పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ 5-0తో నార్త్ఈస్ట్ యునైటెడ్‌ను చిత్తు చేసింది. స్టార్ స్ట్రయికర్ ఒగ్బాచె (3వ, 60వ ని.ల్లో) డబుల్ గోల్స్‌తో చెలరేగగా.. ఆకాశ్ మిశ్రా (45వ ని.లో), నిఖిల్ పుజారీ (84వ ని.లో), గార్సియా (88వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రత్యర్థి జట్టు తరఫున కనీస ప్రతిఘటన ఎదురుకాకపోగా.. ఏడో విజయంతో హైదరాబాద్ 26 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిర్ణీత సమయంలో హైదరాబాద్ 20 షాట్లు ఆడగా.. ప్రత్యర్థి జట్టు ఎనిమిదింటికే పరిమితమైంది. మ్యాచ్ మూడో నిమిషంలోనే హైదరాబాద్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లిన ఒగ్బాచె.. ఈ సీజన్లో 14 గోల్స్‌తో అందరికంటే టాప్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా ఐఎస్ఎల్లో అడుగుపెట్టిన మూడున్నరేండ్లలోనే 49 గోల్స్ బాది.. సునీల్ చెత్రీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరాడు.