వార్సా(పోలాండ్): ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి నిరాశపరిచింది. తన టైటిల్ నిలబెట్టుకుంటుందనుకున్న హంపి తొలి మూడు స్థానాల్లో కూడా నిలువలేకపోయింది. ఏడు రౌండ్లలో నాలుగింటిలో విజయాలు సాధించిన హంపి..మంగళవారం జరిగిన ఆఖరి నాలుగు గేమ్స్‌ను డ్రా చేసుకుంది. దీంతో 11 రౌండ్లకు గాను 7.5 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ మాస్టర్ గుల్నార్(అజర్బైజాన్)తో జరిగిన 11వ గేమ్‌లో విజయం సాధిస్తే హంపి టాప్-3లోకి వచ్చే అవకాశమున్నా.. అది సాధ్యపడలేదు. మరోవైపు పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ 13 రౌండ్లలో 12 ముగిసిన తర్వాత 8.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, తెలంగాణకు చెందిన హర్ష భరత్‌కోటి 7 పాయింట్లతో 36వ స్థానంలో ఉన్నాడు.