లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లే.. ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. తొలి క్వాలిఫయర్‌లో సునాయస విజయంతో గుజరాత్ తుదిపోరుకు చేరగా.. అందులో ఓటమి పాలైన రాజస్థాన్ క్వాలిఫయర్-2లో విజృంభించింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టడి చేసిన రాజస్థాన్.. ఆనక జోస్ బట్లర్ మెరుపు సెంచరీతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్నిఛేదించింది. ఈసారైనా కప్పు కొడతారనుకున్న బెంగళూరు అభిమానులకు నిరాశ తప్పకపోగా.. ఆదివారం జరుగనున్న ఫైనల్ ఫైట్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది!
అహ్మదాబాద్: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఎప్పట్లాగే ‘ఈ సాల కప్ నమదే’అంటూ సీజన్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్ చేరకుండానే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న బెంగళూరు.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఓపెనింగ్ బ్యాటర్ బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తాజా సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రెండో సారి ఫైనల్‌కు చేరింది.
ఐపీఎల్ తొలి సీజన్ (2008) తర్వాత రాజస్థాన్ తుది పోరుకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) మరోసారి నిరాశ పరచగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో రజత్ పాటీదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ (25), మ్యాక్స్‌వెల్ (24) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలోమెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై రాజస్థాన్ బౌలర్లు బుల్లెట్ బంతులతో ఆకట్టుకుంటే.. బెంగళూరు ఆటగాళ్లు కనీస ప్రతిఘటన చూపకుండానే పెవిలియన్‌కు వరుసకట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న జోస్ బట్లర్ అజేయ శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్ (21; ఒక ఫోర్, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ (23; ఒక ఫోర్, 2 సిక్సర్లు) అతడికి సహకరించారు. బెంగళూరు బౌలర్లలో హజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
10పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా పదోసారి. 2012 ఐపీఎల్ నుంచి ఈ పరంపర కొనసాగుతున్నది.
బెంగళూరు: 20 ఓవర్లలో 157/8 (రజత్ పాటీదార్ 58; ప్రసిద్ధ్ 3/22, మెక్కాయ్ 3/23),
రాజస్థాన్: 18.1 ఓవర్లలో 161/3 (బట్లర్ 106 నాటౌట్; హజిల్‌వుడ్ 2/23).