Iran Coach : ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ పోరును డ్రా చేసుకున్న ఇరాన్(Iran)కు ఊహించని పరిస్థితి ఎదురైంది. న్యూజిలాండ్‌పై అదరగొట్టిన ఉత్సాహంలో ఉన్న ఆ జట్టును తక్షణమే తమ దేశం వీడాలని అమెరికా అధికారులు ఆదేశించారు. దాంతో, ‘ఇదెక్కడి అన్యాయం’ అంటూ ఇరాన్ ఇరాన్ కోచ్ అమిర్ ఘలెనోయి(Amir Ghalenoei) నిరసన తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో అణచివేతకు గురవుతున్న జట్టు తమదేనని అమిర్ వాపోయాడు.
పశ్చిమాసియాలో ఇరాన్ – అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. మైదానంలో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా అధికారులు వివాదానికి తెర తీశారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్న ఇరాన్ జట్టను వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని అమెరికా అధికారులు ఆదేశించారు. అయితే.. ఈ నిర్ణయంపై ఇరాన్ కోచ్ అమిర్ ఘలెనోయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే అమెరికాలో అడుగుపెట్టి.. గేమ్ అవ్వగానే తిరిగి వెళ్లాలని అధికారులు చెప్పడం అన్యాయమని ఆయన పేర్కొన్నాడు.
Iran team forced to leave United States immediately after New Zealand game as manager hits out at FIFA https://t.co/iglW8epuFR pic.twitter.com/nir2I3YjSn
— SPORTbible (@sportbible) June 16, 2026
‘ఈ రోజు మ్యాచ్ అనంతరం మమ్మల్ని అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశించారు. లాస్ ఎంజెల్స్‌లో ఉండి కాస్త రిలాక్స్ అవుదామనుకుంటే మమ్మల్ని మెక్సికోలోని మా శిక్షణ కేంద్రం టిజువానాకు వెళ్లాలని చెప్పారు. మాకు టోర్నీ ఆసాంతం ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట్లో వీసా, ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సహాయక సిబ్బంది, ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మహెది తాజ్ లేకుండానే మేము లాస్ ఏంజెల్స్ వచ్చాం.
Iran head coach Amir Ghalenoei says they are the “most oppressed” team at the World Cup after having last-minute travel restrictions imposed on them. pic.twitter.com/0VVdHlrC2Y
— BBC Sport (@BBCSport) June 16, 2026
ఇక్కడ మేము పడుతున్న కష్టాలను ప్రపంచానికి చెప్పడానికి మాదేశ ఫుట్‌బాల్ సమాఖ్య ఇక్కడ లేదు. మా మీడియా లేదు. మా మేనేజ్మెంట్ కూడా లేదు. మొత్తంగా చూస్తే.. ఈ టోర్నమెంట్లో అణచివేతకు గురవుతున్న జట్టు మాదే’ అని అమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కెప్టెన్ మెహ్దీ తరేమీ, మిడ్‌ఫీల్డర్ మొహమ్మద్ మొహెబీ సైతం అమెరికా తీరును తప్పుబట్టారు. ఈ సమయంలో తమకు ఫిఫా భరోసాగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ ఆటగాళ్లు. గ్రూప్ జీలోని ఇరాన్ తర్వాతి మ్యాచ్‌లో జూన్ 22న బెల్జియంను ఢీ కొట్టనుంది.