నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
శ్రీలంక పర్యటన కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు కొలంబోలో అడుగుపెట్టింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన సమస్యే ఇప్పుడు కూడా జట్టును కలవరపెడుతోంది. అదే కీలక ఆటగాళ్ల గాయాల సమస్య. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్ మొత్తానికి దూరం కాగా, కాలి కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టు సమయానికి అందుబాటులోకి వస్తాడో లేదో స్పష్టత లేదు. మరోవైపు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. సుదర్శన్ లేకుండానే భారత్.. లంక చేరుకుంది. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా సెంట్రల్ కాంట్రాక్టులోని పలువురు కీలక ఆటగాళ్లనూ గాయాలు వెంబడిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హారిక్ పాండ్యా భారత్ తరఫున మరో మ్యాచ్ ఆడలేదు. బీసీసీఐ సీఓఈలో ఉండి ఫిట్నెస్ పెంచుకునేందుకు తన మకాంను బెంగళూరుకు మార్చుకున్నాడు. బౌలింగ్ వేగం పెంచే క్రమంలో మరో ఆల్‌రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ రెడ్డి తొడ కండరాల గాయంతో జట్టుకు దూరం అవ్వగా.. యంగ్ పేసర్ హర్షిత్ రాణా మోకాలు, కండరాల సమస్యలతో సతమతమవుతున్నాడు. భారత క్రికెటర్లు పదే పదే ఎందుకు గాయాల బారిన పడుతున్నారు? వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ ఎక్కడ దారితప్పుతోంది? అనేది చర్చనీయాంశమైంది.
గతంలో మాదిరిగా క్రికెటర్లకు నిర్దిష్టమైన ఆఫ్ సీజన్ లభించడం లేదు. బిజీ క్యాలెండర్ వల్ల ఆటగాళ్లకు విశ్రాంతి కొరవడుతోంది. రికవరీ ప్రోటోకాల్స్, ట్రైనింగ్ ప్రోటోకాల్స్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే గాయాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక, ఐపీఎల్ జరిగే రెండు నెలల సమయంలో ఆటగాళ్లు వారానికి రెండు, మూడు మ్యాచ్‌లు ఆడుతూ రికవరీ మోడ్‌లోనే ఉంటారు. ఆ సమయంలో ఫిట్నెస్ లెవెల్ పెంచుకునే కఠిన శిక్షణ జరగదు. మెగా లీగ్ ముగిసిన వెంటనే జాతీయ జట్టుకు ఆడేటప్పుడు వర్క్‌లోడ్ (పనిభారం) ఒక్కసారిగా పెరుగుతుంది. ఐపీఎల్ సమయంలో టెస్టులు లేదావన్డే క్రికెట్‌కు తగినట్టు ముందుగానే సిద్ధపడకపోవడం వల్ల శరీరానికి తీవ్ర ఒత్తిడి గురై ఆటగాళ్లు గాయపడుతున్నారు. ఇందుకు బుమ్రాను ఉదాహరణగా తీసుకోవచ్చు. మోకాలి నొప్పితోనే గత టీ20 వరల్డ్ కప్ ఆడిన బుమ్రా ఐపీఎల్లో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని వర్క్‌లోడ్‌ను క్రమంగా పెంచాల్సి ఉంటుందని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే చెప్పాడు. ఈ కారణంగానే బుమ్రా బౌలింగ్‌లో వేగం కొద్దిగా తగ్గింది. ఐపీఎల్ తర్వాత అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20తో టీ20లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్నప్పటికీ కార్డిఫ్ వన్డేల్లో అతని మోకాలి గాయం తిరగబెట్టింది.
టీ20 ఫార్మాట్‌కు, టెస్టు క్రికెట్‌కు కావలసిన ఫిట్నెస్ నైపుణ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో రెండు నెలల పాటు హై-ఇంటెన్సిటీ పవర్ గేమ్ ఆడిన ఆటగాళ్లు, ఒక్కసారిగా అధిక శారీరక, మానసిక శక్తి అవసరమయ్యే టెస్టు క్రికెట్లోకి మారడం అత్యంత ప్రమాదకరమని గతంలో భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేసిన రాంజీ శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇక, బిజీ షెడ్యూల్ వల్ల ఫార్మాట్లకు తగినట్టు శిక్షణ పొందేందుకు ఆటగాళ్లకు తగినంత సమయం దొరకడం లేదు. 2024లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు చెన్నైలో ప్రీ-సీజన్ క్యాంప్ నిర్వహించగా, ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌కు ముందు కొలంబోలో మాత్రమే క్యాంప్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. సిరీస్‌ల మధ్య తగినంత రికవరీ సమయం లేకపోవడంతో ట్రైనర్లు సూచించిన ఫిట్నెస్ అంశాలపై శ్రమించే అవకాశం ఆటగాళ్లకు లభించడం లేదు.
పలువురు ఆటగాళ్లు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే తొందరపడి జట్టులోకి వస్తున్నారు. గతంలో గాయపడిన ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్న తర్వాతనే సెలెక్టర్లు జాతీయ జట్టులోకి ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనను కఠినంగా అమలు చేయడం లేదు.ప్రాథమిక ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాగానే జట్టులోకి తీసుకుంటున్నారు తప్ప, ఆటగాడి మ్యాచ్ ఫిట్నెస్ నిజంగా మెరుగుపడిందా లేదా అన్నది చూడటం లేదు. లంక టూర్‌కు ముందుగా సుదర్శన్‌తో పాటు బుమ్రాను ఎంపిక చేసినా.. ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాలన్న షరతు పెట్టారు. తర్వాత బుమ్రాను సిరీస్ నుంచి తప్పించారు. బీసీసీఐ ఇప్పటికైనా టెస్టు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రీ-సీజన్ క్యాంపులు ఏర్పాటు చేసి, కఠినమైన ఫిట్నెస్ ప్రోటోకాల్స్ అమలు చేయకపోతే మున్ముందు మరిన్ని సిరీస్‌లకు కీలక ఆటగాళ్లు దూరమయ్యే ప్రమాదం ఉంది.