IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ భారీ స్కోర్లు, ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తోంది. దుమ్మురేపుతున్న కొందరు ఆరెంజ్ క్యాప్(Orange Cap) కోసం పోటీపడుతున్నారు. ప్రతిసారి రేసులో ఉండే విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ వంటి స్టార్లు వెనకబడగా.. యువకెరటం సమీర్ రిజ్వీ (Sameer Rizvi) శరవేగంగా దూసుకెళ్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్(సన్‌రైజర్స్ హైదరాబాద్) రెండో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), దేవ్‌దత్ పడిక్కల్ (ఆర్సీబీ), కూపర్ కొన్నొల్లీ(పంజాబ్ కింగ్స్)లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. రవి బిష్ణోయ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్లో దంచికొట్టినొళ్లదే ఆరెంజ్ క్యాప్. అత్యధిక పరుగులతో ఈ క్యాప్‌ను దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో ఈసారి సమీర్ రిజ్వీ పేరు చేరేలా ఉంది. మీరుట్‌కు చెందిన ఈ కుర్రాడు పంతొమ్మిదో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్‌గా చెలరేగిపోతున్నాడు. నిరుడు చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున పెద్దగా రాణించిన ఈ చిచ్చరపిడుగు.. ఈ దఫా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ట్రంప్ కార్డ్‌గా అవతరించాడు. తొలి పోరులో అర్ధ శతకం.. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 97 రన్స్ కొట్టి ఢిల్లీని గెలిపించిన సమీర్ 160 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
Presenting the 🔝5️⃣ run scorers after an exhilarating opening week 🙌
The impressive Sameer Rizvi leads the race 👏#TATAIPL | #KhelBindaas pic.twitter.com/iXLMjA3kiV
— IndianPremierLeague (@IPL) April 5, 2026
ఈ సీజన్ టాప్ స్కోరర్ల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) రెండో స్థానంలో ఉన్నాడు. 147.96 స్ర్టయిక్ రేటు, రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 145 పరుగులు సాధించాడీ హిట్టర్. ముంబై మాజీ సారథి రోహిత్ శర్మ 113 పరుగులతో మూడో ప్లేస్‌లో నిలవగా.. ఆర్సీబీ సంచలనం దేవ్‌దత్ పడిక్కల్ (111 పరుగులు) నాలుగు, పంజాబ్ కింగ్స్ విదేశీ స్టార్ కూపర్ కొన్నొల్లీ(108 పరుగులు) ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రతి సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండే విరాట్ కోహ్లీ 97 పరుగులతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆశ్చర్యంగా.. 202.04 స్ట్రయిక్ రేటుతో 99 పరుగులు చేసిన టెస్టు స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక వికెట్ల వీరులు అందుకునే పర్పుల్ క్యాప్ రేసులో భారత కుర్రాడు రవి బిష్ణోయ్ ముందంజలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలకం అవుతున్న ఈ లెగ్ స్పిన్నర్ రెండు మ్యాచుల్లో 11.40 సగటుతో 5 వికెట్లు పడగొట్టాడు.
Ravi Bishnoi has registered his best IPL figures today. And he still has an over left 😮pic.twitter.com/S7tAXPH1n3
— Cricbuzz (@cricbuzz) April 4, 2026
పంజాబ్ కింగ్స్ పేస్ అస్త్రం విజయ్‌కుమార్ వైశాక్, పవర్ ప్లేలో వికెట్ల వేటతో ఆర్సీబీ తురుపుముక్కగా మారిన జాకబ్ డఫ్ఫీలు సైతం ఐదేసి వికెట్లు తీశారు. కానీ, వీరి సగటు 14కు పైనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ అన్షుల్ కంబోజ్(5 వికెట్లు) టి.నటరాజన్(4 వికెట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.