సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో మరుపురాని సన్నివేశం. ఇప్పటి వరకు ఎన్నో చిరస్మరణీయ సందర్భాలు మన కండ్ల ముందు కదలాడాయి. కానీ ఇలాంటి పోరాటం ఎప్పుడు చూసి ఉండం. వాంఖడే స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్ మ్యాక్స్‌వెల్ అసమాన పోరాటం అభిమానులను కట్టిపడేసింది. పోరాడితే పోయేదేమి లేదు అన్నట్లు గెలుపుపై ఆశలు అడుగంటిన వేళ మ్యాక్స్‌వెల్ కసిగా పోరాడిన తీరు క్రికెట్ ప్రపంచం కలకాలం గుర్తుంచుకుంటుంది. ఓవైపు గాయం శరీరాన్ని కుంగదీస్తున్నా.. నొప్పిని భరిస్తూ సరిహద్దుల్లో సైనికుడిలా కాబూలీలకు ఎదురొడ్డి పోరాడిన మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ పోరాటం నభూతో నభవిష్యత్. సహచరులు ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తున్నా.. వెన్నుచూపని ధీరత్వంతో తన దేశానికి చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. అప్పటి వరకు గెలుపు ఆశలు పెట్టుకున్న అఫ్గానిస్థాన్‌ను మ్యాక్స్‌వెల్ కండ్లు చెదిరే బౌండరీలతో సునామీలా ముంచెత్తాడు.
ముంబై: ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ పోరును అసలు ఏమని వర్ణించగలం. ఆఖరి వరకు విజయం కోసం మ్యాక్స్‌వెల్ సాగించిన దండయాత్ర మెగాటోర్నీకే హైలెట్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది. తద్వారా భారత్, దక్షిణాఫ్రికా తర్వాత ఆసీస్ సెమీఫైనల్ బెర్తు దక్కించుకుంది. అఫ్గాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్(128 బంతుల్లో 201 నాటౌట్, 21ఫోర్లు, 10 సిక్స్‌లు) ఒకే ఒక్కడిలా ఒంటరి పోరాటంతో మ్యాచ్‌ను గెలిపించాడు.
ఓ వైపు అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును మ్యాక్స్‌వెల్ గెలుపు ఒడ్డుకు చేర్చాడు. నవీన్‌వుల్, అజ్మతుల్లా, రషీద్‌ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 291/5 స్కోరు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(143 బంతుల్లో 129 నాటౌట్, 8ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా, ఆఖర్లో రషీద్‌ఖాన్(18 బంతుల్లో 35 నాటౌట్, 2ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అజేయ డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్..ఈ నెల 11న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
మాక్స్వెల్ మిరాకిల్: అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. అలాంటి చూసేందుకు మనకు అదృష్టం ఉండాలి. మంగళవారం అఫ్గానిస్థాన్, ఆసీస్ మ్యాచ్ చూసిన వారికి ఇదే అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే క్రికెట్లో నిలకడైన విజయాలతో మేటి జట్లకు దీటైన పోటీనిస్తున్న అఫ్గన్..ఆసీస్‌కు ఝలకిచ్చే ప్రయత్నం చేసింది. కానీ అది సాధ్యపడలేదు. దాదాపు ఓడించినంత పనిచేసిన కాబూలీలు…ఆసీస్‌ను కంగారెత్తించారు. నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ టాపార్డర్ పేక మేడను తలపించింది. హెడ్, ఇంగ్లిస్ సున్నాలు చుట్టగా, వార్నర్(18), మిచెల్ మార్ష్(24), లబుషేన్(14), స్టొయినిస్(6) బ్యాటర్లందరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 90 పరుగులకే సగం బ్యాటర్లు పెవిలియన్‌లో ఉన్నారు. కండ్ల ముందు చూస్తే కొండంత లక్ష్యం. కానీ ఇక్కడే మ్యాక్స్‌వెల్ తన విలువేంటో ఘనంగా చాటిచెప్పాడు. తనను అసాధారణ క్రికెటర్ అని ఎందుకు అంటారో చేతల్లో చూపించాడు.
కెప్టెన్ కమిన్స్(68 బంతుల్లో 12 నాటౌట్, ఫోర్)ను అండగా చేసుకుంటూ మ్యాక్స్‌వెల్..అఫ్గన్‌పై ధ్వంసరచన చేశాడు. మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మ్యాక్స్‌వెల్ పోరాటానికి ప్రతీరూపంగా నిలిచాడు. ఓవైపు గాయం వేధిస్తున్నా..జట్టును గెలిపించడమే లక్ష్యంగా మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ కొనసాగించాడు. బంతి బంతికి నరకం కండ్ల ముందు కనిపిస్తున్నా.. మ్యాక్స్‌వెల్ మొండిగా పోరాడాడు. అఫ్గన్ బౌలర్లు ఎన్ని రకాలుగా ఔట్ చేసేందుకు ప్రయత్నించినా విఫలం కాగా, మ్యాక్స్‌వెల్ కొట్టిన బౌండరీలకు వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
1 వన్డేల్లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో పరుగుల పరంగా మ్యాక్స్‌వెల్, కమిన్స్ భారీ భాగస్వామ్యం(202*) టాప్‌లో నిలిచింది.
3 ఓవరాల్‌గా వన్డే ప్రపంచకప్‌లో గప్టిల్(237*), గేల్(215) తర్వాత ఎక్కువ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్
(201*) నిలిచాడు.
1 ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్(201*) నిలిచాడు. వాట్సన్ (185*) రికార్డు చెరిగిపోయింది.
వన్డేల్లో లక్ష్యఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మ్యాక్స్‌వెల్ పేరిట నమోదైంది. ఫఖర్ జమాన్(193) రికార్డు రెండో స్థానానికి పడిపోయింది.
అఫ్గానిస్థాన్: 50 ఓవర్లలో 291/5(ఇబ్రహీం 129 నాటౌట్, రషీద్‌ఖాన్ 35 నాటౌట్, హాజిల్‌వుడ్ 2/39, మ్యాక్స్‌వెల్ 1/55),
ఆస్ట్రేలియా: 46.5 ఓవర్లలో 293/7(మ్యాక్స్‌వెల్ 201 నాటౌట్, మార్ష్ 24, రషీద్‌ఖాన్ 2/44, నవీన్‌వుల్ హక్ 2/47)