Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi) మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థులకు వణుకే. ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తూ.. కీలక సమయాల్లో మెస్సీ మెరుపు వేగంతో గోల్ కొట్టిన సందర్భాలు అనేకం. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో స్టన్నింగ్స్ గోల్స్ కొట్టాడు. బార్సిలోనా(Barcelona) క్లబ్‌కు ఆడిన రోజుల్లో అతడు ఒక సూపర్ గోల్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మాంచెస్టర్ యునైటెడ్(Manchester United)తో 2009 మే 27న జరిగిన చాంపియన్ లీగ్ ఫైనల్లో మెస్సీ తన మ్యాజిక్ చూపించాడు. సహచరుడు గ్జావి పాస్ చేసిన బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి తలతో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అంతే.. ప్రత్యర్థి జట్టు షాక్‌లో ఉండిపోగా.. బార్సిలోనా ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 2-0తో గెలుపొందింది.
ఇప్పటికీ 15 ఏండ్లు గడిచినా సరే ఆ గోల్‌ను తాను మర్చిపోలేదని ఆ మ్యాచ్‌లో ఆడిన మాంచెస్టర్ యునైటెడ్ ఢిఫెండర్ రియో ఫెర్డినాండ్ అన్నాడు. 2022లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందంచిన మెస్సీ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌కు ఆడుతున్నాడు.