టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉంది. గత మ్యాచ్లో ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుకు షాకిచ్చిన ఐర్లాండ్.. మరో విజయం తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంది. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు.
అలాగే గత రెండు మ్యాచ్లలో పేలవంగా ఆడి ఓటమి చవిచూసిన ఆఫ్ఘనిస్తాన్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కనిపించింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. వర్షం కొద్దిగా తగ్గినప్పటికీ జల్లులు ఆగకుండా పడుతూనే ఉన్నాయి. దీంతో పలుమార్లు వాతావరణాన్ని పరిశీలించిన అనంతరం.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.