FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో కోస్తారికా జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీదున్న జపాన్‌కు షాక్ ఇచ్చింది. అహ్మద్బిన్ అలీ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్-ఇ మ్యాచ్‌లో కోస్తారికా 1-0తో జపాన్ మీద గెలుపొందింది. కీషెర్ ఫుల్లర్ 81వ నిమిషంలో గోల్ చేయడంతో కోస్తారికా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో కోస్టారికా గ్రూప్-ఇలో మూడో స్థానానికి చేరింది.
మ్యాచ్ ఆరంభమైన మొదటి అర్థ భాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా కొట్టలేదు. రెండో అర్థభాగంలో జపాన్ టీమ్ దూకుడుగా ఆడింది. కోస్తారికా గోల్ పోస్ట్ వైపు దూసుకొచ్చి గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, కోస్తారికా గోల్ కీపర్, డిఫెన్స్ జపాన్ గోల్ ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. తొలి మ్యాచ్‌లో కోస్టారికా జట్టు స్పెయిన్ చేతిలో 0-7 గోల్స్‌తో దారుణంగా ఓడిపోయింది. జపాన్ టీమ్ తమ మొదటి మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీపై 2-1 గోల్స్‌తో గెలిచింది.