ఫిలడెల్ఫియా: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాప్పే(Kylian Mbappe) జోరు కొనసాగిస్తున్నాడు. గ్రూప్ ఐ లో ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 3-0 గోల్స్ తేడాతో ఇరాక్‌పై విజయం సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో గ్రూప్ స్టేజ్‌లో ప్రస్తుతం ఆ జట్టు అగ్ర స్థానంలో ఉన్నది. ఇక ఆల్‌టైం గోల్స్ రేసులో ఎంబాప్పే దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ మెస్సీ 18 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, ఇరాక్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి మొత్తం వరల్డ్‌కప్ వ్యక్తిగత గోల్స్ సంఖ్యను 16 చేర్చుకున్నాడు ఎంబాప్పే. ఫ్రాన్స్ కెప్టెన్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీల్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో మొత్తం 16 గోల్స్ చేశాడు. చాలా తక్కువ టైంలోనే ఎంబాప్పే .. అత్యధిక గోల్స్ చేశాడు.
ఫ్రాన్స్, ఇరాక్ మధ్య మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యం అయ్యింది. రెండు గంటల బ్రేక్ తర్వాత సెకండ్ హాఫ్ జరిగింది. మెరుపులు, పిడుగులు పడడం వల్ల మ్యాచ్ ఆలస్యమైంది. మ్యాచ్ టైంకే స్టార్ట్ అయినా వర్షం వల్ల మైదానం మొత్తం చిత్తడిగా మారింది. కానీ ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాప్పే మాత్రం తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. పూర్తి ఆధిపత్యంతో ఫ్రాన్స్ ఆడింది. ఆట 14వ నిమిషంలో ఎంబాప్పే తొలి గోల్ చేశాడు. ఎడమ కాలితో పెనాల్టీ ఏరియా చివరి నుంచి గోల్ కొట్టాడు. మళ్లీ 54వ నిమిషంలో ఎంబాప్పే తన రెండో గోల్ చేశాడు. సెకండ్ హాఫ్‌లో ఇరాక్ తన వద్ద బంతిని ఎక్కువసేపే ఉంచుకున్నా.. గోల్స్ మాత్రం చేయలేకపోయింది. ఫ్రాన్స్ ప్లేయర్ డెంబ్లి 66వ నిమిషంలో గోల్ చేశాడు. ఈ టోర్నీలో ఇరాక్ ఇంత వరకు ఒక్క పాయింట్ కూడా గెలవలేదు.