మిగతా జట్లన్నీ ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం సీజన్లో బోణీ కొట్టేందుకు తండ్లాడుతున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో బోల్తాపడ్డ డేవిడ్ భాయ్ గ్యాంగ్.. మూడో మ్యాచ్‌లోనూ ఛేజింగ్‌లో చేతులెత్తేసింది. స్లో పిచ్‌పై సమిష్టి కృషితో మంచి స్కోరు చేసిన ముంబై.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అదుర్స్ అనిపిస్తే.. మెరుగైన ఆరంభం లభించిన తర్వాత కూడా మిడిలార్డర్లో నమ్మకమైన ఆటగాడు లేక హైదరాబాద్ ఓటమి వైపు నిలిచింది.
చెన్నై: మిడిలార్డర్ వైఫల్యంతో సన్‌రైజర్స్ వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో మెరుపు ఆరంభం లభించినా.. ఫినిషింగ్ లోపంతో ఐపీఎల్ 14వ సీజన్లో వార్నర్ సేన పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. శనివారం ముంబైతో జరిగిన పోరులో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఓడింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 150/5 స్కోరు చేసింది. డికాక్ (40), పొలార్డ్ (22 బంతుల్లో 35), రోహిత్ శర్మ (32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో విజయ్ శంకర్, రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్‌స్టో (43), వార్నర్ (36) తప్ప మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో చాహర్, బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. పొలార్డ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆరంభంలో రోహిత్.. ఆఖర్లో పొలార్డ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం దక్కింది. ముజీబ్ ఓవర్లో 4,6 కొట్టిన రోహిత్.. భువనేశ్వర్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ అరుసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రోహిత్‌సేన వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఈ దశలో శంకర్‌కు బంతినివ్వడం ఫలితాన్నిచ్చింది. భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ క్యాచ్ ఔట్ కాగా.. తదుపరి ఓవర్లో సూర్యకుమార్ (10)ను కూడా శంకర్ డగౌట్ బాట పట్టించాడు. ఈ దశలో మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో ముంబై రన్‌రేట్ మందగించింది. హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన ముజీబ్.. డికాక్‌తో పాటు ఇషాన్ కిషన్ (12)ను పెవిలియన్ పంపాడు. ఆఖర్లో పొలార్డ్ ధాటిగా ఆడటంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది.
బెయిర్‌స్టో బాదినా..
చెపాక్ పిచ్‌పై కఠినమైన లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభం లభించింది. బెయిర్‌స్టోతో పాటు వార్నర్ పవర్‌ప్లేలో దంచికొట్టారు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో 4,4,6,4 కొట్టిన బెయిర్‌స్టో.. మిల్నే ఓవర్లో రెండు భారీ సిక్సర్లు అరుసుకున్నాడు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్యా.. బెయిర్ స్టోను ఔట్ చేసి ముంబైకి బ్రేక్‌త్రూ ఇప్పించాడు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ బ్యాటింగ్ తడబడింది. మనీశ్ పాండే (2) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. వార్నర్ రనౌటయ్యాడు. కాసేపటికి చాహర్ ఒకే ఓవర్లో విరాట్ సింగ్ (11), అభిషేక్ శర్మ (2)ను ఔట్ చేశాడు. విజయానికి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమైన దశలో విజయ్ శంకర్ (28) రెండు చక్కటి సిక్సర్లు బాదాడు. బౌల్ట్.. రషీద్ ఖాన్ (0)ను ఎల్బీడబ్ల్యూ చేయగా.. హార్దిక్ బుల్లెట్ త్రోకు సమద్ (7) రనౌటయ్యాడు. రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశలో శంకర్ కూడా ఔటవడంతో రైజర్స్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు.
1 ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు (217) కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా ముంబై కెప్టెన్ రోహిత్‌శర్మ నిలిచాడు. రైజర్స్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ అందుకున్నాడు.
ముంబై: డికాక్ (సి) (సబ్) ముజీబ్ 40, రోహిత్ (సి) విరాట్ సింగ్ (బి) శంకర్ 32, సూర్యకుమార్ (సి అండ్ బి) శంకర్ 10, కిషన్ (సి) బెయిర్‌స్టో (బి) ముజీబ్ 12, పొలార్డ్ (నాటౌట్) 35, హార్దిక్ (సి) విరాట్ సింగ్ (బి) ఖలీల్ 7, కృనాల్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 150/5. వికెట్ల పతనం: 1-55, 2-71, 3-98, 4-114, 5-131, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-45-0, ఖలీల్ 4-0-24-1, ముజీబ్ 4-0-29-2, అభిషేక్ 1-0-5-0, శంకర్ 3-0-19-2, రషీద్ ఖాన్ 4-0-22-0.
హైదరాబాద్: వార్నర్ (రనౌట్/హార్దిక్) 36, బెయిర్‌స్టో (హిట్‌వికెట్) కృనాల్ 43, పాండే (సి) పొలార్డ్ (బి) చాహర్ 2, విరాట్ సింగ్ (సి) సూర్యకుమార్ (బి) చాహర్ 11, శంకర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 28, అభిషేక్ (సి) మిల్నే (బి) చాహర్ 2, సమద్ (రనౌట్/హార్దిక్) 7, రషీద్ (ఎల్బీ) బౌల్ట్ 0, భువనేశ్వర్ (బి) బౌల్ట్ 1, ముజీబ్ (నాటౌట్) 1, ఖలీల్ (బి) బౌల్ట్ 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 19.4 ఓవర్లలో 137 ఆలౌట్. వికెట్ల పతనం: 1-67, 2-71, 3-90, 4-102, 5-104, 6-129, 7-130, 8-134, 9-135, 10-137, బౌలింగ్: బౌల్ట్ 3.4-0-28-3, బుమ్రా 4-0-14-1, మిల్నే 3-0-33-0, కృనాల్ 3-0-30-1, రాహుల్ చాహర్ 4-0-19-3, పొలార్డ్ 2-0-10-0.