వాషింగ్టన్: మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) టోర్నీలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇంటర్ మయామి స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడు. ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు క్వయిన్ సులివాన్ మెడపై కొట్టినందుకుగాను మెస్సీపై ఎంఎల్ఎస్ క్రమశిక్షణా కమిటీ జరిమానా విధించింది. అయితే జరిమానా మొత్తాన్ని లీగ్ వెల్లడించలేదు. ఇరు జట్ల మధ్య 2-2తో డ్రా అయిన ఈ మ్యాచ్ ఇంజూరీ టైమ్ ఆఖరి నిమిషాల్లో చెలరేగిన వివాదంలో మెస్సీ, క్వయిన్ గొడవ పడ్డారు. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన మెస్సీ.. క్వయిన్ మెడ వెనుక భాగంలో కొట్టాడు. ఈ ఘటనపై వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన ఎంఎల్ఎస్ క్రమశిక్షణా కమిటీ మెస్సీపై జరిమానా విధించినట్టు తెలిపింది.