Ravi Bishnoi | టీమ్ఇండియా భవిష్యత్ ఆశాకిరణం రవి బిష్ణోయ్.. టీ20ల్లో టాప్ ర్యాంక్
రవి బిష్ణోయ్..భారత క్రికెట్ తురుపుముక్క! తన లెగ్‌స్పిన్ నైపుణ్యంతో వికెట్ల వేట కొనసాగిస్తున్న క్రికెటర్. అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినఈ రాజస్థాన్ చిన్నోడు ఇప్పుడు సఫారీ పర్యటనకు సై అంటున్నాడు.
రవి బిష్ణోయ్..భారత క్రికెట్ తురుపుముక్క! తన లెగ్‌స్పిన్ నైపుణ్యంతో వికెట్ల వేట కొనసాగిస్తున్న క్రికెటర్. అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినఈ రాజస్థాన్ చిన్నోడు ఇప్పుడు సఫారీ పర్యటనకు సై అంటున్నాడు.అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుతూ భారత భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో జాతీయజట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బిష్ణోయ్‌పై ప్రత్యేక కథనం.
Ravi Bishnoi | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : రవి బిష్ణోయ్ వికెట్ల వేట దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. టీ20 ఫార్మాట్ నుంచి సీనియర్ బౌలర్ యజువేంద్ర చాహల్‌ను తప్పిస్తూ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రవి బిష్ణోయ్‌కు అవకాశమిచ్చారు. ఇదే అదనుగా చెలరేగిన బిష్ణోయ్.. ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించాడు. సొంతగడ్డపై పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొమ్మిది వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
ఓవైపు లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే మరో ఎండ్‌లో తన వైవిధ్యమైన స్పిన్‌తో బిష్ణోయ్ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. 7.14 ఎకానమీ కొనసాగిస్తూ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ 23 ఏండ్ల యువ స్పిన్నర్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 17.38 సగటుతో అత్యుత్తమ ప్రదర్శన(4/16) కనబరిచాడు. చురుకైన వేగానికి వైవిధ్యాన్ని జోడిస్తూ బిష్ణోయ్ సంధించే బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల నుంచి సమాధానం కరువవుతున్నది.
వైవిధ్యాన్ని కొనసాగిస్తూ
తీవ్ర పోటీ ఉండే టీమ్ఇండియాలో చోటు నిలుపుకోవడం ఎవరికైనా కత్తిమీదసామే. అలాంటిది వచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవడం కూడా నేర్పుతో అలవర్చుకోవాలి. అది రవి బిష్ణోయ్ తొందరగానే అలవాటు చేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన ఏడాది లోపే కీలక బౌలర్‌గా ఎదిగాడు. అవకాశాలు లేనప్పుడు కుంగిపోవడం, వచ్చినప్పుడు వృథా చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం బిష్ణోయ్‌కి కలిసి వచ్చిందని చెప్పాలి. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ బౌలింగ్ శైలిని ఒకింత పోలి ఉండే బిష్ణోయ్ ఓవర్లో ప్రతీ బంతిని ఒక్కో రకంగా వేయడంలో దిట్ట. బంతిని వేగంగా స్పిన్ చేయడంలోనే కాదు గూగ్లీ, ఫ్లిప్పర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలోనూ ఆరితేరాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3/32, 2/32, 2/29, 1/17, 1/54 ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు.
టీ20ల్లో నంబర్‌వన్
ఆసీస్‌పై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బిష్ణోయ్..తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. 699 పాయింట్లతో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను రెండో ర్యాంక్‌కు నెడుతూ అగ్రస్థానాన్ని అధిష్టించాడు. పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంక్‌కు చేరుకోవడానికి రవి తీవ్రంగా చెమటోడ్చాడు. ఈ క్రమంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ చేత శభాష్ అనిపించుకున్నాడు. ‘భారత్ ప్రతీసారి దిగ్గజ స్పిన్నర్లను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేసింది. అనిల్‌కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్పిన్నర్లు క్రికెట్‌ను శాసించారు. లెగ్ స్పిన్నర్లలో బిష్ణోయ్ చాలా వైవిధ్యంతో ఉన్నాడు. బంతిని వేగంగా వేయడానికి తోడు ఊరించే విధంగా సంధిస్తాడు’ అని అన్నాడు.
2019 అండర్-19 ప్రపంచకప్‌తో
సరిగ్గా మూడేండ్ల క్రితం జరిగిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా బిష్ణోయ్ వెలుగులోకి వచ్చాడు. భారత్ రన్నరప్‌గా నిలిచిన మెగాటోర్నీలో బిష్ణోయ్ 17 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పియూశ్ చావ్లా(2006), సందీప్‌శర్మ(2012) సరసన నిలిచాడు.
మెగాటోర్నీ లక్ష్యంగా
వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా బిష్ణోయ్ ముందుకు సాగుతున్నాడు. ఈ నెల 9నుంచి దక్షిణాఫ్రికాతో మొదలుకానున్న టీ20 సిరీస్‌లో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత జనవరిలో అఫ్గానిస్థాన్‌తో సిరీస్, ఐపీఎల్ తర్వాత మెగాటోర్నీ నాటికి భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనతో బెర్తు దక్కించుకునేందుకు బిష్ణోయ్ పట్టుదలతో ఉన్నాడు. ఈ రాజస్థాన్ చిన్నోడు..మెగాటోర్నీ టిక్కెట్ దక్కించుకోవాలని అభిమానులందరం ఆశిద్దాం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

