మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌ను 429/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి 216 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డిక్లరేషన్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేయడంతో లాంఛనం పూర్తయింది. సోనల్ అండగా కేశర నువంతా (150 బంతుల్లో 46) కూడా రాణించాడు. రోజంతా బౌలింగ్ చేసినా లంక చివరి 4 వికెట్లను తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా 2-0తో నెగ్గాల్సిన సిరీస్‌ను గిల్ సేన 1-0తో ముగించింది. దినుషాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
ఈ సిరీస్‌లో ఆడిన ప్రతీ ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన 25 ఏండ్ల దినుషా.. లంక నయా హీరోగా, భారత్‌కు విలన్‌గా మారాడు. చివరి నాలుగు వికెట్లు పడగొట్టి.. వీలైనంత తొందరగా మ్యాచ్ ముగిద్దామని ఆశిస్తూ ఆఖరి రోజు బౌలింగ్‌కు దిగిన టీమిండియా ఆశలు ఆవిరి చేశాడు. టెయిలెండర్లతో కలిసి గంటల కొద్దీ క్రీజులో గోడ కట్టాడు. ఐదో రోజు ఆరంభం నుంచే దినుషా, నువంతా బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 246 బంతుల్లో 112 పరుగులు జోడించి తొలి సెషన్లో అజేయంగా నిలిచారు. ఉదయం వికెట్‌పై కొంత తేమ ఉన్నా.. సెషన్ మధ్యలో కొత్త బంతి లభించినా.. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ ఈ జోడీని విడదయలేకపోయారు. కానీ, లంచ్ విరామం తర్వాత నువంతా బ్యాట్ నుంచి ఎడ్జ్ రాబట్టిన సుతార్ టీమిండియాకు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఇక, 28 బంతులు ఎదుర్కొన్న ప్రభాత్ (2)ను జురెల్ క్యాచ్‌తోనే పెవిలియన్ చేర్చిన జడేజా భారత శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో తొందరపడి వికెట్ పారేసుకున్న లాహిరు కుమార (90 బంతుల్లో 12) ఈసారి రెండు గంటల పాటు క్రీజులో నిలిచాడు. దినుషాతో ఎనిమిదో వికెట్‌కు 170 బంతుల్లో 47 పరుగులు జోడించిన తర్వాత జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగినా.. అప్పటికే లంక సేఫ్ జోన్లోకి వెళ్లింది. టీ బ్రేక్ తర్వాత ఈ సిరీస్‌లో మూడో శతకం (196 బంతుల్లో) పూర్తి చేసుకున్న దినుషా.. అసిత ఫెర్నాండో (0 నాటౌట్)తో కలిసి చివరి 56 బంతులను కాచుకొని జట్టుకు ఓటమి తప్పించాడు.
టెస్టు క్రికెట్ అంటే చూడచక్కటి షాట్లు, భారీ శతకాలు మాత్రమే కాదు.. ప్రత్యర్థి బౌలర్ల నిప్పులు చెరిగే బంతులతో విసిరే సవాల్‌ను ఎదుర్కొంటూ.. శారీరక వేదనను భరిస్తూ జట్టుకు ఓటమి తప్పించే జిడ్డు బ్యాటింగ్ కూడా! కొలంబో వేదికగా శ్రీలంక యువ ఆటగాడు దినుషా ప్రదర్శించిన ఇన్నింగ్స్ దీనికి నిలువెత్తు నిదర్శనం. తన కెరీర్లో ఐదో టెస్టు మాత్రమే ఆడుతున్న ఈ పాతికేండ్ల కుర్రాడు ఓటమి వెంబడిస్తున్నా, కాళ్లలో తీవ్రమైన కండరాల నొప్పులు వేధిస్తున్నా, మ్యాచ్‌ను కాపాడుకోవాలనే ఒత్తిడి కొండంత ఉన్నా జంకలేదు. రోజంతా బ్యాటింగ్ చేసి లంకను ఓటమి నుంచి గట్టెక్కించాడు. సాధారణంగా డ్రైవ్‌లు, పుల్ షాట్లతో చూడముచ్చటగా ఆడే ఈ యువకుడు.. ఐదో రోజు పిచ్‌పై తన సహజ శైలిని పక్కనబెట్టాడు. జట్టుకు ఓటమి తప్పించేందుకు పూర్తిగా రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేశాడు. స్పిన్నర్ల టర్నింగ్‌ను బ్యాక్ ఫుట్‌పై సమర్థవంతంగా అడ్డుకుంటూ, పేసర్ల బంతులకు శరీరాన్ని అడ్డంగా పెట్టి మరీ డిఫెన్స్ గోడ కట్టాడు.

దినుషాను నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉంచి లోయర్ ఆర్డర్‌ను ఔట్ చేసేందుకు భారత్ షార్ట్ పిచ్ బంతులు, లెగ్ సైడ్ లైన్ వ్యూహాలను ప్రయోగించింది. కానీ, దినుషాకు తోడుగా లంక టెయిలెండర్లు నువంతా, కుమార చూపిన నిబ్బరం కూడా ప్రశంసనీయం. సాధారణంగా తీవ్ర ఒత్తిడిలో వికెట్ పారేసుకునే అలవాటున్న లంక ఆఖరి వరుస బ్యాటర్లు, ఈసారి తొందరపడి బాదుడుకు పోకుండా సోనాల్‌కు పూర్తి సహకారం అందిస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఫలితమే కొలంబోలో శ్రీలంకకు విజయానికి ఏమాత్రం తక్కువ కాని డ్రా లభించింది. ఈ సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌లు ఆడి మూడు సెంచరీలు, ఓ ఫిఫ్టీ కొట్టిన దినుషా 139 సగటుతో 419 పరుగులు రాబట్టాడు. సిరీస్ మొత్తంలో 722 బంతులు ఎదుర్కొని.. ఏకంగా 1139 నిమిషాలు క్రీజులో నిలిచి అందరి మనసులు గెలిచాడు. తనకు మంచి భవిష్యత్తు
1 ఉందనడంలో సందేహం లేదు. 2023 జూలై తర్వాత విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్టు సిరీస్ విజయం ఇది. విదేశాల్లో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కూడా ఇదే తొలి సిరీస్ విజయం
3 ఫాలోఆన్ ఆడుతూ ఒకే టెస్టులో రెండు సెంచరీలు మూడో బ్యాటర్‌గా దినుషా రికార్డు సృష్టించాడు. గతంలో విజయ్ హజారే, ఆండీ ఫ్లవర్ ఈ ఘనత
సాధించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) : 154 ఓవర్లలో 429/9 డిక్లేర్డ్ (దినుషా 133 నాటౌట్, పసిందు 92, జడేజా 3/94).