ఫిలడెల్ఫియా : తన కెరీర్లో వందో అంతర్జాతీయ మ్యాచ్‌ను ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. అంచనాలను అందుకుంటూ ఎంబాపె డబుల్ గోల్స్‌తో దుమ్మురేపడంతో ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండో విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఆ జట్టు 3-0తో ఇరాక్‌ను చిత్తుగా ఓడించింది.
ఎంబాపె14, 54వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. బాలన్ డి ఓర్ విజేత ఉస్మానే డెంబెలే 66వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. తన వందో మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన ఎంబాపె ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీకి చెందిన మిరాస్లొవ్ క్లోస్ (16 గోల్స్) రికార్డును సమం చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో (15 గోల్స్)ను అధిగమించాడు. ఈ విజయంతో నాకౌట్ బెర్తు సొంతం చేసుకున్న ఫ్రాన్స్ రౌండ్-32 పోరులో జూలై 4న జర్మనీతో తలపడే అవకాశం ఉంది.
సాంటా క్లారా (యూఎస్ఏ): ఎర్లింగ్ హాలాండ్ డబుల్ గోల్స్ ధమాకాతో నార్వే జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో తదుపరి దశకు ముందంజ వేసింది. హోరాహోరీగా సాగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో నార్వే.. 3-2తో సెనెగల్‌ను ఓడించింది. ఎర్లింగ్ 48, 58వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా మార్కస్ పెడర్సన్ (43వ ని.) ఒక గోల్ కొట్టాడు. గ్రూప్-జేలో అల్జీరియా 2-1తో జోర్డాన్‌ను ఓడించి 2014 తర్వాత ఈ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదుచేసింది. అల్జీరియా తరఫున నాధిర్ బెన్బొలి (69), అమిన్ గుయిరి (82) చెరో గోల్ చేసి తమ జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు.