ఆసియాకప్‌లో పాకిస్థాన్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్లు ఎదురైన ప్రత్యర్థినల్లా పాక్ చిత్తుచేస్తున్నది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌ఫోర్ పోరులో పాక్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. రవూఫ్, నసీమ్షా విజృంభణతో బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ముష్ఫికర్, షకీబల్ అర్ధసెంచరీలతో మెరిశారు. స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లా బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా..ఇమాముల్ హక్, రిజ్వాన్ బ్యాటింగ్‌తో పాక్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
లాహోర్: ఆసియాకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ప్రతీ పోరు కీలకమైన నేపథ్యంలో పాక్ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హరిస్ రవూఫ్(4/19), నసీమ్ షా(3/34) ధాటికి బంగ్లా బ్యాటర్లు కుదేలయ్యారు. వీరి పదునైన స్వింగ్‌తో చెలరేగడంతో బంగ్లా 47 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ షకీబుల్ హక్(53), ముష్ఫికర్ రహీమ్(64) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు పాక్ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. తమ అనుభవాన్ని జోడిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. అయితే సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను షకీబల్‌ను ఔట్ చేయడం ద్వారా పాక్ మరోమారు దెబ్బతీసింది. దీంతో ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పాక్ పేస్ దళం నిప్పులు చెరగడంతో బంగ్లా 47 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. మెహదీహసన్ మిరాజ్(0), లిటన్‌దాస్(16), తౌహిత్ హృదయ్ (2), షమీమ్ హుస్సేన్ (16) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
ఇమాముల్, రిజ్వాన్ విజృంభణ:
బంగ్లా నిర్దేశిత లక్ష్యఛేదనలో పాక్‌కు చెప్పుకోదగ్గ శుభారంభం దక్కలేదు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓపెనర్ ఫకర్ జమాన్(20) మరోమారు నిరాశపర్చగా, ఇమాముల్ హక్(78), మహమ్మద్ రిజ్వాన్(63 నాటౌట్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ బాబర్ ఆజమ్(17) నిరాశపర్చగా, ఇమాముల్ హక్ జట్టును ముందుండి నడిపాడు. బంగ్లా బౌలింగ్‌ను కాచుకుంటూ ఇమాముల్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో విజృంభించాడు. సెంచరీ వైపు సాఫీగా సాగుతున్న క్రమంలో ఇమాముల్ ఔటైనా..రిజ్వాన్ మిగతా పనిని పూర్తి చేశాడు. తస్కిన్, షరిఫుల్, మిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. సూపర్‌ఫోర్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో పాకిస్థాన్ తలపడుతుంది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 38.4 ఓవర్లలో 193 ఆలౌట్(ముష్ఫికర్ 64, షకీబల్ 53, రవూఫ్ 4/19, నసీమ్ షా 3/34), పాకిస్థాన్: 39.3 ఓవర్లలో 194/3(ఇమూముల్ 78, రిజ్వాన్ 63 నాటౌట్, తస్కిన్ 1/32, షరిఫుల్ 1/24)