న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్ చరిత్రలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. మెగా ఈవెంట్లలో క్రీడాకారులు ఎదుర్కొనే లైంగిక, మానసిక వేధింపులు, నిర్లక్ష్యం వంటి సమస్యల పరిష్కారానికి తొలిసారిగా ప్రత్యేకంగా ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’ ను నియమించింది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లకు రక్షణగా నీతల్ నారంగ్ బాధ్యతలు నిర్వహించనుంది.
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) నిబంధనలను తప్పనిసరి చేయడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షురాలు అయిన నీతల్ అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) నిర్దేశిత కోర్సును పూర్తి చేసి సర్టిఫైడ్ సేఫ్గార్డింగ్ ఆఫీసర్ హోదా సాధించింది. ఆసియాడ్‌లో క్రీడాకారులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, వేధింపులు, బాడీ షేమింగ్, వివక్ష, నిర్లక్ష్యం నుంచి తీవ్రమైన లైంగిక వేధింపుల వరకు ప్రతీ అంశం, ఫిర్యాదును పరిశీలించి అథ్లెట్లకు అండగా నిలవనుంది. ఇప్పటికే అథ్లెట్లకు ఈ అంశంపై ప్రాథమిక అవగాహన కల్పించారు.