మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చాంపియన్ ఆవిర్భవించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కజకిస్థాన్ ప్లేయర్ ఎలెనా రిబాకినా తన టైటిల్ కలను సాకారం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో రిబాకినా 6-4, 4-6, 6-4తో ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాపై అద్భుత విజయం సాధించింది. 2022లో వింబుల్డన్ గెలిచిన రిబాకినాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. నువ్వానేనా అన్నట్లు జరిగిన పోరులో రిబాకినా 6ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టగా, మూడు డబుల్ ఫాల్ట్స్, 25 అనవసర తప్పిదాలు చేయగా, మరోవైపు సబలెంకా ఐదు ఏస్‌లు, 35 విన్నర్లు, రెండు డబుల్ ఫాల్ట్స్, 26 అనవసర తప్పిదాలు చేసింది. మ్యాచ్‌లో ఇది నుంచే రిబాకినా తనదైన దూకుడు కనబరిచింది.
టాప్‌సీడ్ సబలెంకాకు దీటైన పోటీనిస్తూ సర్వీస్‌ను తొలిగేమ్లోనే బ్రేక్ చేసి అనూహ్యంగా షాక్ ఇచ్చింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో సబలెంకాను కోర్టు నలమూలల పరిగెత్తిస్తూ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో నలభై నిమిషాల్లోపే తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్లో సబలెంకా అద్భుతంగా పుంజుకుంది. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరిస్తూ సెట్‌ను కైవసం చేసుకుని పోటీలోకి వచ్చింది. నిర్ణయాత్మక మూడో సెట్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండో సెట్ గెలిచిన జోరులో సబలెంకా వరుసగా మూడు గేములు గెలిచి 3-0తో ఆధిక్యం కనబరిచింది. మ్యాచ్ ఇక సబలెంకాదే అనుకున్న తరుణంలో రిబాకినా పుంజుకున్న తీరుతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. పదునైన ఏస్‌లతో సబలెంకాను రిబాకినా ఉక్కిరిబిక్కిరి చేసి మ్యాచ్‌ను తన వశం చేసుకుంది.