సాకర్ ప్రపంచకప్‌లో హోరాహోరీ పోరాటాలు అభిమానులను కనువిందు చేస్తున్నాయి. అనూహ్య ఫలితాలు.. ఆసక్తికర పరిణామాలు కట్టిపడేస్తున్నాయి. మెగా టోర్నీలో నాకౌట్ రౌండ్ చేరేందుకు ఆయా దేశాలు పోటీపడుతుంటే అందరి దృష్టి మాత్రం ఇద్దరు ఆటగాళ్లపైనే ఉంది. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్ యువ సంచలనం కిలియన్ ఎంబాపె తమ ఆటతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూనే ఓ రికార్డును వెంబడిస్తున్నారు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మెస్సీ అగ్రస్థానంలో నిలిచినా, ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఎంబాపె వేగంగా దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం 38 ఏండ్ల మెస్సీ ప్రపంచకప్‌లో 18 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు 27 ఏండ్ల వయసులోనే ఫ్రాన్స్ స్టార్ 16 గోల్స్ సాధించి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈసారి కప్ ఎవరిది అనే చర్చకంటే వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ రికార్డు ఎవరిది? అనే ప్రశ్న మరింత ఆసక్తి కలిగిస్తోంది.
ఆధునిక సాకర్‌లో అత్యుత్తమ ఆటగాడిగా మన్ననలు అందుకుంటున్న మెస్సీ, నయా సంచలనం ఎంబాపె గత ఖతార్ ప్రపంచకప్‌నూ తమ ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. నాడు మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఆ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు కీలక అసిస్టులతో జట్టును ముందుండి నడిపించాడు. ఫైనల్లో రెండు గోల్స్ చేసి తన కెరీర్‌లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. అదే టోర్నీలో ఎంబాపె అసాధారణ ప్రదర్శనతో ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఫైనల్లో హ్యాట్రిక్ సాధించి వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫ్రాన్స్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయినా, ఎంబాపె ఆట ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
నాలుగేండ్ల తర్వాత ఫిఫా మహాసంగ్రమం మళ్లీ మొదలవగా.. ఈసారి కూడా ఈ ఇద్దరి హవానే నడుస్తోంది. తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్, మలిపోరులో డబుల్ గోల్స్ కొట్టిన మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో అర్జెంటీనా చేసిన ఐదు గోల్స్ మెస్సీ నుంచే రావడం విశేషం. మరోవైపు ఎంబాపె కూడా అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. గ్రౌండ్లో బుల్లెట్లా దూసుకెళ్తున్న అతను సెనెగల్, ఇరాక్‌పై డబుల్ గోల్స్‌తో మెస్సీ రికార్డుకు చేరువయ్యాడు. అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ జాబితాలో యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఇద్దరికీ సమీపంలో ఎవ్వరూ లేరు. పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో 10, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, బ్రెజిల్ స్టార్ నెయ్మార్, తలో 8 గోల్స్‌తో నిలిచారు. దాందో వరల్డ్‌కప్ ‘రికారు’్డ పోరాటం మెస్సీ, ఎంబాపె మధ్యనే నడుస్తోంది.
మెస్సీ ఆటలో ప్రధాన బలం సృజనాత్మకత. బంతిని తన కంట్రోల్లోకి తీసుకొని సహచరులకు అవకాశాలు కల్పించడం, సరైన సమయంలో గోల్ చేయడం అతని ప్రత్యేకత. మరోవైపు ఎంబాపె వేగానికి ప్రతీక. ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చుకుంటూ మెరుపు దాడులతో గోల్స్ సాధించడం అతని ప్రత్యేక నైపుణ్యం. అందుకే అతడిని ఆధునిక ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రమాదకర స్ట్రయికర్‌గా భావిస్తారు. మెస్సీ సాధించిన రికార్డు అనుభవం, నిలకడకు నిదర్శనం. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతూ దాదాపు రెండు దశాబ్దాల పాటు అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాడు. ఎంబాపె మాత్రం తక్కువ కాలంలోనే ఆ రికార్డుకు చేరువ కావడం విశేషం. ఆరో ప్రపంచకప్ బరిలో ఉన్న మెస్సీ 24 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధిస్తే.. కిలియన్ తన మూడో ప్రపంచకప్‌లో.. 16 మ్యాచ్‌ల్లోనే రెండోస్థానానికి చేరుకున్నాడు. తను కనీసం రెండు మెగా టోర్నీలు ఆడే అవకాశం ఉండటంతో మెస్సీ రికార్డు ఎక్కువకాలం నిలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గోల్స్ పట్టికలో మెస్సీ అగ్రస్థానంలో ఉన్నా, భవిష్యత్తు మాత్రం ఎంబాపె వైపే చూస్తోంది. ఏదేమైనా ప్రపంచకప్ గోల్స్ సింహాసనం కోసం ఈ ఇద్దరి మధ్య సాగుతున్న ఈ పోరు అభిమానులకు అద్భుత అనుభూతిని అందిస్తోంది.

కొలంబియా x కాంగో ఉ. 7.30 నుంచి
స్విట్జర్లాండ్ x కెనడా రా. 12.30 నుంచి
బోస్నియా x ఖతార్ రా. 12.30 నుంచి