కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కమాల్ చేసింది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ ఆఖరి పోరులోనూ అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పూర్తి ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో కోల్‌కతా చిరస్మరణీయ విజయంతో కదంతొక్కింది. సరిగ్గా పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబురాల్లో మునిగిపోయింది.
కోల్‌కతా బౌలర్లు
ఆది నుంచే బుల్లెట్ లాంటి బంతులు సంధించిన వేళ భారీ అంచనాలతో తుదిపోరులో అడుగుపెట్టిన హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నారు. ఈ సీజన్లో తమ డాషింగ్ బ్యాటింగ్‌తో రికార్డులు తిరుగరాసిన అభిషేక్‌శర్మ, ట్రావిస్‌హెడ్ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్ల విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయిన హైదరాబాద్..చివర్లో కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్‌తో పరువు దక్కించుకుంది. సీజన్లో బౌండరీల సునామీ సృష్టించిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు, 8ఫోర్లకు పరిమితమై తుది మెట్టుపై బోల్తాకొట్టింది. స్వల్ప లక్ష్యఛేదనలో ఆదిలోనే సునీల్ నరైన్ నిష్క్రమించినా..వెంకటేశ్ అయ్యర్, గుర్బాజ్ బ్యాటింగ్‌తో కోల్‌కతా అలవోక విజయంతో ఈ యేటి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.
చెన్నై: పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ లీగ్‌లో మూడోసారి కప్పు కొట్టింది. తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఊదేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది. సారథి పాట్ కమిన్స్ (19 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఛేదనలో వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పిడుగులా విరుచుకుపడ్డాడు. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ?? కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డులు లభించాయి.
సన్‌రైజర్స్ సమిష్టి వైఫల్యం:
ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమైతే నలుగురు రెండంకెల స్కోరు చేశారు. అందులోనూ 9వ స్థానంలో వచ్చిన సారథి కమిన్స్.. 24 పరుగులతో టాప్ స్కోరర్. ఇంతే..! కీలకమైన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ప్రదర్శన ఇది. చెపాక్ పిచ్‌పై రైడర్స్ బౌలర్లు సమిష్టిగా సత్తా చాటితే రైజర్స్ బ్యాటర్లు గంపగుత్తగా చేతులెత్తేశారు. నాకౌట్ మ్యాచ్‌లు అంటేనే నిప్పులు చెరిగే స్టార్క్.. మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ (2)ను బౌల్డ్ చేసి హైదరాబాద్ వికెట్ల పతనానికి కొబ్బరికాయ కొట్టాడు.
ఆ తర్వాత ఏ దశలోనూ దీనికి అడ్డుకట్టపడలేదు. వైభవ్ రెండో ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడంతో అతడు మరోసారి ఉత్తచేతులతోనే వెనుదిరగగా స్టార్క్ 3వ ఓవర్లో త్రిపాఠి (9)నీ ఔట్ చేసి ఎస్ఆర్హెచ్ను కోలుకోకుండా చేశాడు. 4 ఓవర్ల పాటు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన నితీశ్ (13), మార్క్మ్ (20) సైతం హైదరాబాద్‌ను గట్టెక్కించలేకపోయారు. ఆరంభ ఓవర్లలో స్టార్క్, అరోరా చెలరేగితే మిడిల్ ఓవర్లలో రస్సెల్, హర్షిత్.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల పనిపట్టారు. క్లాసెన్ (16), సమద్ (4) సైతం నిరాశపరిచారు. ఆఖర్లో కమిన్స్ పుణ్యమా అని సన్‌రైజర్స్ మూడంకెల స్కోరు చేయగలిగింది. కేకేఆర్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించగా అందరికీ వికెట్లు దక్కడం విశేషం.
వెంకటేశ్ ధనాధన్:
స్వల్ప ఛేదనలో కోల్‌కతా రెండో ఓవర్లోనే నరైన్ (6) వికెట్ కోల్పోయినా వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ కమిన్స్ దళంపై ఉరుములా మీదపడటంతో అసలే చిన్నలక్ష్యం మరింత చిన్నబోయింది. భువీ 3వ ఓవర్లో 4, 6, 6తో 20 పరుగులు రాబట్టగా, నటరాజన్ 6వ ఓవర్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ దంచడంతో మన బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేయకపోతారా! అని ఆశలు పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. మరో ఎండ్‌లో గుర్బాజ్ సైతం వీలుచిక్కినప్పుడల్లా బాదుతూనే అయ్యర్‌కు అండగా నిలవడంతో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ స్కోరు 72-1గా నిలిచింది. రెండో వికెట్‌కు 91 పరుగులు జోడీంచిన ఈ జోడీ లక్ష్యం దిశగా సాగుతుండగా.. షాజాబ్ 9వ ఓవర్లో గుర్బాజ్‌ను ఎల్బీగా ఔట్ చేసినా శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్) అండతో వెంకటేశ్.. అర్థసెంచరీతో పాటు గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్ (కమిన్స్ 24, మార్క్మ్ 20, రస్సెల్ 3/19, స్టార్క్ 2/14).
కోల్‌కతా: 10.3 ఓవర్లలో 114/2 (వెంకటేశ్ 52 నాటౌట్, గుర్బాజ్ 39, కమిన్స్ 1/18, షాబాజ్ 1/22)
1 ఐపీఎల్ ఫైనల్లో ఇదే అత్యల్ప స్కోరు. గతం (2013)లో ముంబైతో మ్యాచ్‌లో చెన్నై (125/9) లోయెస్ట్ స్కోరును
నమోదు చేసింది.