SAvsAUS: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సపారీలు.. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో ఆదుకోవడంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. హెన్రిచ్ క్లాసెన్ (48 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆసీస్ పేస్ ధ్వయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్లు ఆరంభం నుంచే సఫారీల పతనాన్ని శాసించారు.
ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాకుల మీద షాకులు తాకాయి. ఈ టోర్నీలో అత్యంత పేలవమైన ఆటతీరుతో విసిగిస్తున్న కెప్టెన్ టెంబా బవుమా (3) తొలిఓవర్లోనే ఔట్ కాగా 14 బంతులాడి మూడు పరుగులే చేసిన క్వింటన్ డికాక్ హెజిల్వుడ్ వేసిన ఆరో ఓవర్లో కమిన్స్ చేతికి చిక్కాడు. 31 బాల్స్ ఆడి ఆరు పరుగులే చేసిన డసెన్నూ హెజిల్వుడ్ ఔట్ చేయగా మార్క్రమ్ (10)ను స్టార్క్ పెవిలియన్ చేర్చాడు.
ఆదుకున్న క్లాసెన్ –మిల్లర్
24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్‌ను క్లాసెన్-మిల్లర్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. 19 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని ఆపిన ఈ జోడీ కుదురుకుంటున్న క్రమంలో ఆసీస్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్.. దక్షిణాఫ్రికాను మరోఉసారి దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో క్లాసెన్‌తో పాటు మార్కో జాన్సెన్ ను ఔట్ చేశాడు.
మిల్లర్ సెంచరీ..
క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా మిల్లర్ పట్టుదలగా ఆడాడు. క్లాసెన్, జాన్సెన్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన గెరాల్డ్ కొయెట్జ్ (39 బంతుల్లో 19, 2 ఫోర్లు) తో కలిసి ఏడో వికెట్‌కు 76 బంతుల్లో 53 పరుగులు జోడించాడు. కొయెట్జ్తో వికెట్ల మధ్య పరిగెత్తుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. 115 బంతుల్లో మిల్లర్ సెంచరీ పూర్తయింది. కానీ సెంచరీ తర్వాత మరుసటి బంతికే కమిన్స్ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కగా హెజిల్వుడ్, కమిన్స్, హెడ్లు తలా రెండు వికెట్లు తీశారు. హెజిల్వుడ్.. 8 ఓవర్లు వేసి ఏకంగా మూడు మెయిడిన్లు చేయడమే గాక 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం గమనార్హం.