నెల రోజులుగా క్రీడాభిమానులను గోల్స్ గోలలో ముంచెత్తిన ఫిఫా ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. స్థాయికి తగ్గ ఆటతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్‌కు దూసుకొస్తే.. స్టార్ స్రయికర్ లియోనెల్ మెస్సీ అసమాన ప్రతిభతో అర్జెంటీనా ఆఖరి ఆటకు రెడీ అయింది. కప్పు కొట్టి.. ఫుట్‌బాల్ మాంత్రికుడు డిగో మారడోనాకు ఘనమైన నివాళి అర్పించాలని అర్జెంటీనా తహతహలాడుతుంటే.. ఆరు దశాబ్దాల్లో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కాలని ఫ్రాన్స్ భావిస్తున్నది. బరిలోకి దిగేది రెండు జట్లే అయినా.. భావోద్వేగాల్లో ప్రపంచ యుద్ధానికి తీసిపోని సమరాన్ని వీక్షించేందుకు మీరూ సిద్ధమైపోండి.
దోహ: క్రీడాలోకం యావత్తు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సాకర్ తుది సమరానికి వేళైంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న అర్జెంటీనా.. వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టగా.. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్న ఫ్రాన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తుదిపోరుకు చేరుకుంది.
ఆరేండ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలకాలనుకున్న అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించగా.. తమ స్టార్ కోసం కప్పు నెగ్గాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఉత్తుంగతరంగంలా ఎదుగుతున్న కిలియన్ ఎంబాపే.. ఫ్రాన్స్‌కు వరుసగా రెండో టైటిల్ అందించాలని పట్టుదలతో ఉన్నాడు. మరి 35 ఏండ్ల మెస్సీ కల నెరవేరుతుందా.. లేక 23 ఏండ్ల ఎంబాపే నయా సాకర్ సూపర్ స్టార్‌గా అవతరిస్తాడా నేడు తేలనుంది. 19 ఏండ్ల వయసులోనే గత ప్రపంచకప్ (2018)లో అదరగొట్టిన ఎంబాపేపై భారీ అంచనాలు నెలకొనగా.. అతడిని అడ్డుకుంటేనే అర్జెంటీనా ముందడుగు వేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిష్ఠాత్మక గోల్డెన్ బూట్ రేసులోనూ మెస్సీ, ఎంబాపే చెరో ఐదు గోల్స్‌తో ముందున్నారు. ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో రెండుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకోగా.. మూడోసారి కప్పును ముద్దాడేదెవరో నేడు తేలనుంది. 2014లో ఒంటరి పోరాటంతో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన మెస్సీ రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. కెరీర్ చివరి మ్యాచ్‌లో అద్వితీయ ప్రదర్శనతో సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. మరోవైపు 1998, 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జట్టుగా ఎదిగింది. డిఫెండర్లు, స్ట్రయికర్లు, గోల్ కీపర్స్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
6-3 ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ 12 సార్లు తలపడగా.. అందులో ఆరింట అర్జెంటీనా.. మూడింట ఫ్రాన్స్ విజయాలు సాధించాయి. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.
గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైన క్రొయేషియా.. శనివారం ప్లేఆఫ్ పోరులో 2-1తో మొరాకోపై విజయం సాధించింది. క్రొయేషియా తరఫున వార్డియోల్ (7వ నిమిషంలో), ఓర్సిచ్ (42వ ని.లో) చెరో గోల్ చేయగా.. మొరాకో జట్టు నుంచి అచ్రఫ్ (9వ ని.లో) ఏకైక గోల్ నమోదు చేశాడు.