మంధాన శకంలో మొదటి అంకం
భారత మహిళా క్రికెట్లో నవ శకం ఆరంభం అవుతున్నది. కొత్త కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలో భారత జట్టు తొలి సవాల్‌కు సిద్ధమైంది.
- నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో లైవ్
రాయ్‌పూర్: భారత మహిళా క్రికెట్లో నవ శకం ఆరంభం అవుతున్నది. కొత్త కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలో భారత జట్టు తొలి సవాల్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి పోరులో మంధానసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం ఇదే తొలిసారి కాగా.. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం తొలిసారిగా విమెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటం మరో విశేషం.
ఆసియా కప్‌తో పాటు ఇటీవలే ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి ఉత్సాహంలో ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్లో భారత్ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించినా వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్స్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జట్టు బలహీనతలను బయటపెట్టింది. ఆస్ట్రేలియా వంటి జట్లకు నిలకడగా సవాలు విసరాలంటే భారత్ ఆటలోని అన్ని విభాగాలలోనూ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ బాధ్యత మంధాన భుజాలపై పడింది.
చాలా ఏండ్లుగా జట్టును నడిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో మంధాన పూర్తిస్థాయి కెప్టెన్ అవ్వడం ఇదే తొలిసారి అయినా.. నాయకత్వం తనకు కొత్తేం కాదు. దేశవాళీల్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్ అయిన ఆమె డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ అమ్మాయిల జట్టుకు రెండు టైటిల్స్ అందించింది.
భారత్ తరఫున హర్మన్ అందుబాటులో లేనప్పుడు 18 టీ20ల్లో కెప్టెన్‌గా పని చేసి 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు బ్యాటర్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఆమెకు నాయకురాలిగా ప్రమోషన్ లభించింది. గత మూడేండ్లలో టీ20ల్లో రెండు శతకాలు, 15 అర్ధశతకాలు కొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన ఈ ఏడాది కెరీర్ బెస్ట్ 148.25 స్ట్రయిక్ రేట్‌తో రాణిస్తోంది. 30 ఏండ్ల వయసులో 13 ఏండ్ల అంతర్జాతీయ అనుభవంతో భారత జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
మిడిలార్డర్ మెరుగయ్యేనా?
మంధానతో పాటు ఖతర్నాక్ ఫామ్‌లో ఉన్న షఫాలీ అందిస్తున్న మెరుపు ఆరంభాల తర్వాత మధ్య ఓవర్లలో ఆ ఊపును కొనసాగించడంలో భారత్ ఇబ్బంది పడుతోంది. గాయంతో జెమీమా జట్టుకు దూరం అవ్వడంతో మూడో స్థానం ఒక మ్యూజికల్ చైర్స్ ఆటలా మారింది. ఆసియా గేమ్స్‌లో ఈ స్థానంలో కమలిని ఆడినప్పటికీ.. ఇటీవల ఆస్ట్రేలియా-ఏ జట్టుపై సత్తా చాటిన అనుష్క శర్మ లేదా నిక్కీ ప్రసాద్‌కు చాన్స్ ఇవ్వొచ్చు.
మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడనున్న తనపైరాణించాల్సిన ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇక, లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్‌కు మద్దతుగా నిలిచేందుకు భారత్ మరి కొందరు పవర్ హిట్టర్లను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అమ్మాయిల ఫీల్డింగ్ కూడా చాలా మెరుగవ్వాలి. బౌలింగ్ విభాగానికి వస్తే ఈ మధ్య కాలంలో నందిని శర్మ ఎదుగుదల ఒక పెద్ద సానుకూలాంశం, కానీ పేస్ బౌలింగ్ దళం క్రమం తప్పకుండా వికెట్లు తీయడానికి మరింత పదునుగా మారాలి. స్పిన్‌లో భారత్‌కు తిరుగులేదు.
వెటరన్ స్పిన్నర్ దీప్తి శర్మ తోడుగా ఏపీ అమ్మాయి శ్రీ చరణి అద్భుతంగా రాణిస్తోంది. ఇక, జోసెఫిన్ నకోమో కెప్టెన్సీలోని జింబాబ్వే జట్టు గత నెలలో వెస్టిండీస్‌పై చరిత్రాత్మక వన్డే విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ జట్టు ఓపెనర్ కేలిస్ నదోవు గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తూ జింబాబ్వే బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

