బెల్ఫాస్ట్: ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో న్యూజిలాండ్ పట్టు సాధిస్తున్నది. యువ పేసర్ నాథన్ స్మిత్(6-40) ధాటికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు కుప్పకూలింది. పిచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ స్మిత్ విజృంభించడంతో ఐర్లాండ్ వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
అండీ మెక్‌బ్రైన్(73 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లోటుతో ఫాలోఆన్‌కు దిగిన ఐర్లాండ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఐర్లాండ్ ఇంకా 261 పరుగుల వెనుకంజలో ఉన్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 361-5తో గురువారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్..490-8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ టామ్ బ్లండెల్(292 బంతుల్లో 186, 22ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. అంతగా అనుభవం లేని ఐర్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(129 బంతుల్లో 98, 6ఫోర్లు, సిక్స్)తో కలిసి జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్క్ అదిర్(3-66) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.